ఆడవాళ్లు-మగవాళ్ల అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. వారి ఇష్టాయిష్టాలు, అభిరుచుల్లోనూ ఎన్నో తేడాలు కనిపిస్తాయి. అయితే, ఆహారం విషయంలోనూ ‘ఆడ-మగ’ భేదాలు ఉన్నట్లు పలు పరిశోధనలు తేల్చాయి. తీసుకునే ఆహారపదార్థాలే కాకుండా.. శరీరంలో అరుగుదల, పోషకాలను శోషించుకోవడం కూడా వేర్వేరుగానే ఉంటాయని చెబుతున్నాయి.
అందాన్ని పెంచే ఆహారాన్ని ఆడవాళ్లు ఇష్టంగా తింటారట. బరువు తగ్గడం, చక్కని శరీరాకృతి కోసం తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక మగవారి విషయానికి వస్తే.. ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలకు మొగ్గుచూపుతున్నారట. బలం, శక్తిని అందించే మాంసాహారాన్ని ఇష్టంగా తింటున్నారట. అయితే, ఎవరైనా పోషకాహార అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఆహార విధానాన్ని అవలంబించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. లింగభేదం లేకుండా.. ఆరోగ్యం కోసమే ఆహారాన్ని ఎంచుకోవాలని అంటున్నారు.
ప్రముఖ సైంటిఫిక్ జర్నల్.. ‘కంప్యూటర్స్ ఇన్ బయాలజీ అండ్ మెడిసిన్’లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం మరో విషయాన్ని బయటపెట్టింది. మహిళలు, పురుషులు ఒకేరకమైన ఆహారాన్ని తీసుకున్నా.. దాన్ని అరిగించుకోవడంలోనూ వారి శరీరాలు వేర్వేరుగా స్పందిస్తాయట. పోషకాలను గ్రహించడం నుంచి.. వాటి వినియోగం దాకా వేర్వేరుగానే ఉంటుందట.
మహిళలు-పురుషుల శరీర నిర్మాణంలోనే కాదు.. హార్మోన్లు, జన్యువుల్లోనూ తేడాలు ఉంటాయి. అందుకే.. వారివారి జీర్ణవ్యవస్థలు కూడా ఆహార పదార్థాలను వేర్వేరుగా వినియోగించుకుంటాయి. మహిళల శరీరం.. ఆరోగ్యకరమైన కొవ్వులను బాగా ప్రాసెస్ చేస్తుంది. ఇలాంటి పదార్థాలు మహిళలకు శక్తిని అందిస్తూనే, వారి బరువును కూడా అదుపులో ఉంచుతాయి. ఇక పురుషుల శరీరం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను సమర్థంగా వినియోగించుకుంటుంది. ఇలాంటి పదార్థాలు వారికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.