‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు!’ అన్నాడు మహాత్ముడు. ఆయన మాటలను నిజం చేస్తూ.. ఇప్పుడు పల్లెటూరి మహిళలే దేశానికి పట్టెడన్నం పెడుతున్నారు. దేశాభివృద్ధిలో కీలకంగా మారుతున్నారు. వ్యవసాయంలో రాణించడంతోపాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. గ్రామీణ మహిళల స్థితిగతులు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రపై.. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ జనాభాలో గ్రామీణ మహిళలు 22శాతం ఉన్నారు. వీరిలో అధికశాతం మంది పేదరికంతోపాటు విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక సేవలు, ఉపాధి అవకాశాలలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వివక్ష, సామాజిక నిబంధనలతోపాటు లింగ అసమానతనూ అనుభవిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. గ్రామీణ మహిళలు తమ కమ్యూనిటీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
వ్యవసాయరంగంలో తామే ముందుండి నడిపిస్తున్నారు. వాణిజ్య పంటల సాగులో పురుషులే ఎక్కువగా ఉంటున్నా.. ఆహార పంటలు, ముఖ్యంగా కూరగాయలను పండించడంలో మహిళలే ముందుంటున్నారు. ఫలితంగా ఆహార ఉత్పత్తితోపాటు నగర, పట్టణవాసులకు ఆహార భద్రతనూ అందిస్తున్నారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూ పల్లె మహిళలు ముందుంటున్నారు. ఇక గ్రామీణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూ వీరే మూలధారం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వర్క్‌ఫోర్స్‌లో 67శాతం, కమ్యూనిటీ హెల్త్‌కేర్ వర్కర్లలో 70శాతం మంది మహిళలే ఉన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిని మెరుగుపరచడంలో, ఆహార భద్రతను పెంచడంలో పల్లె పడుచులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఐక్యరాజ్య సమితి కొనియాడుతున్నది.