ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. నడవరా ముందుగా.. అంటూ ఆశావాదాన్ని నూరిపోస్తారో కవి. ఆ అడుగు ఎక్కడినుంచో పడదు. మనలో ఒకరే అలా నడుస్తారు, నడిపిస్తారు. బాల్యం నుంచీ తాను చూసిన సమాజం, అందులోని వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, లింగ వివక్ష.. రుబీనా నఫీజ్ ఫాతిమాను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ ఆలోచనల ఫలితమే పదిహేడేండ్ల క్రితం పుట్టిన ‘సఫా’ స్వచ్ఛంద సంస్థ. ఇప్పటివరకూ లక్షా పాతికవేల జీవితాలను తీర్చిదిద్దిన ఈ సంస్థ ప్రయాణం ఆమె మాటల్లోనే..
‘సఫా’ అంటే స్వచ్ఛమైన మనసు. స్వచ్ఛమైన మనసు ఉంటేనే.. స్వచ్ఛమైన మనసుతో పనిచేస్తేనే వ్యవస్థలో మంచి మార్పు చూడగలం. సమాజంలో అభివృద్ధి సాధించగలం. మా సంస్థ ద్వారా నిరుపేద మహిళలకు బతుకుదెరువు చూపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టే పేదరికం, వెనుకబాటుతనం అధికంగా ఉన్న పాతబస్తీని మా ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాం. మా తాతగారు మీర్ అఫ్తాబ్ అలీ ఖాన్ నిజాం సంస్థానంలో పనిచేసేవారు. నాన్న ఆర్మీలో ఉన్నతోద్యోగి. కుటుంబంలో అందరూ చదువుకున్నవాళ్లే. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే వాతావరణం ఉండేది ఇంట్లో. నేను కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. అయితే మా ఇంట్లో కనిపించే సానుకూల వాతావరణం బయట ఎక్కడా ఉండేది కాదు. ఎటుచూసినా నిరుపేద మహిళలే. ఇలాంటి వాళ్లకు నా వంతుగా సాయపడాలని అనిపించేది. అందుకే డిగ్రీ తర్వాత సోషల్ వర్క్‌లో వివిధ కోర్సులు చేశాను. వెనువెంటనే పెండ్లి, విదేశాల్లో కాపురం… ఇలా కొంతకాలం గడిచిపోయింది. తిరిగి ఇండియాకు వచ్చాక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలో తొలి మహిళా ఆంత్రప్రెన్యూర్ నేనే కావచ్చు. ఏడేండ్లు అదే వ్యాపారంలో ఉన్నాను. నాదీ అంటూ కొంత సొమ్ము జమైంది. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు ఆ డబ్బు వాడుకున్నా. ఆఫీసు కోసం చిన్న గదిని అద్దెకు తీసుకున్నా. అందులోనే రెండు కుట్టు మిషన్లు, ఇద్దరు టీచర్లు, నేను. అలా 2006లో సఫా ప్రారంభమైంది.
నడపలేనని అనుకున్నా..
రెండు సంవత్సరాలపాటు సొంత డబ్బుతోనే సంస్థను నిర్వహించాను. ఓ దశలో నిధులన్నీ నిండుకున్నాయి. ఇక, నడపలేనని అనిపించింది. కార్యక్రమాలు ఆపేద్దామని అనుకునే సమయంలో నాకు సద్గురు జ్ఞానానంద ఫెలోషిప్ వచ్చింది. నెలనెలా వాళ్లిచ్చే పదివేల రూపాయలు సఫా నిర్వహణకు పనికొచ్చాయి. నేను చేసే ఈ మంచి పనిని ఆపకూడదనే ఆ ఫెలోషిప్ నన్ను వరించినట్టు అనిపించింది. మరింత కష్టపడి పనిచేశాను. ఇప్పుడు డెలాయిట్ సహా వివిధ సంస్థలు మాతో కలిసి అడుగులేస్తున్నాయి. టైలరింగ్, జ్యూట్ బ్యాగుల అల్లిక, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలాంటి 14 ప్రాజెక్టులు మా దగ్గర నడుస్తున్నాయి.
నమ్మకం పెరిగింది
మూడేండ్ల క్రితం ‘లుఖ్మా’ పేరిట ఓ కిచెన్ ప్రారంభించాం. పేద మహిళలకు సర్టిఫైడ్ షెఫ్‌లతో హైదరాబాదీ బిర్యానీ సహా వివిధ వంటకాల తయారీ నేర్పించాం. ఈ ప్రయోగం విజయ వంతమైంది. దీనిద్వారా రోజుకు కనీసం వంద ప్యాకెట్ల ఆహారాన్ని విక్రయిస్తున్నాం. చదువు మధ్యలో ఆపేసిన వాళ్లకు బేసిక్ ఐటీ స్కిల్స్‌తో పాటు, స్పోకెన్ ఇంగ్లిష్, రిటైల్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నాం. ఏడాదికి సగటున మూడువేల నుంచి నాలుగువేల మందికి చేయూత అందిస్తున్నాం. అంతేకాదు, తమకాళ్ల మీద తాము నిలబడాలనుకునే చిరు వ్యాపారులకూ సాయం అందిస్తున్నది సఫా. ఇందులో తొలిదశగా రూ.1500 నుంచి 12 వేల దాకా ఎలాంటి పూచీకత్తూ, వడ్డీ లేకుండా రుణాన్ని ఇస్తాం. వాళ్ల పనితీరును దగ్గరగా గమనించి, అప్పు తిరిగి చెల్లించాక రెండో విడతగా మరో 75 వేల రూపాయల వరకూ సాయం అందిస్తాం. రికవరీ రేటు 95శాతం దాకా ఉంది. పేద మహిళలపై మేం పెంచుకున్న నమ్మకం వృథా కాలేదు. సఫా విజయానికి ఇవే సాక్ష్యాలు.
ఆ మార్పు కోసమే..
‘సఫాలో శిక్షణ పొందేవారు, సఫా ద్వారా సాయం అందుకునేవారు.. దాదాపుగా నిరుపేదలే. ఇందులో 65 శాతానికి పైగా ఆడవాళ్లే. ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వాళ్లు, విడిగా ఉంటున్న వాళ్లే. చాలామందిలో కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. వీళ్లకు తమ మీద తమకు నమ్మకం కల్పించేందుకు కెపాసిటీ బిల్డింగ్ లక్ష్యంగా రోష్నీ టీమ్స్ ఏర్పాటు చేశాం. వారానికి రెండు గంటల పాటు ఈ టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు పనిచేస్తాయి. అవి ఎంతలా మార్పు తీసుకొచ్చాయో చెప్పేందుకు చిన్న ఉదాహరణ చెబుతాను. సఫాలోని లుఖ్మా కిచెన్‌లో ఇరవైలలో ఉన్న ఒక అమ్మాయి పనిచేస్తున్నది. చిన్నవయసులోనే భర్త చనిపోయాడు, పిల్లల బాధ్యత కూడా తనదే. ఇక్కడికి వచ్చిన తొలినాళ్లలో నలుగురిలో నిలబడేందుకూ, మాట్లాడేందుకూ కూడా జంకేది. కానీ, ప్రస్తుతం వందమందిని కూర్చోబెట్టి సఫాకు సంబంధించిన విజయపాఠాలు చెబుతున్నది. ఇలాంటి వాళ్లను చూసినప్పుడే, నేను కోరుకున్న మార్పు ఇదే కదా అనే ఆత్మసంతృప్తి కలుగుతున్నది.’
– లక్ష్మీహరిత ఇంద్రగంటి