కొత్త ఏడాదిలోకి రాగానే ఏవో కొన్ని తీర్మానాలు చేసుకునే ఉంటాం! ఇప్పటికే నయా సాల్ వచ్చేసి పది రోజులు దాటింది. కొత్త కట్టుబాట్లు ఎంత వరకు పాటిస్తున్నారో గమనించారా? ముఖ్యంగా ఫోన్ వాడకం తగ్గించాలని బలంగా నిర్ణయించుకునే ఉంటారు! ఈ తీర్మానం పక్కాగా అమలు చేస్తున్నారా? మీ సమాధానం ‘నో’ అయితే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ‘డిజిటల్ వెల్ బీయింగ్’గా మారండి. రోజులో కొన్ని గంటలైనా ఫోన్‌ను దూరం పెట్టండి.
అలర్ట్‌లు రావు.. ఫోన్ మోగదు.. అయినా పదేపదే చూడటం. అన్‌లాక్ చేయడం.. ఇలా రోజులో కొన్ని వందలసార్లు చేస్తూనే ఉంటారు. మరి మీ ఫోన్‌ను రోజుకు ఎన్నిసార్లు అన్‌లాక్ చేస్తున్నారో ఏనాడైనా లెక్క పెట్టారా? లేదు కదా! అందుకే ‘Unlock Clock – A Digital Wellbeing Experiment’ వచ్చింది. ఇదో లైవ్ వాల్‌పేపర్ లాంటిది. ఫోన్‌ను అన్‌లాక్ చేసిన ప్రతిసారీ లెక్కిస్తుంది. అలా రోజులో ఎన్నిసార్లు మీ చేయి ఫోన్‌వైపు వెళ్లిందో చెబుతుంది. కౌంట్ ఎక్కువుంటే.. పరిమితులు పెట్టుకోండి.
ఏదో పనిలో ఉంటారు. ‘వాట్సప్ మెసేజ్’ అలర్ట్ వింటారు. ‘ఏంటా?’ అని చూస్తారు. చదివి పక్కన పెట్టగానే.. ఫేస్బుక్ నుంచి మరో అలర్ట్! అది చెక్ చేస్తుండగానే ‘ఇన్‌స్టా’ వంతు.. ఇలా తెలియకుండానే గంటలు గడిచిపోతాయి. అందుకే.. ఫోన్‌కు ఎప్పుడుపడితే అప్పుడు నోటిఫికేషన్స్ రాకుండా చేస్తే! ఎంపిక చేసుకున్న టైమ్‌కే అన్నిటినీ చూడగలిగితే! అందుకు ‘Stay Focused, App Limit’ యాప్స్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఒక సమయాన్ని సెట్ చేసుకొని.. అప్పుడే నోటిఫికేషన్లు తెరపైకి వచ్చేట్టుగా చేయొచ్చు.
ఫోన్ చేతిలో ఉంటే చాలు. పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనివారు ఎక్కువయ్యారు. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టరు. చదువు, ఆటలు, ధ్యానం.. ఇలా దేనిలోనూ ఏకాగ్రత చూపలేరు. ఇలాంటి వారికోసమే ‘Paper Phone’ వచ్చింది. ఈ యాప్ మిమ్మల్ని డిజిటల్ ప్రపంచానికి దూరంగా తీసుకెళ్తుంది. మీకు కావాల్సిన కాంటాక్ట్స్, మీటింగ్స్, మ్యాప్స్ తదితర ముఖ్యమైన సమాచారాన్ని ముందుగానే పేపర్‌పై ప్రింట్ చేస్తుంది. ఇక ఫోన్‌తో పని ఉండదు. పేపర్లో చూసుకొంటూ.. మీ పనులు చేసుకోవచ్చన్న మాట.
ఫోన్ నిండా ఎన్నో యాప్స్! మరెన్నో గేమ్స్! నచ్చింది ఇన్స్టాల్ చేయడం.. వాడేయడం, ఆడేయడం. రోజులో సగం వీటికే సరిపోతుంది. మరి వీటిపై నియంత్రణ ఉండాలంటే.. ‘Block Apps & Sites, Digitox’ యాప్స్‌ను ఆశ్రయించడమే! వీటితో అవసరమున్న యాప్స్‌ను మాత్రమే ఉంచుకోవచ్చు. మిగతావి లాక్ చేసుకోవచ్చు. అలా.. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండొచ్చు.