బాలీవుడ్ సీనియర్ నటి జుహీచావ్లాను ఆకాశానికి ఎత్తేస్తున్నది మధుబాల. ‘ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి!’ అంటూ తెగ పొగిడేస్తున్నది. దగ్గరి బంధువులైన ఈ సీనియర్ హీరోయిన్లు ఇద్దరూ.. సినిమా ఫంక్షన్లలోనే కాదు, ఫ్యామిలీ మీటింగ్స్‌లోనూ తరచుగా కలుస్తుంటారు. ఈ క్రమంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జుహీచావ్లాతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నది మధుబాల.
“కొన్నేళ్లుగా జూహీని దగ్గరినుంచి చూస్తున్నా! ఆమె ఎంతో సాఫ్ట్! ఇన్నేళ్లలో ఆమె నోటినుంచి ఒక్క నెగెటివ్ మాట రావడం నేనెప్పుడూ వినలేదు” అంటూ చెప్పుకొచ్చింది. “కుటుంబ సభ్యులతోనేకాదు.. సినిమాలు, షూటింగ్స్ లాంటి విషయాల్లోనూ జూహీ ఎప్పుడూ దయతోనే మెదులుతుంది. ఎలాంటి సందర్భంలోనైనా ఎంతో సంయమనాన్ని పాటిస్తుంది” అంటూ మెచ్చుకుంది. సాధారణ సంభాషణల్లోనూ విమర్శలకు దూరంగా ఉండే ఇలాంటి వ్యక్తిని కలవడం.. చాలా అరుదంటూ జుహీని ఆకాశానికి ఎత్తేసింది.
ఇక జూహీచావ్లాలో దాగి ఉన్న చిత్రనిర్మాణ నైపుణ్యాల గురించీ మాట్లాడుతూ.. “ఆమె ఎంతో అంకితభావంతో పనిచేస్తుంది. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురైనా.. వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది” అంటూ కొనియాడింది. అందం.. అంతకుమించిన అభినయంతో 90లలో టాప్‌హీరోయిన్‌గా వెలిగింది మధుబాల. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’తో తెరకు పరిచయమైంది.
తొలి చిత్రంతోనే నాటి కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతోపాటు హిందీలోనూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్ అగ్రతారలు హేమామాలిని, జుహీ చావ్లాకు దగ్గరి బంధువైన వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకుంది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు దూరమైన మధుబాల.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అంతకుముందు ఆ తర్వాత, సూర్య వర్సెస్ సూర్య, ప్రేమదేశం, ఈగల్, శాకుంతలం తదితర సినిమాల్లో మంచి పాత్రలతో మెరిసింది. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం.. ‘కన్నప్ప’లోనూ కీలకపాత్రలో కనిపించనున్నది మధుబాల.