‘అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా’ అని సామెత. అయ్యగారు రాకపోతేనేం.. అమ్మగారు ఉన్నారుగా! పంతులయ్యతో వచ్చి ముత్తయిదువు వాయనం తీసుకోవడమే పంతులమ్మ విధిగా ఉండేది ఇన్నాళ్లు. ఇప్పుడు అమ్మగార్లే నేరుగా పురోహితం నెరుపుతున్నారు. ‘అయం ముహూర్తం సుముహూర్తోస్తూ..’ అని మంత్రాలు చదువుతున్నారు. వివాహాది శుభకార్యాలు సశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. మహిళలు ఎన్నో రంగాల్లో ముందంజలో ఉన్నా… పురోహితంలో మాత్రం ఇది కొత్త పోకడే! ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా పద్దెనిమిది మంది యాజ్ఞికురాళ్లతో కలిసి పురోహితం నిర్వహిస్తున్న సంస్థ ‘శుభమస్తు’.
ప్రియాంక ఛటర్జీ కోల్‌కతాకు చెందిన బ్రాహ్మణుల ఇంట పుట్టింది. వాళ్ల నాన్న పురోహితుడు. చిన్నప్పటినుంచి తండ్రి నిర్వహించే పూజా కార్యక్రమాలను చూస్తూ పెరిగిందామె. తండ్రిలాగే తనకూ పౌరోహిత్యం చేయాలనిపించింది. కానీ, చాలా ఏళ్లు అది కోరికగానే మిగిలిపోయింది. మూడేండ్ల కిందట కోల్‌కతాలోని సంస్కృత కళాశాలలో సంస్కృతం అభ్యసిస్తున్న రోజుల్లో ఫేస్బుక్లో ప్రియాంక ఓ పోస్టు చూసింది. ‘పౌరోహిత్యం చేపట్టేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇస్తామ’ని దాని సారాంశం. ఆ ప్రకటన జారీ చేసిన ‘శుభమస్తు’ సంస్థలో దరఖాస్తు చేసుకుంది. పౌరోహిత్యంలో శిక్షణ తీసుకుంది. కులవృత్తిని చేపట్టింది. విద్యాశాఖలో ఉద్యోగం చేస్తూనే.. పౌరోహిత్యమూ నిర్వహిస్తున్నది. ఒక చేత్తో జీతం, మరో చేత్తో సంభావన సముపార్జిస్తూ సామాజిక మార్పులో భాగమవుతున్నది. వివాహాది శుభకార్యాలు చేయిస్తూ… వేద మంత్రోచ్చారణకు లింగభేదం లేదని ప్రియాంక చాటుతున్నది.
ప్రొఫెసర్ పౌరోహిత్యం
ప్రియాంక లాగే ప్రొఫెసర్ నివేదిత మిశ్రా కూడా ఇప్పుడు పౌరోహిత్యం చేపట్టింది. భారతీయ శాస్త్రీయ నృత్య ఆచార్యురాలిగా పనిచేస్తున్న ఆమె ఉపాధి కోసం అక్షతలు అందుకోలేదు. మెరుగైన సమాజాన్ని కోరుకునే వాళ్లతో కలిసి నడవాలని పంతులమ్మగా మారింది. ప్రొఫెసర్ నివేదితకు ఒక కుమార్తె ఉంది. మూడేళ్ల క్రితం… కూతురు పెండ్లికి పురోహితుల కోసం వెదుకుతుంటే శుభమస్తు గురించి తెలిసింది. మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూతురు పెండ్లి మంత్రాల బాధ్యతను మహిళా పురోహితులకు అప్పగించింది. వాళ్లు సలక్షణంగా పెండ్లి జరిపించారు. ఆ స్ఫూర్తితో నివేదిత కూడా పౌరోహిత్యంలో అడుగుపెట్టింది. రెండేండ్లలోనే 80 క్రతువులు నిర్వహించింది. యూనివర్సిటీలో సంగీత పాఠాలు నేర్పితే కలిగే సంతృప్తి కన్నా.. పౌరోహిత్యంలోనే తనకు ఎక్కువ ఆనందం లభిస్తున్నదని నివేదిత చెబుతున్నది. నలుగురితో మొదలైన ‘శుభమస్తు’లో ఇప్పుడు 18 మంది పురోహితురాళ్లు ఉన్నారు. వీళ్ల ఆధ్వర్యంలో ఏటా సుమారు 150 పెండ్లిళ్లు జరుగుతుండటం విశేషం.
శ్రీకారం చుట్టారిలా…
‘శుభమస్తు’ వెనుక పెద్ద కథే ఉంది. ఈ వేదిక రూపకల్పనలో కీలక భూమిక పోషించిన నందినీ భౌమిక్‌కు సంస్కృతం అంటే వల్లమాలిన అభిమానం. ఆ భాష అధ్యయనం చేస్తానంటే ఇంట్లో వాళ్లంతా వ్యతిరేకించారు. ‘సంస్కృతం చదివితే ఉద్యోగాలు తక్కువ. ఆడవాళ్లకు అవకాశాలు ఉండవు. కాబట్టి వేరే కోర్సు ఎంచుకోమ’న్నారు. నందిని ఆ మాటలు పట్టించుకోకుండా సంస్కృతంలో బీఏ చదివింది. తర్వాత ఎంఏ, పీహెచ్డీ కూడా చేసింది. ప్రొఫెసర్‌గా కొలువు కుదిరింది! మరోవైపు రంగస్థల కళాకారిణిగానూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేనేండ్ల క్రితం భౌమిక కుమార్తె వివాహం జరిగింది. ఆ సందర్భంగా పురోహితులు ఉచ్చరించిన సంస్కృత మంత్రాలకు అర్థాలు చెప్పి అందరినీ ఆకర్షించింది నందిని. దానికి కొనసాగింపుగా ‘మహిళలు పౌరోహిత్యం ఎందుకు చేపట్టకూడదు?’ అనే ఆలోచన ఆమెకు తట్టింది. అయిదేండ్లు గడిచాయి. కాలేజ్‌లో తనతోపాటు సంస్కృత విద్య చదివి, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రుమా రాయ్‌తో కలిసి ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనుకుంది. అలా 2014లో ‘శుభమస్తు’ సంస్థ ప్రారంభించారు. రెండేళ్లకు సంగీత కళాకారిణి బెనర్జీ, మ్యూజిక్ టీచర్ చక్రవర్తి వీళ్లకు జతయ్యారు.

నలుగురు కలిసి
సంస్కృత ఆచార్యులుగా అనుభవమున్న భౌమిక్, రాయ్ ఇద్దరూ వేద మంత్రాల అనువాదం, వ్యాఖ్యాన రచనపై దృష్టి పెట్టారు. సంగీతంలో ప్రవేశం ఉన్న బెనర్జీ, చక్రవర్తి శ్లోకాలను రాగయుక్తంగా ఆలపించడంతోపాటు కొన్ని బెంగాలీ పాటలకు బాణీలు కట్టారు. ఇలా నలుగురూ పనులు పంచుకుని ‘శుభమస్తు’ను నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లారు. భౌమిక్, రాయ్ కలిసి మొదటి పెండ్లి వేడుక నిర్వహించారు. పంతులు ఉండాల్సిన చోట పంతులమ్మలు కూర్చోవడం ఏంటని అక్కడివారంతా ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఇదేం పోయే కాలం అని విమర్శించారు కూడా! వీటికి స్పందించకుండా… వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. మార్పును కోరుకునేవాళ్లు ‘శుభమస్తు’ను ఆదరించారు. కోల్‌కతా నగరం దాటి ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి కూడా ‘శుభమస్తు’కు బుకింగ్స్ రావడం విశేషం.
వివక్షకు శుభమస్తు వ్యతిరేకం. పౌరోహిత్యం ఎవరైనా చేయొచ్చని ఈ సంస్థ నమ్ముతుంది. పౌరోహిత్యం నిర్వహణకు ఒక కులాన్ని మాత్రమే అంగీకరించే వాళ్లున్నారు. ఈ సంప్రదాయాన్ని కూడా ధిక్కరించి ముందుకు సాగుతున్నది. పౌరోహిత్యంపై ఆసక్తి ఉంటే చాలు.. ఏ కులం వారైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, అవకాశాలూ కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఎంపికైన మహిళలకు ఏడు నెలల పాటు వివాహాది శుభకార్యాల మంత్రాలు వల్లె వేయిస్తారు. మంత్రోచ్చారణతోపాటు పదాలకు అర్థాలు, మంత్రాల పరమార్థం నేర్పిస్తారు.
అనువాద మంత్రాలు
ఈ పురోహితురాళ్లు ఎవరికీ తీసిపోరు. పురోహితుడు చేసే క్రతువులన్నీ అంతే శ్రద్ధగా వీళ్లూ నిర్వహిస్తారు. బారసాల నుంచి కర్మకాండల వరకు అన్నిటినీ శాస్ర్తోక్తంగా చేస్తారు. వేడుక ఏదైనా సశాస్త్రీయంగా నిర్వహిస్తారన్న పేరు తెచ్చుకున్నారు ‘శుభమస్తు’ పురోహితురాళ్లు. హిందువుల వేడుకల్లో కాలానుగుణంగా మార్పులు రావాలని ‘శుభమస్తు’ కోరుకుంటున్నది. సంస్కృతంలోని వేద మంత్రాలను బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో అనువదిస్తున్నది శుభమస్తు బృందం. మంత్రాలు అందరికీ అర్థమయ్యేలా బెంగాలీలోనూ చదువుతున్నారు. అంతేకాదు, వీరి పౌరోహిత్యంలో సంగీతం కూడా భాగమే. వైదిక కార్యక్రమం మరింత ఆకట్టుకునేలా ఉండాలంటే.. శ్లోకాలతోపాటు సంగీతం కూడా అవసరం అంటారు వీళ్లు. శ్లోకాలను రాగయుక్తంగా ఆలపిస్తూ, చక్కని చమత్కారాలతో వ్యాఖ్యానాలు చెబుతుంటారు. ఆసక్తిగా చెబుతున్న ముచ్చట్లే వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యుగాలుగా పురుషులు ఏలిన బ్రహ్మస్థానంలో సరస్వతులై శోభిల్లుతున్న ‘శుభమస్తు’ పంతులమ్మలకు జయహో!‘

లింగ వివక్ష లేని,మానవత్వం పరిఢవిల్లే సమాజం మా స్వప్నం.సమాన హక్కులు పొందలేని వారికి అండగా నిలబడటం మన బాధ్యత. మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం, అన్ని రంగాల్లో స్త్రీలు నిలదొక్కుకోవాలన్నదే మా ఆశయం’ అని శుభమస్తు (పురో)హితకారిణులు అంటున్నారు.