నయా జమానాకు తగ్గట్టుగా టెక్ గ్యాడ్జెట్లు కూడా భిన్నంగా ముస్తాబై వచ్చేస్తున్నాయి. ట్రెండీ లుక్‌తో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సామ్సంగ్ కొత్తగా తీసుకొస్తున్న ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్’ స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తెగ ఆకర్షిస్తున్నది. ‘గెలాక్సీ ఏఐ’ ఫీచర్‌తో దీన్ని తీర్చిదిద్దారు. అత్యంత నాజూకైన మడత ఫోన్ ఇదేనని మార్కెట్ టాక్. మడత పెట్టినప్పుడు దీని మందం ఎంతో తెలుసా? 10.6 మిల్లీమీటర్లు. అంటే, సాధారణ ఫోన్ మాదిరిగానే జేబులో చక్కగా పట్టేస్తుందన్నమాట. బరువు కేవలం 236 గ్రాములు. గతంలో విడుదలైన ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్’ మాడల్స్ కంటే ఇది చాలా లైట్‌గా ఉందని రూపకర్తలు చెబుతున్నారు. ఇంటర్నల్ స్క్రీన్ పరిమాణం 8 అంగుళాలు. ఎక్స్టర్నల్ డిస్ ప్లే 6.5 అంగుళాలు. గత మోడల్‌తో పోల్చితే తెర పరిమాణంలో స్వల్ప మార్పులు చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్ సెట్‌ని వాడారు.
ర్యామ్ సామర్థ్యం 16 జీబీ. దుమ్ము, ధూళి చేరకుండా ‘ఐపీ48’ రేటింగ్ రక్షణ ఉంది. అలాగే, మెయిన్ కెమెరా సామర్థ్యాన్ని 200 మెగాపిక్సెల్కు అప్‌గ్రేడ్ చేశారు. దీంతో పాటు అల్ట్రావైడ్ టెలిస్కోప్ లెన్స్ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,400 ఎంఏహెచ్. ఇక గెలాక్సీ ఏఐ సపోర్ట్‌తో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సేవల్ని ఫోన్లో నిక్షిప్తం చేశారు. దీంతో పలు రకాల మల్టీటాస్కింగ్లను ఇట్టే ప్రాసెస్ చేయొచ్చు. సామ్సంగ్ ‘ఎస్’ పెన్నుతో నోట్స్‌ని పలు ఫార్మాట్లలో ప్రాసెస్ చేసుకునే వీలుంది. డ్యుయల్ స్క్రీన్లను వాడుకుని ‘ట్రాన్స్‌లేషన్స్’ని సులభంగా చేయొచ్చు. అంతేకాదు.. పెన్నుతో ఏదైనా పదాన్ని సర్కిల్ చేస్తే చాలు. ఆ పదానికి సంబంధించిన గూగుల్ సెర్చ్ వివరాలు వచ్చేస్తాయి… ఇలా గెలాక్సీ ఏఐతో భిన్నమైన ఫీచర్స్‌ని ఈ ఫోన్‌తో పొందొచ్చు.