చాలామంది ఇళ్లలో ఇప్పుడు పక్షులు కనిపిస్తున్నాయి. అలవాటుగా కొందరు; ఆహ్లాదం కోసం మరికొందరు; నమ్మకాలు, విశ్వాసాలను పాటిస్తూ ఇంకొందరు.. వాటిని పెంచుకుంటున్నారు. అందమైన బోనుల్లో ఉంచి.. వాటిని అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే, తెలియకుండా చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్లు.. పక్షులకు ప్రాణాంతకంగా మారుతుంటాయి. అలా అవ్వొద్దంటే.. కింది సూచనలు పాటించాలి.
కొందరు పక్షులకు ప్రేమగా.. చాక్లెట్లు, చిప్స్, స్నాక్స్ తినిపిస్తుంటారు. అవి వాటికి ఏమాత్రం సురక్షితం కాదు. శుభ్రమైన తాజా పండ్లు, విత్తనాలు మాత్రమే అందించాలి.
పక్షుల దగ్గర ఘాటైన క్లీనింగ్ స్ప్రేలు, ఎయిర్ ఫ్రెష్నర్లను, బాడీ స్ప్రేలను ఎట్టిపరిస్థిత్లులోనూ ఉపయోగించవద్దు. పిట్టల ఊపిరితిత్తులు చాలా సున్నితంగా ఉంటాయి. రూమ్ స్ప్రేలు, బాడీ స్ప్రేల నుంచి వచ్చే వాసనలు వాటికి హానికరంగా పరిణమిస్తాయి.
బాగా అలవాటైన తర్వాత పక్షులను ఇంట్లో ఫ్రీగా వదిలేస్తారు. అలాంటప్పడు వాటికి ఇంట్లోని కొన్ని వస్తువులతో హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా.. సీలింగ్ ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు పక్షులను బోను నుంచి బయటికి తీయకపోవడమే మంచిది.
కొన్నిరకాల పెంపుడు పక్షులు బొమ్మలతో ఆడుకుంటాయి. అలాంటి బొమ్మలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెయింట్ వేయని చెక్క బొమ్మలైతే మంచిది. చిన్నచిన్న భాగాలుగా విడిపోయే ప్లాస్టిక్ బొమ్మలు.. ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. పక్షులు వాటిని ఆహారంగా పొరబడి మింగే అవకాశం ఉంటుంది.
వంటగది పొగ కూడా పక్షుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కిచెన్లో ఉపయోగించే ఆయిల్స్, వెనిగర్, మిరపకాయ వంటి వాసనలను పక్షులు అసహ్యించుకుంటాయి. కాబట్టి, పంజరాన్ని వంటగదికి దూరంగా ఉంచండి. స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా చూడండి.
పక్షులు రాత్రిపూట ప్రశాంతంగా ఉండాలంటే.. వాటిచుట్టూ వాతావరణం చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. కొన్నిరకాల లైట్లు.. పక్షుల కళ్లకు హాని కలిగిస్తాయి. వాటిని నిద్రభంగం కలిగిస్తాయి. అలాంటి లైట్లను దూరం పెట్టాలి.