చిన్నప్పుడు చదివిన కుందేలు, తాబేలు పరుగు పందెం కథ గుర్తుంది కదా! నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో ఆ కథ చెబుతుంది. అలాగే పట్టుదలే గెలుపుబాట అని చూపుతుంది. ఆ తాబేలు పరుగునే ఆదర్శంగా తీసుకుంది ప్రముఖ ఆంత్రప్రెన్యూర్ వినీతా సింగ్. సోనీ టీవీలో ప్రసారమయ్యే ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమం జడ్జిగా కూడా సేవలు అందిస్తున్నది. చిన్నప్పటి నుంచి వినీతకు నడక అంటే ఇష్టం. మారథాన్ పరుగులో నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని అందుకోవాలని ఉండేది. వేగాన్ని, దూరాన్ని పట్టించుకోకుండా తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నది. మొదట్లో చాలా సమయంపాటు నడిచేదట. కొన్నాళ్లకు నడక వేగం పెంచింది. ఇంకొన్నాళ్లకు పరుగు అందుకుంది. వారం వారం దూరాన్ని పెంచుకుంటూ పరుగు తీసింది. పదిహేడేండ్లుగా పరుగు ఒక కళగా సాధన చేసింది. ఇటీవల జరిగిన ముంబయి మారథాన్లో 42 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో చేరుకుని ‘ఔరా!’ అనిపించుకుంది. ‘జీవితంలో ఏదైనా సాధించాలనే ప్రయత్నంలో వెంటనే విజయాన్ని ఆశించడం తప్పు కాదు. అయితే, దానికి తగినంత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పరిస్థితులు అనుకూలించకపోయినా.. నిరుత్సాహపడొద్దు. అన్నిటినీ మించి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు’ అని చెప్పుకొచ్చింది వినీత.