వాకింగ్.. అన్నిటికన్నా సులభమైన, ఎన్నో ప్రయోజనాలు అందించే వ్యాయామం. అంతకుమించిన ఫలితాలు దక్కాలంటే.. ‘రకింగ్’ చేయాల్సిందే! ఈ నయా ఎక్సర్సైజ్.. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నది. మరి.. అసలు ‘రకింగ్’ అంటే ఏంటి?
దాన్ని ఎలా చేయాలి? ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం!
రకింగ్ అంటే.. బరువుగా ఉండే బ్యాక్‌ప్యాక్‌ను ధరించి వాకింగ్ చేయడమే! శిక్షణలో భాగంగా సైనికుల్లో ఓర్పును పెంపొందించడానికి ఈ వ్యాయామాన్ని ఎక్కువగా చేయించేవారు. ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో సాధారణ వ్యాయామంగా ప్రజాధరణ పొందింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫిట్నెస్ ఫ్రీక్‌గా
తెగ ట్రెండ్ అవుతున్నది.
సాధారణ వాకింగ్‌తో పోలిస్తే, రకింగ్ ద్వారా 13 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయట. అమెరికన్ కౌన్సిల్ నిర్వహించిన ఓ అధ్యయనం.. ఈ విషయాన్నితేల్చింది. 55 కిలోల వ్యక్తి.. 9 కిలోల బరువుండే బ్యాగుతో రకింగ్ చేస్తే.. గంటకు 420 కేలరీలు బర్న్ అవుతాయని సదరు సర్వేలో వెల్లడైంది. బరువుగా ఉండే
బ్యాక్‌ప్యాక్ ధరించి నడవడం వల్ల కాళ్లు, భుజాలు పూర్తిస్థాయిలో పనిచేస్తూ, శరీరం మొత్తానికీ వ్యాయామం లభిస్తుంది. ఇక రన్నింగ్‌తో పోలిస్తే.. రకింగ్లో మోకీళ్లపై ప్రభావం తక్కువగా ఉంటుంది. మోకాళ్లు, చీలమండపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికీ ఇది భరోసా ఇస్తుంది. కండరాలకు బలాన్ని
అందిస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే.. రకింగ్ను ‘మెంటల్ మారథాన్’గానూ అభివర్ణిస్తున్నారు.