పిల్లలు-యువతలో ఆత్మహత్యలు పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తున్నది. 2023లో 13,892 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చెబుతున్నది. అంతేకాదు.. దేశంలోని టీనేజర్లలో 22 శాతం మంది క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఆసియా జర్నల్ – 2024 అధ్యయనం తేల్చింది. ఈ క్రమంలో పిల్లల్ని మానసికంగా దృఢంగా తయారుచేయాల్సిన అవసరం ఉన్నది.
నేటితరం పిల్లలు మునుపటికంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చదువులో పోటీ, సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ అంచనాలు.. ఇవన్నీ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే.. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇందుకోసం.. బాల్యం నుంచే వారిని మానసికంగా దృఢంగా తయారుచేయాలి. అందుకు ఈ సలహాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా పిల్లల భావోద్వేగాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వాలి. కోపం, విచారం లాంటివి ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చూడాలి. అలాగే, పరిస్థితులకు అనుకూలంగా ఎలా వ్యవహరించాలో.. వాస్తవికంగా ఎలా ఆలోచించాలో అవగాహన కల్పించాలి. అప్పుడే వారిలో సానుకూల దృక్పథం అలవడుతుంది.
పిల్లలకు బాల్యం నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించాలి. పోషకాహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని దూరం పెట్టేలా వారిని ప్రోత్సహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం వంటివి కూడా పిల్లల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఇక వ్యాయామం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిన్నచిన్న సమస్యలు వారినే పరిష్కరించుకోవాలని చెప్పాలి. సమస్యలు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అప్పుడే వారు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు.
తల్లిదండ్రులను గమనించడం ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. వివిధ పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో మిమ్మల్ని చూసే అనుకరిస్తారు. మీ అలవాట్లను, మీ లక్షణాలను గ్రహించే.. వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి, మీ చర్యలు, పరిస్థితులు- సంఘటనలకు మీరు స్పందించే తీరును ఒకసారి బేరీజు వేసుకోండి. మీ అలవాట్లలో ఏవైనా లోపాలు ఉంటే.. వెంటనే సరిదిద్దుకోండి. మీరే మీ పిల్లలకు రోల్ మోడల్‌గా మారండి.
క్రమశిక్షణ అంటే.. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, వారిని దండించడం కాదు. ఆ తప్పును పునరావృతం చేయకుండా చేయడం. కాబట్టి, స్వీయ-క్రమశిక్షణ, నియంత్రణ, సమస్యల పరిష్కార నైపుణ్యాలపై సందర్భానుసారం అవగాహన కల్పించాలి.
మెదడు అభివృద్ధికి, ఆరోగ్యానికి సాయపడే ఆహారాన్ని అందించాలి. పాఠ్యపుస్తలతోపాటు కథల పుస్తకాలు చదవడం అలవాటు చేయించాలి. దీనివల్ల భాషా నైపుణ్యాలతోపాటు వారిలో కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది. వారి మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.