ప్రత్యేక గీతాల్లో ప్రదర్శన.. ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా’ సినిమాలో ఈ మిస్ వరల్డ్ ఓ ప్రత్యేక పాటలో అలరించింది. ‘రామ్ చాహే లీలా చాహే’.. అంటూ తన నృత్యాభినయంతో ఆకట్టుకున్నది.
ఓవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నది. తన ప్రస్తుత సినిమాలతోపాటు పాత చిత్రాల ముచ్చట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నది. తాజాగా, తన ఇన్‌స్టా వేదికగా ‘రామ్ చాహే లీలా చాహే..’ పాట క్లిప్పింగ్‌ను పోస్ట్ చేసింది ప్రియాంక చోప్రా. ఇలా ఓ ప్రత్యేక గీతానికి ఓకే చెప్పడం.. తన జీవితంలో తీసుకున్న సంక్లిష్టమైన నిర్ణయమని చెప్పుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నది.
‘సంజయ్ సర్ ఈ పాట కోసం నన్ను సంప్రదించినప్పుడు.. ‘నేను చేయగలనా!?’ అనుకున్నా. నా జీవితంలో నేను తీసుకున్న సంక్లిష్ట నిర్ణయం ఇదే. అందుకే.. కష్టంగానే ఒకే చెప్పా. అయితే, సంజయ్ సర్ నాకు ఎంతో ధైర్యానిచ్చారు. హావభావాలు మొదలుకొని డ్యాన్స్ మూమెంట్స్ వరకూ.. అన్నిట్లోనూ సలహాలిచ్చారు’ అంటూ రాసుకొచ్చింది. ‘కొరియోగ్రాఫర్ విష్ణదేవా.. ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు. భోజన విరామంలోనూ డ్యాన్స్ మూమెంట్స్ గురించే వివరించేవారు. ఈ జ్ఞాపకాలన్నీ నాకెప్పటికీ గుర్తుంటాయి’ అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దాన్ని చూసిన నెటిజన్లు ‘ఫైర్’ ఎమోజీలతో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.
షేక్స్పియర్ ‘రోమియో అండ్ జూలియట్’ ఆధారంగా రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో.. రణ్వీర్ సింగ్-దీపికా పడుకొనే ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా.. ఆ యేడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ భన్సాలీతో కలిసి పనిచేసింది ప్రియాంక చోప్రా. ‘బాజీరావు మస్తానీ’లో కాశీబాయి పాత్ర పోషించింది. తాజా సినిమాల విషయానికొస్తే.. ‘మహేష్ బాబు-రాజమౌళి’ సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నది ఈ ప్రంపచ సుందరి.