కార్పొరేట్ ప్రపంచంలో మహిళా నాయకత్వానికి కరువొచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్.. ఆ పైస్థాయిలో ఆడవాళ్ల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతున్నది. ఇప్పటికీ కార్పొరేట్ కంపెనీల్లో ‘సీ-సూట్ మహిళలు’ కేవలం 19 శాతం మాత్రమే ఉన్నట్టు తాజా సర్వే తేల్చింది. ప్రపంచ సగటు 30శాతంతో పోలిస్తే.. భారత్ చాలా వెనకబడి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ అవతార్.. కార్పొరేట్ సంస్థల్లో ‘సీ-సూట్ మహిళ’లపై తాజాగా ఓ సర్వే నిర్వహించింది. భారత్‌లో మహిళలు ప్రమోషన్లు పొందడం, ఉన్నత స్థానాలకు చేరుకోవడం కష్టంగా మారుతున్నదని వెల్లడించింది. ఉద్యోగం – కుటుంబం రెండిటిలో సమతుల్యతను సాధించడానికి మహిళలు తీవ్రంగా కష్టపడాల్సి వస్తున్నదట. దాదాపు 60 శాతం మంది అతివలకు.. ఇదే అతిపెద్ద సవాలుగా ఉన్నదని సర్వే వెల్లడించింది.
అసలే అంతంత మాత్రంగా ఉన్న మహిళా నాయకత్వంపై ‘కొవిడ్’ కోలుకోలేని దెబ్బతీసింది. ‘సీ-సూట్’ స్థాయిలో మహిళల వాటా 2019లో 4 శాతం మాత్రమే ఉండగా.. 2020లో 10 శాతానికి పెరిగింది. ఆ సమయంలోనే విజృంభించిన కొవిడ్ వల్ల.. మహిళల వాటా తగ్గిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంటూ.. 2022 వరకు మళ్లీ 15 శాతానికి పెరిగింది. 2024లో 19 శాతానికి చేరుకున్నది. అయితే.. నియామకాలు, ప్రమోషన్లలో లింగ వివక్ష మహిళల పురోగతికి ఆటంకం కలిగిస్తున్నదట. ఈ పక్షపాతాన్ని తగ్గించడంలో, నాయకత్వ స్థానాల్లో మహిళలకు మరింత సమానమైన అవకాశాలను సృష్టించడానికి డాటా, ఏఐ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని సర్వేలో చాలామంది నమ్మకం వ్యక్తం చేశారట. అయితే, నాయకత్వంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే.. నియామకాలు, ప్రమోషన్ ప్రక్రియలకు మించి.. వ్యవస్థాగతంగా మార్పులు రావాలని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.