ఓ రాజ్యపు రాజు మానసిక అశాంతికి గురయ్యాడు. ‘అశ్వమేధ యాగం అయినా చేయవచ్చు కానీ మనసును జయించలేం’ అని విని ఉండటంతో ఆయన ఆందోళన మరింత ఎక్కువైంది. ఆయుర్వేద వైద్యం తీసుకుని ఆందోళన తగ్గించుకోవాలని భావించాడు రాజు. మందులు తీసుకోవడం కన్నా ఆస్థాన గురువును సంప్రదిస్తే మంచిదని రాణి సలహా ఇచ్చింది. ఆ మేరకు మానసిక ప్రశాంతత కోసం మార్గం సూచించమని ఆస్థాన గురువును అడిగాడు రాజు. రాజ్యంలోని దక్షిణ కొండల కింద ఉన్న శివాలయానికి నలభై రోజులపాటు వెళ్లి వస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని సలహా ఇచ్చాడు గురువు. మరుసటిరోజునుంచీ రాజు గుడికి వెళ్లి రావడం ప్రారంభించాడు.
రోజులు గడుస్తున్నా రాజుకు తేడా ఏమీ కనిపించలేదు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ గురువును కలిసి గుడికి వెళ్లి వస్తున్నా మానసిక ఆందోళన తగ్గడం లేదని వాపోయాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీరు గుడికి ఎలా వెళ్లి వస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. ‘గుర్రం మీద వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాను’ అని బదులిచ్చాడు రాజు. ‘పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి ఎవరైనా దూకగలరా?’ అని అడిగాడు గురువు. ‘అదెలా సాధ్యం? పొరపాటుగా ప్రయత్నించినా గాయాలపాలవుతాం కదా!’ అన్నాడు రాజు. ‘అంటే… గుర్రం నిలిచాకే మనం దిగడం ఉత్తమం అన్నమాట. మీరు గుడికి ప్రశాంతంగా వెళ్లి రావడం లేదు. హడావుడిగా గుర్రం మీద వెళ్లి వస్తున్నారు. కొద్దిసేపు కూడా గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోవడం లేదు.
గబగబా వెళ్లి గబగబా వచ్చేస్తే మీ ఆందోళన ఎలా మాయమవుతుంది? ఎన్ని పనులున్నా దేవాలయానికి ప్రశాంతంగా వెళ్లాలి. రోజువారీ గొడవలు, గందరగోళాలను పక్కన పెట్టాలనే కదా అక్కడికి వెళ్తున్నాం. అందుకని ఓపికగా ఉండాలి. కొద్దిసేపైనా ఆలయ ప్రాంగణంలో గడపాలి. అప్పుడే మీ ఆలోచనల ఉధృతి తగ్గుతుంది’ అని సలహా ఇచ్చాడు. ‘నిజమే… గురువు చెప్పాడని ఏదో మొక్కుబడిగా వెళ్లి వస్తున్నాను. గుడి అంటే దేవుడిని చూసి రావడమే కాదు, గుడి ప్రాంగణంలో గడపడం కూడా ముఖ్యం’ అని గుర్తించాడు రాజు. అప్పటినుంచి ఏమాత్రం హడావుడి లేకుండా ప్రశాంతంగా గుడికి వెళ్లి రావడం ప్రారంభించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు ,93936 62821