మా నాన్న వయసు అరవై నాలుగు. ఈమధ్య కాలంలో కాళ్లు, చేతులు తరచుగా తిమ్మిర్లెక్కుతున్నాయని బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు బ్రెయిన్ ట్యూమర్‌గా నిర్ధారించారు. తొందరగా సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. ‘బ్రెయిన్ ట్యూమర్’కు సురక్షితమైన శస్త్రచికిత్స ఉందని అంటున్నారు. నిజంగానే ఉంటే ఆ వివరాలు తెలుపగలరు. – రమాదేవి, సూర్యాపేట
జవాబు: ముందుగా మీరు, మీ కుటుంబం ‘బ్రెయిన్ ట్యూమర్’ సర్జరీ గురించి ఆందోళన చెందవద్దు. మెదడులో అసహజమైన మార్పులు, పరిణామాలను సరిచేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రెయిన్ సర్జరీని సిఫారసు చేస్తారు. మెదడులో గడ్డలు తీవ్రమైన తలనొప్పి మొదలుకుని శరీరంలో వివిధ అవయవాల పనితీరును దెబ్బతీసి, సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేయడం వరకూ అనేక సమస్యలకు కారణం అవుతాయి. మీరు చదివిన సర్జరీ పేరు ..ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. ఈ శస్త్రచికిత్స చాలావరకు సురక్షితం… ప్రభావవంతమైంది కూడా. మెదడులో కణితులకు చేసే సర్జరీలలో ఇది గొప్ప ముందడుగు. హైదరాబాద్‌లోనూ అందుబాటులో ఉంది. మామూలు సర్జరీతో పోలిస్తే 20 నుండి 30 శాతం మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ, ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. నిజానికి మెదడు శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, కీలకమైనవి. వైద్యరంగంలో సాంకేతిక అభివృద్ధి వల్ల గతంతో పోలిస్తే.. కచ్చితంగా, ప్రభావవంతంగా మారాయి.
ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎం.ఆర్.ఐ. (ఐ ఎం.ఆర్.ఐ.) సాయంతో సర్జన్లు కేంద్రనాడీ మండలంలో ఏర్పడిన గడ్డలను మూలాల వరకూ గుర్తించి, సమూలంగా తొలగించడానికి వీలవుతుంది. వైద్య రంగంలోనే విప్లవాత్మకమైన ఈ సాంకేతికత మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శరీరంలో అన్ని అవయవాలను నియంత్రించే మెదడుకు శస్త్రచికిత్స అంటే ప్రాణాపాయంతో కూడుకున్నది. అంతేకాదు, శరీరంలో వివిధ భాగాల పనితీరులో మార్పునకు సంబంధించి భయాందోళన కలిగించే అంశం. అయితే న్యూరోసర్జరీ విభాగంలో మైక్రోస్కోపుల ప్రవేశం ఈ శస్త్రచికిత్సలను సురక్షితంగా మార్చివేసింది. కచ్చితత్వాన్నీ తీసుకొచ్చింది. అయితే, మైక్రోస్కోప్ ద్వారా చూస్తున్నప్పుడు వైద్య నిపుణుడు మెదడులోని నిర్దిష్ట భాగాలను ఊహించగలడు కానీ, లోపలి భాగాల్లోకి ప్రవేశించడం కష్టంగా, ప్రమాదకరంగానే ఉండేది.
మెదడు సర్జరీకి ముందు న్యూరో నేవిగేషన్ అందించే 3డీ చిత్రాలు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడుతున్నాయి. న్యూరో నేవిగేషన్ అన్నది జీపీఎస్‌లా సర్జన్ శస్త్రచికిత్స చేస్తున్న మెదడు భాగాన్ని స్పష్టంగా గుర్తించేందుకు తోడ్పడుతుంది. నిమ్ ఎక్లిప్స్ వంటి ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సాయంతో మెదడు తాలూకు ఫంక్షనల్ ప్రాంతాలను గుర్తించి.. శస్త్రచికిత్స సమయంలో, వాటికి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్త తీసుకునేందుకు అవకాశం కలుగుతున్నది. కాబట్టి వయోధికులైన మీ నాన్నగారికి ఈ శస్త్రచికిత్సను ఎంచుకోవడం ఉత్తమం.
డాక్టర్ ఆనంద్
బాలసుబ్రమణియమ్
సీనియర్ న్యూరోసర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్