Sitting Too Much | ఎక్కువసేపు కూర్చునే ఉంటే శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటు నెమ్మదిస్తుంది. గంటసేపు నిలబడి ఉంటే 120 క్యాలరీలు ఖర్చయితే… కూర్చుంటే నిమిషానికి ఒకటి చొప్పున కేవలం 60 క్యాలరీలే ఖర్చవుతాయి. క్యాలరీలు తక్కువగా ఖర్చవుతున్నాయంటే శరీరం బరువు పెరగడానికి అవకాశం ఇస్తున్నట్టే.
దీర్ఘకాలం పాటు కూర్చోవడం వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. వాటిలో ఉండే ఖనిజాల శాతం కూడా
తగ్గిపోతుంది. నడవడం, వ్యాయామం లాంటివి లేకపోతే ఎముకలు పెళుసుబారే ప్రమాదం ఉంది.
ఎక్కువసేపు కూర్చోవడం మూలంగా శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కాళ్లలో ద్రవాలు ఒక దగ్గరికి చేరుకుంటాయి. ఫలితంగా మడమల నొప్పి మొదలుకుని నరాలు ఉబ్బడం వరకు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎలాంటి కదలికలూ లేకుండా ఎక్కువసేపు కూర్చుని ఉంటే కాళ్లకు తగినంత రక్తం సరఫరా కాదు. దాంతో రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తుతాయి. ఫలితంగా కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. కాళ్లు కొంకర్లు పోతాయి. రక్తంలో క్లాట్లు వచ్చే ముప్పూ ఉంటుంది.
సుదీర్ఘ సమయం కూర్చోవడం వెన్నునొప్పికి దారితీస్తుంది. ఒక్కోసారి ఇది వెన్నుపూస (లుంబార్ స్పైన్) దృఢత్వాన్నే మార్చేస్తుంది. అలా దిగువ వెన్ను భాగం గాయానికి కారణమవుతుంది.
శరీర కదలికలు లేకపోతే వెన్నెముకకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. మనం ఏదైనా పనిచేస్తుంటే వెన్నెముక మధ్య ఉండే మృదువైన డిస్కుల్లో సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. దీంతో ఆ ప్రాంతానికి రక్తం, పోషకాలు బాగా అందుతాయి. అదే ఎక్కువ కాలంపాటు కూర్చునే ఉండేసరికి డిస్కులు కూడా ఒత్తుకునిపోయి ఉంటాయి.
కూర్చుని గంటలకు గంటలు టీవీ తెరలకు అతుక్కుపోయేవాళ్లకు గుండెపోటు ముప్పు ఎక్కువే. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో గుండె, రక్తనాళాల వ్యాధులతో మరణించే ముప్పు 80 శాతం ఎక్కువట. ఆఫీస్ డెస్కులు, కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్లకూ ఇవే సమస్యలు ఉంటాయనే విషయం మర్చిపోకూడదు. ఇది మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలో, కొవ్వుల మీద దుష్ప్రభావాలకు దారితీస్తుంది.