Sai Pallavi | ‘బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని తన తొలి తెలుగు సినిమాలోనే కుర్రకారు గుండెల్లో రౌడీపిల్లగా నిలిచిపోయింది సాయిపల్లవి. ‘ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయిపల్లవి చెప్పిన మాస్ డైలాగులు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలో భానుమతి పాత్ర కోసం ఈ భామ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎడ్లబండి తోలడం, బురద పొలంలో ట్రాక్టర్ నడపడం అలవోకగా చేయడం ద్వారా ఔను, భాను ఖతర్నాక్ పిల్ల.. ఒక్కటే పీస్ అనిపించుకుంది! తమిళనాడులో పుట్టినప్పటికీ తెలుగమ్మాయి కన్నా స్పష్టంగా మన భాష మాట్లాడుతుంది.
మొదటి చిత్రంలో పక్కా తెలంగాణ పల్ల్లెటూరి పిల్లగా మెప్పించిన ఈ తమిళ సోయగం.. ఈసారి ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పేందుకు సిద్ధమవుతున్నది. నాగచైతన్య సరసన ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్న ఆమె ఆ పాత్ర కోసం సిక్కోలు యాసలో శిక్షణ తీసుకుంటున్నదట. ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు చిత్ర దర్శకుడు చందు మొండేటి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మాండలిక నిపుణుడిని నియమించాడని టాక్. తెలంగాణ యాసలో జెమ్ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఎలా మెప్పిస్తుందో చూడాలి!