ఇండిపెండెంట్ ఇల్లయినా.. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా.. ఇప్పుడు చాలామంది పెరటి మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఇంటికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నారు. కనీసంలో కనీసంగా.. కొత్తిమీర, పుదీనా అయినా పెంచుతున్నారు. ఈ క్రమంలో.. వంటింటి వ్యర్థాలతో పెరటి మొక్కల ఎరువును తయారుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. చెత్తబుట్టలో పడేసే కోడిగుడ్డు పెంకులు.. మంచి పోషణనిస్తాయని అంటున్నారు. వీటిలో అధికంగా లభించే కాల్షియం.. మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. పురుగులు, శిలీంధ్రాల నుంచి రక్షణ కల్పిస్తుంది. కోడిగుడ్డు పెంకులను ముక్కలుగా చేసి మొక్క చుట్టూ చల్లితే.. మట్టిలో పురుగులు బెదిరిపోతాయి. అలా క్రిమి కీటకాలు మొక్కల దగ్గరికి చేరకుండా.. రక్షణ కవచంలా పనిచేస్తాయి.
ఇక, కోడిగుడ్డు పెంకులను పొడిగా మార్చి మొక్కలకు ఎరువుగానూ వాడుకోవచ్చు. ఇందులోని కాల్షియం మట్టిలో కరిగి.. మొక్కకు అందుతుంది. గుడ్డు పెంకులతోపాటు, వడకట్టిన టీ పొడి, ఉల్లి, వెల్లుల్లి లాంటివాటి పొట్టు, కూరగాయల తొక్కలు కూడా ఎరువుగా ఉపయోగపడతాయి. మొక్కలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే.. ఇంటికి కావాల్సిన తాజా కూరగాయలను పండించుకోవచ్చు.