మగవారిలో ప్రోస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ‘ప్రోస్టేట్ క్యాన్సర్’ అంటారు. ప్రోస్టేట్ ‘వాల్నట్’ ఆకారంలో ఉండే చిన్నగ్రంథి. మనకు వీర్యంలో కనబడే ద్రవ పదార్థాన్ని ఇది తయారు చేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్ళడానికి ఈ ద్రవ పదార్థం ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవారికి వచ్చే అతిసాధారణ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటి దశలో ఇది ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది. అసలు, అవసరం రాకపోనూవచ్చు.
కానీ, కొన్ని రకాల ప్రోస్టేట్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. అయితే, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు బయట పడకపోవచ్చు.
వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్ళవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు చెప్పలేం. వయసు మీద పడటం, కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండటం, స్థూలకాయం వంటివి కారణాలు కావడానికి అవకాశం ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు.. 50 సంవత్సరాలు నిండిన పురుషులు ప్రోస్టేట్ స్క్రీనింగ్ పరీక్ష తప్పక చేయించుకోవాలని సలహా ఇస్తున్నాయి.
డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ (డి.ఆర్.ఇ), ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటిజన్ (పి.యస్.ఏ) పరీక్షలను చేయడం వల్ల వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షలలో రిపోర్ట్ ‘అబ్నార్మల్’ గా వస్తే, అల్ట్రాసౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి.
బయాప్సీలో పాజిటివ్‌గా వస్తే, గ్రేడింగ్ చేయాలి. అంటే, వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. ఇందుకోసం క్యాన్సర్ కణాలను, ఆరోగ్యంగా ఉన్న ప్రోస్టేట్ కణాలతో పోల్చి చూస్తారు. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన కణాలకన్నా ఎంత ఎక్కువ భిన్నంగా ఉంటే అంత తీవ్రంగా వ్యాధి ఉన్నట్లు. వ్యాధి తీవ్రతను కొలిచే కొలమానాన్ని ‘గ్లీసన్ స్కోర్’ అంటారు. ఈ స్కోరు 2 నుంచి 10 వరకు ఉంటుంది. 2 అంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు, 10 ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు.
క్యాన్సర్ వ్యాప్తిని గుర్తించడం: క్యాన్సర్ వ్యాధి ప్రోస్టేట్ గ్రంథిని దాటి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందినట్టు అనుమానం కలిగితే, మరిన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఎముకల స్కానింగ్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫి, (సి.టి) స్కాన్, మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్, (ఎం.ఆర్.ఐ) వంటి పరీక్షల వల్ల క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో నిర్ధారణ
అవుతుంది.
తీవ్రతను బట్టి
ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ ఎంత వేగంగా వృద్ధి చెందుతోంది, ఎంత వేగంగా ఇతర అవయవాలకు పాకుతోంది, రోగి ఆరోగ్యస్థితి, ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
క్యాన్సర్ మొదటి దశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో డాక్టర్లు, అప్రమత్తతతో వేచి ఉండమని రోగులకు సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటూ శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నమాట. క్యాన్సర్ చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతున్న వారికి మాత్రమే, ఇలా అప్రమత్తతతో వేచి ఉండమని సూచిస్తారు. క్యాన్సర్ వృద్ధి చెందుతున్నట్లు గమనిస్తే ఆపరేషన్, రేడియో థెరపీ వంటి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు..
రేడియేషన్ థెరపీ: రేడియేషన్ థెరపీలో అధికశక్తి గల ధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను చంపుతారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో రేడియేషన్ రెండు రకాలుగా ఇస్తారు. శరీరం బయటనుండి రేడియో ధార్మికతను ఇవ్వడం, శరీరం లోపల రేడియో ధార్మికతను ఉంచడం.
హార్మోన్ థెరపీ: హార్మోన్ థెరపీలో శరీరంలోని టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాలు టెస్టోస్టిరాన్ మీద ఆధారపడి వృద్ధి చెందుతుంటాయి. టెస్టోస్టిరాన్ సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి మందగించడంగానీ, చనిపోవడంగానీ జరుగుతుంది. హార్మోన్ థెరపీని వివిధ రకాలుగా
ఇవ్వవచ్చు…
మందులద్వారా టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని నిలిపి వేయడం: వృషణాలు టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కొన్నిరకాల మందుల ద్వారా ఇవి టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు.
టెస్టోస్టిరాన్ క్యాన్సర్ కణాలకు అందకుండా చేయడం: ‘యాంటీ-ఆండ్రోజన్’ మందులద్వారా టెస్టోస్టిరాన్ క్యాన్సర్ కణాలకు అందకుండా
చేయవచ్చు.
వృషణాలను తొలగించడం: రెండు వృషణాలను తొలగించడం ద్వారా శరీరంలో టెస్టోస్టిరాన్ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా హార్మోన్ థెరపీలాంటిదే. కానీ, ఈ పద్ధతిలో టెస్టోస్టిరాన్ స్థాయిని వేగంగా తగ్గించవచ్చు. అయితే, దీనిని క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నవారికి మాత్రమే ఉపయోగిస్తారు.
క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్ థెరపీ సరిపోతుంది. వృషణాలను తొలగించవలసిన అవసరం లేదు. హార్మోన్ థెరపీ వల్ల క్యాన్సర్ కణుతులు కుంచించుకుపోతాయి. దాని తరువాత రేడియేషన్ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి.
సర్జరీ: సర్జరీలో ప్రోస్టేట్ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణజాలాన్ని, లింప్ గ్రంథులలో కొంత భాగాన్ని తొలగిస్తారు. అయితే దీని వల్ల అంగస్తంభన సమస్య, మూత్రవిసర్జనలో సమస్యలు
తలెత్తవచ్చు.
కీమోథెరపీ: కీమోథెరపీలో మందులద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయత్నిస్తారు. కీమో థెరపీలో మందులను ఇంజక్షన్ల రూపంలో కానీ, మాత్రల రూపంలో కానీ ఇస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా ముదిరి శరీరంలోని ఇతర భాగాలకు కూడా క్యాన్సర్ పాకినట్లయితే కీమో థెరపీని ఇస్తారు.
నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ని తగ్గించుకోవచ్చు.
ప్రోస్టేట్ క్యాన్సర్‌లో స్టేజీలు
స్టేజ్ -1: క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉన్నదని అర్థం. మైక్రోస్కోప్‌తో చూడగలిగే పరిమాణంలోనే ఉందని గ్రహించాలి.
స్టేజ్-2: ఈ దశలో క్యాన్సర్ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ, ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
స్టేజ్-3: ఈ దశలో క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథిని దాటి వీర్య వాహికలు లేదా ఇతర సమీప కణ
జాలానికి పాకి ఉండవచ్చు.
స్టేజ్-4: ఈ దశలో క్యాన్సర్ లింప్ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయ
వాలకు పాకి ఉంటుంది.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్
హైదరాబాద్: 9848011421
కర్నూల్: 08518-273001
గుంటూర్: 0863-2223300