మీరు రోజూ ప్లాస్టిక్ తింటున్నారా? అదేంది.. మేమెందుకు తింటాం అంటారా? అయితే ఈ కింది వస్తువులు మీ వంటింట్లో ఉన్నాయంటే, మీరు కచ్చితంగా ప్లాస్టిక్ తింటున్నట్లే. మరి ఇప్పటికైనా అవేంటో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం మంచిది.
చాలామంది తమకు తెలియకుండానే రోజువారీగా వంటగదుల్లో ఎన్నో ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగిస్తున్నారు. స్పాటులా, టాంగ్స్, లాడల్స్ పేర్లతో రకరకాల ప్లాస్టిక్ చెంచాలతో వంటలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా నల్లటి ప్లాస్టిక్ పాత్రలు మరింత హాని చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిని ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి తయారు చేస్తారట. వంట చేసేటప్పుడు వీటిని వినియోగిస్తే విషపూరితమైన మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయి. దానివల్ల హార్మోన్ల అసమానతలు ఏర్పడతాయి. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా చెక్క, స్టీల్ లేదా నాణ్యమైన సిలికాన్ చెంచాలు వాడొచ్చు.
కొన్నేళ్లుగా కత్తిపీట వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కువమంది ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులను తీసుకొచ్చి, వాటిపైనే కూరగాయలు, పండ్లు కోస్తున్నారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ బోర్డుపై కోసే ప్రతిసారి 1,100 మైక్రోప్లాస్టిక్ పదార్థాలు ఆహారంలో కలుస్తాయట. దీనివల్ల కలిగే హాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా! ఈ ముప్పు తప్పాలంటే… స్టీల్, ఉడెన్ కటింగ్ బోర్డులు వాడటం మంచిది. వీటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తడి పూర్తిగా ఆరిపోయేలా ఎండకు ఉంచాలి.
తక్కువ ధరలో లభిస్తాయనీ, పదార్థం మాడకుండా ఉంటుందనీ చాలామంది నాన్ స్టిక్ పాత్రలను వంటింట్లో వాడుతున్నారు. అయితే వీటిని బాగా వేడి చేసినప్పుడు, అందులోంచి ఆహారంలోకి హానికర రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి స్టెయిన్ లెస్ స్టీల్, ఇనుము, మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం మంచిది.
ఈ మధ్య స్కూల్ లేదా కాలేజీకి వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్ బాక్సుల్లోనే తల్లిదండ్రులు భోజనం కట్టి పంపిస్తున్నారు. అలాగే చపాతీలు లాంటి వాటిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టేస్తున్నారు. ఇవి మైక్రో ప్లాస్టిక్స్, రసాయనాలను విడుదల చేసి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ డబ్బాలకు చరమగీతం పాడండి. పిల్లలకు స్టీలు, గాజు బాక్సుల్లో భోజనం పెట్టడం మంచిది.