వంటింట్లో ఉండే పోపుల పెట్టె.. ఓ ఔషధాల గని. అందులోని మసాలాలు.. వేటికవే సాటి! అయితే, వంటలకు రుచిని అందించే మసాలా దినుసులు.. తోటల్లో క్రిమిసంహారిణిగా, ఎరువుగానూ పనికొస్తున్నాయి. పసుపు నుంచి ఉప్పు దాకా.. మొక్కల పెరుగుదలలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
దాల్చిన చెక్కలో అద్భుతమైన యాంటి ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి మొక్కలకు హాని కలిగించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో పోరాడుతాయి. దాల్చిన చెక్కను పొడిగా చేసి, మొక్కల పాదుల దగ్గర వేస్తే.. చీమలు, సాలె పురుగులు, దోమ తెగుళ్లు పట్టకుండా ఉంటాయి.
వంటల్లో వాడే ఎప్సమ్ సాల్ట్.. మొక్కలు పెరగడానికి సాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం, సల్ఫర్ ఎక్కువగా లభిస్తుంది. కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన క్లోరోఫిల్ ఉత్పత్తిని మెగ్నీషియం ప్రోత్సహిస్తుంది. పూలు, పండ్ల ఉత్పత్తినీ పెంచుతుంది. ఒక లీటర్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్‌ను కరిగించాలి. ఈ ద్రావణాన్ని మొక్కల ఆకులపై పిచికారీ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పసుపులో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొక్కలు ఏపుగా ఎదగడానికి కీలకంగా వ్యవహరిస్తాయి. మట్టిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహించి.. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విత్తనశుద్ధిలోనూ పసుపు ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలపాలి. విత్తనాలను ఈ ద్రావణంలో కొన్ని గంటలు నానబెట్టిన తర్వాత నాటుకోవాలి. దీనివల్ల మొక్కలు వివిధ రకాలు వ్యాధులు, తెగుళ్లబారిన పడకుండా ఉంటాయి.
యాంటి ఫంగల్ లక్షణాలు కలిగిన మరో మసాలా దినుసు.. వెల్లుల్లి. దీని ఘాటైన వాసన.. మొక్కలకు ఈగలు, దోమలు,చీమలు పట్టకుండా కాపాడుతుంది. మొక్కలను తెగుళ్లు, కీటకాల బారినుంచి రక్షించడానికి సహజ పురుగుల మందుగానూ ఉపయోగపడుతుంది.
ఆవాల పొడి నుంచి వచ్చే ఘాటైన వాసన.. ఎలుకలు సహా చిన్నచిన్న కీటకాలు, పురుగులను తోటలోకి రాకుండా చేస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం.. మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
లవంగాలను ‘సహజ క్రిమిసంహారిణి’గా అభివర్ణిస్తారు. దీనిలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పెరటి మొక్కలకు తెగుళ్లు, బ్యాక్టిరియా సోకినట్లయితే.. లవంగాలను నానబెట్టిన నీటిని పిచికారీ చేయాలి. అంతేకాదు.. లవంగం నూనె దోమలను తరిమేస్తుంది. దోమల వల్ల వచ్చే తెగుళ్ల నుంచి మొక్కలను కాపాడుతుంది.