పిల్లలకు కడుపునొప్పి సమస్య సాధారణమే. కానీ, కొంతమంది పిల్లల్లో ఈ సమస్య పొద్దున ఉంటుంది. మధ్యాహ్నానికి పోతుంది. రాత్రి పడుకునే ముందు మళ్లీ ఉంటుంది. అంతలోనే తగ్గిందంటారు. కాసేపటికి మళ్లీ నొప్పి అంటారు. ఇదంతా బడి తప్పించుకోవడానికని పెద్దలు అపార్థం చేసుకుంటారు. నిజంగానే నొప్పి ఉందా? నటిస్తున్నారా? అని తల్లిదండ్రులకు సందేహం వస్తే వాళ్లకు నొప్పి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎక్కడ నొప్పి ఉందంటున్నారో తెలుసుకోవాలి. నెలలో నాలుగు సార్లు కడుపులో నొప్పి ఉందని, రెండు నెలలుపాటు వరుసగా ఈ సమస్య ఉందని ఫిర్యాదు చేస్తే వాళ్లకు రికరెంట్ అబ్డామినల్ పెయిన్ (ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్) సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
ఈ నొప్పి బొడ్డు చుట్టూ, పొట్టంతా, పొట్టలో అనేక వైపుల నుంచి ఉంటుంది. ఇది సీరియస్ సమస్య కాదు. ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కడుపులో కొద్దిగా వికారం కలుగుతుంది. అలసిపోయినట్టుగా కనిపిస్తారు. తలనొప్పి ఉంటుంది. తెల్లగా మారిపోతారు. పెరుగుదల సాధారణంగానే ఉంటుంది. పిల్లలు చెబితే అబద్ధం అనుకోకుండా వాళ్ల సమస్యను పేరెంట్స్, టీచర్స్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి కడుపునొప్పికి జీర్ణ వ్యవస్థలో నిర్మాణపరమైన లోపాలు, సమస్యలు ఉండవు. తరచుగా నొప్పి ఎందుకు వస్తుందంటే పొట్టలో అనేక నరాలు ఉంటాయి. ఇవి మెదడుని పేగుతో అనుసంధానిస్తాయి. పిల్లలు ఉన్నట్టుండి ఒత్తిడి, ఆందోళనకు గురయ్యారంటే.. ఈ నరాల స్పందనల వల్ల నొప్పి కలగడం వల్ల కూడా కావొచ్చు! పిల్లలు మంచిగానే ఉండి హఠాత్తుగా నొప్పి ఉందని ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు, స్కూల్లో ఆ పిల్లలకు ఏవన్నా సమస్యలున్నాయేమో తెలుసుకోవాలి.
ఒత్తిడి, ఆందోళన కలిగించే సమస్యలేమిటో తెలుసుకోవాలి. ఈ నొప్పికి ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. కాబట్టి కడుపునొప్పి అని పిల్లలు చెబితే అబద్ధం అనుకోకుండా అర్థం చేసుకుని వాళ్ల సమస్యలు వినాలి. తల్లిదండ్రులు, టీచర్లు రికరెంట్ అబ్డామినల్ పెయిన్ గురించి అవగాహన కలిగి ఉండాలి. పిల్లలను ఒత్తిడి చేయకుండా స్కూల్‌కి వెళ్లేలా ప్రోత్సహించాలి. కడుపునొప్పితోపాటు జ్వరం, వాంతులు (వాంతిలో రక్తం పడటం), విరేచనం నల్లగా రావడం, కామెర్లు, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పితో బాధపడితే కడుపులో వేరే సమస్య ఉందేమోనని అనుమానించాలి. పొట్టలో ఉండే అవయవాల నిర్మాణంలో లోపాలు, సమస్యలు ఏర్పడితే ఈ లక్షణాలు ఉంటాయి. ఈ కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పిల్లల వైద్యులకు చూపించాలి. డాక్టర్లు పరీక్షించి దేనివల్ల కడుపునొప్పి వస్తుందో నిర్ణయిస్తారు.