నిరాడంబరతకు పెద్దపీట వేసే భారతీయులు.. పెళ్లిని మాత్రం ఆడంబరంగా చేసుకుంటున్నారు. సంపాదన సంగతేమో గానీ.. వెడ్డింగ్ విషయంలో అంబానీలను ఫాలో అయిపోతున్నారు. ‘పెళ్లంటే.. రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులే కాదు.. లక్షల ఖర్చు కూడా!’ అని చెబుతున్నారు.
మనదేశంలో ఏటా కోటికిపైగా జంటలు ఒక్కటవుతుండగా.. ఒక్కో వేడుకకు సగటున రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతున్నది. 2023లో ఈ ఖర్చు రూ.4.7 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది భారీగా పెరిగినట్లు ‘వెడ్డింగ్ వైర్’ ప్లానింగ్ యాప్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో తేలింది. దాదాపు 40శాతం జంటలు.. కేవలం వివాహ వేదికల కోసమే రూ.7.5 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
ఇందుకోసం దేశవ్యాప్తంగా 2,100 జంటలతో ఆన్లైన్ ద్వారా సర్వే నిర్వహించారు. వీరిలో 40 శాతం కంటే ఎక్కువమంది వివాహ వేదికల కోసమే రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు చెప్పారు. 31 శాతం మంది రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
35 శాతం వివాహాలు.. కనీసం మూడు రోజులపాటు కొనసాగుతున్నాయి. 32 శాతం పెళ్లిళ్లు.. నాలుగు రోజులు, అంతకంటే ఎక్కువ రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ మొదలుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి, బ్యాచిలర్ పార్టీలు, మెహిందీ, సంగీత్, పెళ్లి విందు, ఫొటోగ్రఫీ, పెళ్లి మండపం, అలంకరణ.. ఇలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టేస్తున్నారట ఈతరం.