‘ఓ బావ సైదులు’ అంటూ ఫోక్ సాంగ్ ఫ్యాన్స్‌ని పలకరించిన నిర్మల్ ఆడబిడ్డ ఇప్పుడు పాన్ ఇండియా సింగర్. ‘పుష్ప-2’లో ‘వచ్చుండాయ్ పీలింగ్స్’ పాటతో అందరిలోనూ ఫీలింగ్స్ పుట్టించిందామె గొంతుక. సింగిల్ సాంగ్‌తో ప్రపంచమంతా సందడి చేస్తున్న ఆ గళం పేరు దాస లక్ష్మి. పల్లెలో పుట్టి, పాటలో పెరిగి, ఎంతపేరు మూటగట్టుకున్నదో ‘జిందగీ’తో ముచ్చటగా పంచుకున్నది! ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
మా అమ్మ జైశీల, నాన్న లక్ష్మణ్ పాటలు బాగా పాడేటోళ్లు. పొలం పనులు చేసుకుంటనే భజన కీర్తనలు ఆలపించేటోళ్లు. ఆ (అను)రాగాలు ఆలకిస్తూ పెరిగాను. కాబట్టి నాకు చిన్నప్పుడే పాడాలనే కోరిక కలిగింది. మా ఊరు నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్న. బడిలో పంద్రాగస్టుకు, గణతంత్ర దినోత్సవానికి నాతో పాటలు పాడించేటోళ్లు. శశికళ మేడం, ప్రవీణ్ రెడ్డి సార్, రాములు సార్ నా పాటలు మెచ్చుకునేటోళ్లు. ఎక్కడ పాటల పోటీలు ఉన్నా తీసుకపోయేటోళ్లు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినయి. అప్పుడు మండల, జిల్లా స్థాయి పాటల పోటీల్లో గెలిచిన.
తొమ్మిదో తరగతి చదవడం కోసం అష్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరాను. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది. ‘తెలంగాణ ధూం ధాం’ సభలు బాగా జరిగేటివి. మా బడిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పాట పాడిన. దిగంబర్ అన్న నా పాట విని మెచ్చుకున్నడు. ఆయన నాకు పాట పాడుట్ల మెలకువలు నేర్పిండు. ఆ అన్నే ‘ధూం ధాం’, యూత్ ఫెస్టివల్స్‌కి నన్ను తీస్కవోయేటోడు. జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్లో నాకు రెండో స్థానం లభించింది. అప్పటినుంచి పాటను వదిలిపెట్టలే.
డిగ్రీ ఫస్ట్ ఇయర్ల ఉన్నప్పుడు.. ఫ్రెండ్స్ యూట్యూబ్ పాటలు వినేటోళ్లు. నాకు అప్పటికి ఫోన్ లేదు. వాళ్ల ఫోన్లోనే వినేదాన్ని. ‘గడ్డం మ్యూజిక్’ అనే చానెల్ పాటలు విన్న. అవి బాగున్నయి. ఆ చానల్ నడిపే గడ్డం రమేశ్ అన్నను కలిసిన. ఆయన నాతో “ఓ బావ సైదులు” పాట పాడించారు. ఆ ఒక్కపాటతో ఫోక్ సాంగ్ ఫ్యాన్స్‌లో పాపులర్ అయ్యాను. ఆ తర్వాత యూట్యూబ్ చానెల్స్‌కి లెక్కలేనన్ని పాటలు పాడాను. ఫోక్ మ్యూజిక్ డైరెక్టర్ జీఎల్ నామ్‌దేవ్ సార్ పాటను ఏ శ్రుతిలో పాడాలి? ఎట్ల ఎత్తుకోవాలో బాగా నేర్పిండు. వందల పాటలు పాడిన. మాట తిరుపతి అన్న నడిపే సైటీవీ చానెల్లో పాడిన ‘ఆనాడేమన్న అంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్న అంటినా తిరుపతి’ పాటతోపాటు ‘తిన్నా తిరం పడుతలే.. కూసున్న తిరం పడుతలే’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నయి.
ఆ పాటలు సినిమా డైరెక్టర్ సుకుమార్ సార్ విన్నారు. ‘ఈ అమ్మాయి వాయిస్ బాగుంది. మాస్‌గా, రొమాంటిక్‌గా, మంచి బేస్‌లో ఉంది. పుష్ప 2లో పాడిద్దామనుకుంటున్నా’ అని తిరుపతి అన్నకు ఫోన్ చేసి చెప్పాడట. అలా నన్ను చెన్నైకి పిలిపించారు డైరెక్టర్ సార్. దేవీశ్రీప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో ‘పీలింగ్స్’ పాట పాడిన. ఈ పాట నన్ను చెప్పలేనంత పాపులర్ చేసింది. ఇప్పుడు దాస లక్ష్మి అంటే తెలియనోళ్లు లేరు.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ సార్, సుకుమార్ సార్ నన్ను పిలిచి, ‘అమ్మా లక్ష్మి నీ టోన్ వెరీ డిఫరెంట్. మా సినిమాలో ఈ పాటకు ఏ ఫీల్ కావాలో ఆ ఫీల్ నీ గొంతులో ఉంది. నువ్వు మాస్ పాటే కాకుండా అన్ని రకాల పాటలు పాడగలవు’ అని మెచ్చుకున్నారు. ఈ ప్రశంస నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆ ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోలేను.
పుష్ప సినిమాకు ముందు కొన్ని సినిమాలకు పాడిన. రఘు కుంచె గారు నాకు మొదటిసారి సినిమాలో పాడే చాన్స్ ఇచ్చారు. ‘బ్యాచ్’ సినిమాలో ‘గుంటడు గుళ్లో కాసేనే’ పాట పాడించారు. ఆ పాట కోస్తాలో పాపులర్ అయింది. తర్వాత దసరా సినిమాలో కాసర్ల శ్యామ్ అన్న అచ్చమైన తెలంగాణ యాసలో టైటిల్ సాంగ్ ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాడించారు. పుష్ప-2 తర్వాత అవకాశాలకు కొదవలేకుండా పోయింది. వాటిని సద్వినియోగం చేసుకొని మంచి సింగర్‌గా గుర్తుండిపోవాలన్నది నా కోరిక.