దసరా సంబురం చూడాలంటే కోల్‌కతా బాటపట్టాల్సిందే! నవరాత్రి వేళలో.. వీధి వీధినా వెలిసే దుర్గాదేవి మంటపాలను మాత్రమే కాదు… వాడవాడనూ అంతే సుందరంగా అలంకరిస్తారు వంగదేశ వాసులు. సంక్రాంతి వేళ.. మన తెలుగు లోగిళ్లను రంగవల్లులతో అలంకరించినట్టే.. దసరా రోజుల్లో బెంగాలీలు అల్పనా ఆర్ట్‌తో వీధుల్ని ముస్తాబు చేస్తారు. బియ్యం పిండి, సుద్ద, సహజ రంగులను కలిపి తయారు చేసిన అలుకుతో వీధుల్లో కళాఖండాలను చిత్రిస్తారు. ఇది శతాబ్దాల నాటి కళ. దీన్ని కళ్లారా చూడాలంటే ఇదే సరైన సమయం. చిత్రకళలో ప్రవేశం ఉన్న వారంతా జతగూడి వీధుల్నే కాన్వాస్‌లుగా చేసుకొని రకరకాల చిత్తరువులను పరిచేస్తారు. సమకాలీన అంశాలనూ ఇందులో జోడించడం ఒక ఆచారం. అందులో భాగంగా ఏఐ టెక్నాలజీతో రూపొందించిన డిజైన్లతో న్యూటౌన్ వీధుల్లో ఇరవై మంది కళాకారులు రూపొందించిన అల్పనా చిత్రాలివి! ఈ బెంగాలీ సందుల్లో విరబూసే రంగోలీని చూసేందుకు పర్యాటకులు ప్రత్యేకంగా కోల్‌కతా వస్తుంటారు.