మనకు అత్యంత ఇష్టమైన వాళ్లు దూరమైనప్పుడు గుండె పగిలినంత పనవుతుంది. మనసుకు తీవ్రమైన బాధ కలుగుతుంది. ఈ బాధను కొన్నిసార్లు భరించలేం కూడా. దీన్నే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి భావోద్వేగమే మన గుండెను దెబ్బతీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు, ఎదుర్కొనే పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం..
తీవ్రమైన భావోద్వేగ, శారీరక ఒత్తిడి కారణంగా గుండె పనితీరు ప్రభావితమై బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వస్తుంది. దీని లక్షణాలు దాదాపు గుండెపోటు లక్షణాలనే పోలి ఉంటాయి. హఠాత్తుగా ఎడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలలో పెరుగుదల సంభవించినప్పుడు గుండె కండరాలు తాతాలికంగా బలహీనపడతాయి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌లో గుండెలోని ఎడమ జఠరిక ఉబ్బి పెద్దదిగా మారుతుంది. మెనోపాజ్ దాటిన మహిళల్లో దీని లక్షణాలు ఎకువగా కనిపిస్తుంటాయని నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్లో ప్రచురించిన పరిశోధనలో వెల్లడైంది.
ఈ లక్షణాలు గుర్తించడం చాలా కీలకం. ఛాతీలో హఠాత్తుగా నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అపస్మారక స్థితికి చేరుకోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈసీజీ, రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్ వంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షలు ఉపయోగకరం కూడా.
ఒత్తిడి హార్మోన్లను తగ్గించుకునేందుకు మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు, కౌన్సెలింగ్, యోగా వంటి సాధనాలు చేయడం అత్యుత్తమం. మీకు ఇష్టమైన అలవాట్లను కొనసాగించడం, ఇతర సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమవడం వల్ల మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోవాలి. మన శరీరాన్ని, మనసును బలోపేతం చేయడం కోసం సరిపడా నిద్రపోవాలి. ధూమపానం, మద్యం సేవించడం వంటి హానికరమైన అలవాట్లను మానుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి పాటించడం వల్ల కొన్ని వారాల్లోనే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ నుంచి కోలుకుంటారు. ఆ తరువాత మరింత బలంగా, దృఢంగా మారుతారు.