హాకీ స్టిక్ పట్టుకొని గోల్స్ కొట్టింది. టాటూ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేసింది. చిత్రకారిణిగా తనలోని సృజనాత్మకతకు ప్రాణం పోసింది. ఆపై నటిగా బుల్లితెరపై అద్భుతాలు చేస్తున్నది కన్నడ కస్తూరి పూజా దుర్గన్న. వరుస అవకాశాలతో సీరియల్స్లోరాణిస్తూ, సినిమాల్లోనూ మెరుస్తున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘సీతే రాముడి కట్నం’ సీరియల్లో మధుమితగా ప్రేక్షకులను అలరిస్తున్న పూజా దుర్గన్న జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మాది కర్ణాటకలోని బళ్లారి. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పటి నుంచి భిన్నమైన దారిని ఎంచుకుని నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని అనుకునేదాన్ని. ఆ ఆలోచనతోనే చదువుకునే రోజుల్లో ఆటలపై దృష్టిపెట్టా. కర్ణాటక హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. రెండు నేషనల్ మ్యాచ్‌లు ఆడాను. ఆ సమయం నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే. అమ్మానాన్న మమ్మల్ని ఎప్పుడూ ఆడపిల్లలని తక్కువ చేసి చూడలేదు. మా నానమ్మ కూడా చాలా సపోర్ట్ చేసేది. కొత్తగా చేయాలనే ఆలోచనతోనే టాటూలు వేయడం నేర్చుకున్నా. ఉత్తర కర్ణాటకలో నేనే మొదటి ఫీమేల్ టాటూ ఆర్టిస్ట్‌ని. చిత్తరువులు కూడా వేస్తాను.
కాలేజ్ డేస్ నుంచి నాకు నటన అంటే చాలా ఇష్టం. స్టేజ్ షోలు చేసేదాన్ని. స్నేహితులంతా సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించా. కానీ, వెంటనే చాన్సులు రాకపోవడంతో సీరియల్స్ వైపు మళ్లా. నాన్నకు ఆసరాగా ఉండాలని బుల్లితెర ఎంచుకున్నా. అలా మొదలైన ప్రయాణం ఎనిమిదేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నది. కన్నడలో సీరియల్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా జెమినీలో మొదటి ఆఫర్ వచ్చింది. వెంటనే ఒప్పుకొన్నా. ఆ సీరియల్ చేస్తున్న సమయంలోనే జీ తెలుగు నుంచి కాల్ వచ్చింది. ఆడిషన్ లేకుండానే సెలెక్ట్ చేశారు. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పాను. ‘సీతే రాముడి కట్నం’లో నేను పోషించిన మధుమిత పాత్రకి మంచి ఆదరణ దక్కింది. తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడికి వెళ్లినా మధుమిత అనే పిలుస్తుంటారు.
కన్నడలో నాలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశా. హీరోయిన్గా రెండు సినిమాలు నటించా. అవి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తెలుగులోనూ సినిమాల్లో మంచి పాత్రలు వస్తే చేయాలని ఉంది. ఇప్పటివరకు అన్నీ నెగెటివ్ పాత్రలే చేశా. మొదట్లో నేను ఎక్కడికి వెళ్లినా తిట్టుకునేవాళ్లు. నిజానికి నెగెటివ్ పాత్రల్లో నటించేందుకు ఎక్కువ కష్టపడాలి. నా నిజ జీవితానికి, ఆ పాత్రలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల వాటిని పూర్తిగా అర్థం చేసుకుని నటించడం కష్టంగా అనిపించేది. సీరియల్ అయినా, సినిమా అయినా హీరోయిన్‌గానే చేయాలనే ఆలోచన లేదు. నెగెటివ్ రోల్ అయినా తగిన ప్రాధాన్యం ఉంటే తప్పకుండా నటిస్తాను. ఆ తరహా పాత్రల్లో చాలా ఎమోషన్స్ పండించవచ్చు.
నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుని బళ్లారి నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యా. కెరీర్ కోసం పుట్టి, పెరిగిన ఊరును వదిలివెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు చాలా బాధపడ్డా. కానీ, నా కుటుంబానికి అండగా నిలవాలంటే తప్పదనిపించింది. ఇప్పటికీ బళ్లారి వెళ్తే నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తారు. పిలిచి సన్మానం చేస్తారు. అక్కడి పిల్లలు ‘అక్కా.. మాకు నువ్వే ఆదర్శం’ అంటూ ఉంటారు. సిటీల్లో పుట్టిపెరిగే వాళ్లకి నచ్చిన రంగం ఎంచుకోవడం సాధారణ విషయమే! అందులో రాణించడానికి అన్ని వనరులూ అక్కడ అందుబాటులో ఉంటాయి. కానీ, సిటీకి దూరంగా ఉండేవాళ్లు భిన్నమైన రంగాల్ని ఎంచుకోవడం, అందులో రాణించడం అంత తేలికైన విషయం కాదు.
నాకు భక్తి ఎక్కువ. శివుణ్ని పూజిస్తా. అమ్మవారంటే అపారమైన భక్తి. ఒకసారి నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లా. అక్కడ నిమ్మకాయల వరం ఇస్తారు. అక్కడ కూర్చుని ఏదైనా కోరుకుంటే అది నెరవేరేదైతే నిమ్మకాయ మీద పడుతుంది. నేను వెళ్లి అక్కడ కూర్చున్నా. ఒకలాంటి తన్మయత్వం కలిగింది. కొందరిని ఎంచుకుని కూర్చోబెడతారు. కూర్చుని అమ్మని ఏం అడగలేదు. నా తల్లిదండ్రులను ఒక కొడుకులాగా బాగా చూసుకోవాలి అని కోరుకున్నా. వెంటనే నాలుగు నిమ్మకాయలు పడ్డాయి. ఏడేండ్ల తర్వాత మళ్లీ గుడికి వెళ్లా .. అక్కడ అందరూ మధుమిత అని పిలుస్తూనే ఉన్నారు. అమ్మవారి దయ నాపై ఉందనిపించింది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మానాన్న, నానమ్మతోపాటు ఆ అమ్మవారి అనుగ్రహమనే అనుకుంటాను!