నా వయసు ముప్పై ఆరు. పద్దెనిమిదేండ్లకే పెండ్లి అయ్యింది. నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఇద్దరు పిల్లలున్నారు. నాలుగేండ్ల క్రితం ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా. మళ్లీ పెండ్లి చేసుకోమని అమ్మ, అన్నయ్య ఒత్తిడి చేస్తున్నారు. నేను ఒప్పుకోక ముందే అమ్మ సంబంధాలు చూస్తున్నది. నా కూతురికి పద్నాలుగేండ్లు, కొడుకు వయసు తొమ్మిది. ఇంత పెద్ద పిల్లల్ని పెట్టుకుని పెండ్లి చేసుకుంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. నా భర్తతో సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు ఒకవైపు, నాకూ ఒక తోడుంటే బాగుంటుందన్న ఆలోచన మరోవైపు. రెండిటి మధ్య నలిగిపోతున్న నాకు మంచి సలహా ఇవ్వగలరు.
– ఓ సోదరి
జ: ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి బలవంతం, ఒత్తిడి కారణంగా ఏ పనీ చేయవద్దు. అవతలి వాళ్ల ఉద్దేశం మంచిదైనా సరే, మీ సొంత నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా అయితే జీవితం సౌకర్యంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. సరైన నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని అమ్మ, అన్నయ్యకు చెప్పండి. నమ్మకమైన స్నేహితులతో చర్చించండి. అవసరమైతే కౌన్సెలర్ దగ్గరకు వెళ్లండి. అంతిమంగా మనసు మాట వినండి. ప్రస్తుతం మీరు చాలా గందరగోళంలో ఉన్నట్లు అర్థమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయమూ వద్దు. మనసు ప్రశాంతం అయ్యాక, మీకంటూ ఆత్మస్థయిర్యం వచ్చాక తగిన నిర్ణయం తీసుకుని మీ కుటుంబసభ్యులకు చెప్పండి. ఎందుకంటే ఇది మీ బతుకు సమస్య.