‘ఒక కథకి థర్డ్ యాక్టివ్, టూ యాక్టివ్, వన్ యాక్టివ్ ఉంటాయట.. అవేవీ నాకు తెల్వది. నాకు కథ తెలుసు.. దాన్ని అద్భుతంగా చూపించడం తెలుసు. నాకు తెలిసిందల్లా సినిమా స్టార్టింగ్.. ఇంటర్వెల్.. ఎండింగ్ మాత్రమే’ అని తన సినిమా ట్రైలర్ రోజు ఆ డైరెక్టర్ చెప్పిన మాటలివి. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆ కుర్రాడు రంగుల లోకంపై ఇష్టం పెంచుకున్నాడు. అవకాశాల కోసం పల్లెను విడిచి పట్నం బాట పట్టాడు. పడరాని పాట్లు పడ్డాడు. అయినా పట్టు వీడని విక్రమార్కుడిలా సినిమా తీసి తన సత్తా ఏంటో చూపించాడు. తన చిన్నతనంలో జరిగిన ఓ యథార్థ సంఘటనను సినిమాగా తీసి ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆ యువ దర్శకుడే సాయిలు కంపాటి. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈ నెల 21న విడుదలై థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా సాయిలు ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలే ప్రపంచంగా బతికాను. నిరంతరం అదే ధ్యాస. కలలోనూ సినిమాలు, యాక్టర్లు వచ్చేవారు. అందుకే నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రంగంలోకి వచ్చాను. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం గ్రామం. అమ్మానాన్నలిద్దరు వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నా. ఇంటర్ తర్వాత బీటెక్ చేశాను. సినిమాల మీద ఎంత మోజు ఉన్నా.. చదువులో ఎక్కడా తగ్గలేదు. చిన్నప్పటి నుంచి ఎన్టీయార్ సినిమాలు తెగ చూసేవాణ్ని. నా సినిమా పిచ్చి ఏ రేంజ్లో ఉండేదంటే.. ఒకసారి నాకో చిత్రమైన కల వచ్చింది. అందులో నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎన్టీయార్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు ఈ పెద్ద హీరోలు అక్కడున్నారు. ‘మీ మనుమణ్ని మాతో పంపించండి మంచి మంచి సినిమాలు చేస్తాం’ అని వాళ్లు మా తాతతో అన్నారు. మా వాళ్లు వెంటనే ఒప్పుకొని నన్ను వాళ్లతో పంపించారు.. ఇలా సాగిపోయింది ఆ కల. లేచి చూస్తే.. అంతా ఉత్తదే! ఎలాగైనా సినిమాల్లోకి రావాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. నేను బీటెక్‌లో ఉన్నప్పుడు మా ఊరికి చెందిన రమేష్ అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడని తెలిసింది. ఆయన ఇంటికొచ్చినప్పుడల్లా ‘నన్ను కూడా తీసుకెళ్లన్నా’ అని అడిగేవాణ్ని. ‘ముందు చక్కగా చదువుకో.. తర్వాత తీసుకెళ్తా’ అనేవాడు.

చదువుకుంటున్న రోజుల్లోనే ఇంటి దగ్గర దోస్తులతో కలిసి ఓ వీడియో కెమెరాతో షార్ట్‌ఫిల్మ్ తీశాను. అది చూసి మా ఊరివాళ్లంతా మెచ్చుకున్నారు. నాలోనూ టాలెంట్ ఉందని నమ్మకం కుదిరింది. బీటెక్ పూర్తి కాగానే సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ బాట పట్టాను. ఇంట్లోవాళ్లు మాత్రం సినిమాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా ఉద్యోగం చేసుకోమన్నారు. నేను మాత్రం చక్కగా యూసుఫ్‌గూడ బస్తీలో వచ్చి చేరాను. హైదరాబాద్‌లో ఏ పనీ చేయకుండా బతుకుడంటే మాటలు కాదు. నాకు తెలిసింది సినిమాలే! ఒకరోజు శ్రీమంతుడు సినిమా షూటింగ్‌కు జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసేందుకు వెళ్లాను. సినిమా వాళ్ల బస్సు ఎక్కితే.. అప్పటికే సీట్లన్నీ నిండిపోవడంతో నన్ను కిందికి దింపేశారు. తర్వాత జీ తెలుగులో ఓ కార్యక్రమానికి ఆడియెన్స్ గ్యాలరీలో ఉండి చప్పట్లు కొట్టేందుకు ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాను. అందులో భోజనాలు పెట్టే సమయంలో ప్లేట్లో అన్నం పెట్టుకొని రెండు ముద్దలు తిన్నానో లేదో… అక్కడున్న ఓ వ్యక్తి ‘ఐడీ కార్డు లేకుండా రావడమే తప్పు. ఎవరినడిగి తింటున్నావ’ని నిలదీశాడు. మమ్మల్ని తీసుకువెళ్లిన వ్యక్తి నచ్చజెప్పినా వినలేదు. అన్నం ప్లేట్ అక్కడే వదిలేసి వచ్చేశాను.
నాకు అవకాశం దొరికిన ప్రతిచోటా అడ్డంకులే పలకరించాయి. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సార్ పరిచయమయ్యారు. ఆయన నా రైటింగ్ స్కిల్స్ చూసి చాలా ప్రోత్సహించారు. నా లైఫ్ సెట్ అని అనుకునేలోపే ఆయన కన్నుమూశారు. రమేష్ అన్న పరిచయం వల్ల 2015లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ నటించిన ‘జా’ సినిమాకు పనిచేసినా. తర్వాత ‘కొత్తబంగారు లోకం’, ‘ముకుందా’ సినిమాలు చూసిన తరువాత శ్రీకాంత్ అడ్డాలను ఒక్కసారైనా కలిసి, ఆయన దగ్గర పనిచేయాలని అనుకున్నా. ఆయన అపాయింట్మెంట్ కోసం మూడు నెలలు తిరిగా. చివరికి నారప్ప సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం సంపాదించా. దర్శకుడు వేణు ఊడుగుల ప్రభావం నాపై తీవ్రంగా పడింది. ‘నీది నాది ఒకేకథ’ సినిమా చూసి జీవితంలో ఒక్కసారైనా వేణన్నతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నా. నా కోరిక తొందరగానే తీరింది.
ఒకవైపు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే మరోవైపు కథ రాసుకునేవాణ్ని. కచ్చితంగా సినిమా తీయాలనే ఆలోచనతోనే 2016లో కథ రాయడం మొదలుపెట్టాను. 2004లో నా చిన్నప్పుడు మా ప్రాంతంలో జరిగిన ఓ యథార్థ గాథ స్ఫూర్తితో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ రాసుకున్నా. ఆ సంఘటన జరిగిన చాలా ఏండ్ల తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి కొన్ని సీన్లు రాసుకున్నా. ఈ స్టోరీని ఏడుగురు ప్రొడ్యూసర్లకు చెప్పాను. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి వేణన్న కథ విన్నాడు. చిన్న చిన్న మార్పులు చెప్పి కథ ఓకే చేశాడు. 2024 ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టాం. 45 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తయింది. సినిమా అంతా మహబూబాబాద్ సమీపంలోని కాచనపల్లిలోనే పూర్తి చేశాం. షూటింగ్ మధ్యలో వానలు రావడంతో ఇబ్బందిపడ్డాం. ఈ సినిమాలో హీరో తెలంగాణ వాడే కావడంతో ఆ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ ఆంధ్రా అమ్మాయి అయినా.. తెలంగాణ యాసను బాగా ఒంటబట్టించుకుంది.
ఆ సంఘటన 2004లో జరిగినా.. అప్పటికీ ఇప్పటికీ మనిషి ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. మా సినిమా చూసైనా మనుషుల్లో కొంత మార్పు వస్తుందని నమ్ముతున్నా. పరువు హత్యలు అగ్ర వర్ణాల్లోనే కాదు.. అణగారిన ప్రజల్లోనూ జరుగుతుంటాయని ఈ సినిమాలో చూపించాను. ఈ చిత్రం షూటింగ్లో నన్ను నేను ఎంతో దిద్దుకున్నా. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ప్రపంచాన్ని చూసే తీరులోనూ చాలా పరిణతి సాధించగలిగాను. జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చినా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే.
సినిమాలు తీయాలంటే సినిమాలు చూడాలంటారు కదా. నేను కూడా అదే కేటగిరి. విడుదలైన ప్రతి సినిమాను చూస్తే.. అందులో ఏదో ఒక కొత్తపాయింట్ దొరుకుతుందనే ఆశ. ఒకరోజు సికింద్రాబాద్ నుంచి బస్సులో రూమ్‌కి వస్తుంటే చాలా మంది థియేటర్ దగ్గర టికెట్లకోసం ఎగబడటం చూశా. అప్పుడు అందులో ఆడుతున్న సినిమా ఆర్ఎక్స్ 100. నాకు కచ్చితంగా దానికి వెళ్లాలనే కుతూహలం కలిగింది. అప్పటికి నా దగ్గర రూపాయి కూడా లేదు. బస్పాస్తోనే ప్రయాణం చేస్తున్నా. వెంటనే రూమ్కొచ్చి గదంతా వెతికితే రూ.19 దొరికాయి. టికెట్ రూ.20. ఒక్క రూపాయి కోసం ఇబ్బంది పడ్డా. ఆ రూపాయి దొరక్క ఆ రోజు సినిమా చూడలేకపోయా.
– రాజు పిల్లనగోయిన