‘భూమి మనది. బతుకు మనది. విత్తు మనది. పంట మనది. వీటన్నిటిపై అధికారం మనకే ఉండాలె’ అంటున్నారు జహీరాబాద్ మహిళా రైతులు. జన్యు మార్పిడి విత్తనాలతో తల్లిలాంటి భూమికి హాని తలపెట్టరు. రసాయన సేద్యంతో విషపు ఆహారం బిడ్డలకు పెట్టరు. ఎంత మంచి మనసున్న తల్లులు! ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే ఈ తల్లులు విత్తనాన్నీ కాపాడుకుంటున్నారు. పాతపంటలు కాపాడేందుకు వాళ్లు నిర్మించుకున్న సీడ్ బ్యాంక్ ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డ్’ అందుకుంది. ప్రకృతిని కాపాడే కృషికి దక్కిన గుర్తింపు ఇది.

పాత పంటలను కాపాడుతూ, భావితరాల కోసం చిరుధాన్యాలను పండించాలని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని మహిళా రైతులు కృషి చేస్తున్నారు. విత్తనాల కోసం మార్కెట్‌పై ఆధారపడరు. రసాయన పురుగు మందులు వాడరు. సేంద్రియ సాగుపద్ధతులనే పాటిస్తారు. జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల పరిధిలోని డబ్బు గ్రామాల్లో ఈ తరహా సేంద్రియ సాగు జరుగుతున్నది. ఇలా సాగుచేస్తున్న సుమారు రెండువేల మంది మహిళా రైతులంతా డీడీఎస్ సహకారంతో కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ (సామాజిక విత్తన భాండాగారం) నిర్వహిస్తున్నారు. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో ఉంది. జన్యుమార్పిడి విత్తనాలు వాడకుండా తమ నేలకు, స్థానిక వాతావరణానికి అనువైన దేశీ విత్తనాలు కాపాడటం ఈ విత్తన భాండాగారం లక్ష్యం. సాయిజొన్న, పచ్చజొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోకజొన్న, సజ్జ, తైద, కొర్ర, సామ, శనగ, అర్గులు, పెసర, మినుము, కందులు, కోడిసామ మొదలైన పంటలెన్నో సాగుచేస్తున్నారు.

ఆ విత్తనాలను నిల్వచేస్తూ కాపాడుకుంటున్నారు. దాదాపుగా అరవై రకాల దేశవాళీ పంటల విత్తనాలను కాపాడుతున్నారు. రైతులు వ్యవసాయ సాగు పనులు ప్రారంభమయ్యే సమయంలో ఈ విత్తన బ్యాంక్ నుంచి విత్తనాలు తీసుకుంటారు. పంట చేతికి వచ్చిన తర్వాత నాణ్యమైన వంగడాలను విత్తన బ్యాంక్‌కి అందిస్తారు. సహజ పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసి వాటిని నిల్వ చేసుకుంటారు. పరస్పర సహకారం, పంటమార్పిడి పద్ధతులతో డబ్బు గ్రామాల రైతులకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే అనేక రకాల దేశీ పంటలు అంతరించకుండా సాగులో ఉన్నాయి. ఈ విత్తన భాండాగారానికి దాదాపు ఇరవై క్వింటాళ్ల విత్తనాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. బూడిద, వేపాకు కలిపిన విత్తనాలను ఈత బుట్టల్లో పోసి, పైన మట్టితో అలుకు పూసి నిల్వ చేసుకుంటారు. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (పీపీవీఎఫ్ఆర్ఏ) దేశ వ్యాప్తంగా ఉన్న విత్తన బ్యాంక్‌లను పరిశీలించి డీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా రైతులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ సీడ్ బ్యాంక్‌ని 2022-23 సంవత్సరానికి ‘ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డ్’కి ఎంపిక చేసింది. ఢిల్లీలో బుధవారం ఈ అవార్డు అందుకున్న ఆదర్శ మహిళా రైతుల్ని మనమూ అభినందిద్దాం!