పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఆండ్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల రుతుక్రమం గతి తప్పి.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. టీనేజ్ అమ్మాయిలను ఈ సమస్య మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. ఓ పక్క చదువుల భారం, మరో పక్క పీసీఓఎస్ చికాకులు. ఇలాంటి సమయంలో ఉపయోగపడే చిట్కాలు..
రోజువారీ బాధ్యతలను ఓ షెడ్యూల్లా రూపొందించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులను గుర్తించి సకాలంలో పూర్తిచేస్తే మనసు తేలికపడుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల మానసిక ఆందోళన పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి… పెద్దపెద్ద పనులను చిన్నపాటి భాగాలుగా విభజించుకోవాలి.
దీర్ఘశ్వాస, ధ్యానం, యోగ ద్వారా మానసిక ప్రశాంతత సాధ్యమవుతుంది. క్రమం తప్పని వ్యాయామం, నడక, క్రీడల వల్ల పీసీఓఎస్ అంతగా ప్రభావితం చేయదు. తగినంత గాఢ నిద్రతో హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది.
తాజా పళ్లు, ఆకుకూరలు లాంటి ఆరోగ్యవంతమైన ఆహారం వల్ల.. సత్తువ, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి.
చికాకుల్ని, భయాల్ని మనసులోనే దాచుకుంటే ఉపయోగం లేదు. నిర్మొహమాటంగా తల్లిదండ్రులు, స్నేహితులతో చెప్పుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి.