మారుతున్న ఆహారపు అలవాట్లు.. చిన్న వయసులోనే పెద్దపెద్ద రోగాల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా, పెద్దపేగు క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఇందుకు సంబంధించిన లక్షణాలు, రోగ నిర్ధారణపై అమెరికాలో తాజాగా ఓ అధ్యయనం చేశారు. మలద్వారం నుంచి రక్తస్రావం కావడం పెద్దపేగు క్యాన్సర్కు సంకేతమని ఈ సందర్భంగా పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణం ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 8.5 రెట్లు అధికంగా ఉన్నట్టు వారు వెల్లడించారు.
అమెరికాలోని లూయిస్ విల్లే యూనివర్సిటీ పరిశోధకులు.. తాజాగా ఈ అధ్యయనం నిర్వహించారు. 2021 నుంచి 2023 మధ్య కొలొనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న 50 ఏళ్లలోపు వయసున్న 443 మంది హెల్త్ రికార్డులను వారు విశ్లేషించారు. వీరిలో దాదాపు సగం మందికి చిన్న వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు గుర్తించారు. క్యాన్సర్ రోగుల్లో 88 శాతం మంది మలంలో రక్తం లాంటి లక్షణాలతోనే వైద్యులను సంప్రదించినట్లు తెలిసింది. వీరిలో చాలామందికి కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేదని పరిశోధకులు కనుగొన్నారు.
సాధారణంగా కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ వస్తుందని భావిస్తారు. అయితే, ఈ అధ్యయనంలో కేవలం 13 శాతం కేసుల్లోనే జన్యుపరమైన మార్పులు కనిపించినట్లు వారు వెల్లడించారు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల ముప్పు కేవలం రెండు రెట్లు మాత్రమే పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక గతంలో ధూమపానం చేసిన వారిలో క్యాన్సర్ ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందుకే, క్యాన్సర్ కుటుంబ చరిత్ర లేకున్నా.. 45 ఏళ్ల నుంచి పెద్దపేగు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.