పక్షవాతం అనగానే అందరిలో టెన్షన్ మొదలవుతుంది. కానీ, పెరాలసిస్ గురించి అంతగా పరేషాన్ కావొద్దంటున్నారు వైద్యులు. తక్షణ స్పందనతో ‘పెరాలసిస్’ ముప్పునుంచి పూర్తి రక్షణ లభిస్తుందని భరోసా ఇస్తున్నారు. పక్షవాతానికి గురైన రోగులకు ఇప్పుడు అధునాతనమైన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అదే.. థ్రాంబెక్టమీ. జనరల్ అనస్తీషియా అవసరం లేని సర్జరీ ఇది. కేవలం లోకల్ అనస్తీషియాతో పక్షవాతం వచ్చిన 24 గంటల్లోగా ఈ థ్రాంబెక్టమీ చేస్తే మంచి ఫలితాలుంటాయి. పక్షవాతంతో పోలిస్తే గుండెపోటు నుంచి బయటపడటం చాలా సులువు. గుండె ఎక్కడుంటుందో గుండెపోటు లక్షణాలు కూడా అక్కడే ఉంటాయి.
కానీ, మెదడులో సమస్య వల్ల ఏర్పడే పక్షవాతం లక్షణాలు కాళ్లు చేతుల్లోనో కనిపిస్తాయి. అందుకే పక్షవాతాన్ని తొందరగా గుర్తించలేకపోతారు. అంతేకాదు.. గుండెపోటుకు ఒక్క ఈసీజీ చూసి అవసరమైన చికిత్సకు సిద్ధం కావొచ్చు. కానీ, పక్షవాతం ఉన్నప్పుడు దానికి సీటీ ఆంజియోగ్రామ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ఆంజియోగ్రామ్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. వీటిలో ఏ రకమైన పక్షవాతం అనేదే కాకుండా, ఎంత నాడీ కణజాలం ప్రభావితం అయ్యిందనే విషయం కూడా తెలుస్తుంది. వీటిద్వారా సమస్యను పూర్తిగా నిర్ధారించి, దానికి అనుగుణమైన చికిత్స తీసుకోవచ్చు.
సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రతి పదిమందిలో నలుగురికి ఇంజెక్షన్ అవసరమైతే.. ఇద్దరికి సర్జరీ చేయాల్సి వస్తుంది. శస్త్రచికిత్స అనగానే ఇదేదో పెద్ద కోత పెట్టి చేసే ఆపరేషన్ అని భయపడనక్కర్లేదు. కాలి రక్తనాళం ద్వారా కాథెటర్ గుండా స్టంట్ రీవర్ అనే పరికరాన్ని క్లాట్ దగ్గరికి పంపించి, దాన్ని తొలగించడమే ఈ సర్జరీ. దీన్ని థ్రాంబెక్టమీ అంటారు. రోగి తొడ భాగంలో చిన్న కోత పెట్టి ఆస్టిక్ ఫైబర్ కేబుల్‌ను రక్తనాళం గుండా మెదడులో మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపిస్తారు. తర్వాత సున్నితమైన గొడుగు లాంటి స్టంట్ రీవర్ను కాథెటర్ గుండా పంపిస్తారు. మెదడు రక్తనాళంలో పూడిక ఉన్న చోట స్టంట్ రీవర్ గొడుగు లాగా తెరుచుకుని అక్కడ అడ్డంగా ఉన్న గడ్డను తనలోకి తీసేసుకుంటుంది. అప్పుడు దాన్ని బయటకు లాగేస్తారు. ఇలా రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ తొలగిపోవడంతో రక్తప్రసరణ సాఫీగా కొనసాగుతుంది.
రక్తనాళంలో చిన్న చిన్న గడ్డలు లేదా క్లాట్స్ ఏర్పడినప్పుడు చేతికి ఇంజెక్షన్ ఇస్తే అవి కరిగిపోతాయి. కానీ పెద్ద రక్తనాళంలో ఏర్పడే పెద్ద పెద్ద క్లాట్స్‌ను కరిగించాలంటే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్‌తోపాటు సర్జరీ కూడా అవసరం అవుతుంది. పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల తర్వాత హాస్పిటల్‌కి వచ్చినా సర్జరీ అవసరం అవుతుంది. ఇంజెక్షన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవాళ్లకి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. అంటే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ లాంటి మందులు తీసుకున్నవాళ్లు, అంతకుముందు నెలలోపు సర్జరీ అయినవాళ్లు, ఇటీవలే స్ట్రోక్ వచ్చినవాళ్లకు థ్రాంబోలైటిక్ థెరపీ చేయలేం. ఇలాంటివాళ్లకు థ్రాంబెక్టమీ సర్జరీ చేయాల్సి వస్తుంది.
సాధారణంగా స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల్లోగా థ్రాంబోలైటిక్ థెరపీ తీసుకోవాలి. ఏ కారణం చేతనైనా హాస్పిటల్‌కి రావడం ఆలస్యం అయినవాళ్లకు ఈ థ్రాంబెక్టమీ మరో దారి చూపిస్తుంది. ఈ సర్జరీని పక్షవాతం వచ్చిన 24 గంటల్లోగా చేయవచ్చు.
ఒకసారి థ్రాంబెక్టమీ చేసిన తరువాత మళ్లీ అవసరమైతే.. ఇలా ఎన్నిసార్లయినా చేయొచ్చు. సర్జరీ తరువాత 5 నుంచి 20 శాతం మందిలో బ్రెయిన్లో వాపు రావొచ్చు. వారికి ఓపెన్ సర్జరీ అవసరం పడొచ్చు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న న్యూరో నావిగేషన్, న్యూరో మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ 3T ఎంఆర్ఐ వంటి ప్రపంచస్థాయి శస్త్ర చికిత్సా విధానాలతో బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యాధునిక సర్జరీ పరిష్కారాలు కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి. నావిగేషన్ అంటే దారి చూపించడం. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్‌లో భాగమైన న్యూరో నావిగేషన్ ఉపయోగించే వైద్యులకు మెదడులోకి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాని రోజుల్లో వైద్యులు కేవలం తమ అనుభవాన్ని బట్టి గడ్డ సైజును, భాగాన్ని అంచనా వేసి సర్జరీతో తొలగించేవారు. ఇలా చేయడం వల్ల నాడులు దెబ్బతినవచ్చు. గడ్డ ఎంతో కొంత మెదడులోనే మిగిలిపోతూ ఉండవచ్చు. లేదంటే గడ్డను తొలగించే క్రమంలో నాడులకు నష్టం జరిగి పక్షవాతం కూడా రావొచ్చు. కానీ ఈ కొత్త పద్ధతి ద్వారా ఇటువంటి ఇబ్బందులేమీ ఉండవు.
శరీరంలోని కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే కణ కణానికీ నిరంతరం రక్తం సరఫరా కావాలి. మెదడులోని కణాలు కూడా అంతే. ఏ కారణం చేతనైనా మెదడుకు తగినంత రక్తం అందకపోతే ఆయా కణాలు దెబ్బతిని చనిపోతాయి. ఇలా రక్తం అందకపోవడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి.
ఇస్కిమిక్ స్ట్రోక్: మెదడుకు మొత్తం నాలుగు రక్తనాళాలు వెళ్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు ఎడమవైపు మెదడుకి, రెండు కుడివైపు మెదడుకి వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగకపోవడంతో పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం.
హేమరేజిక్ స్ట్రోక్: రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటికి రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు వచ్చే పక్షవాతం ఇది. దాదాపు 20 శాతం పక్షవాతం కేసులకు ఇదే కారణం.
పక్షవాతం రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మధుమేహం కూడా కారణమవుతుంది. బీపీ, మధుమేహం ఇంతకు ముందైతే 60 ఏండ్లు పైబడిన వారిలో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా జంక్‌ఫుడ్‌కి అలవాటు పడటం, స్మోకింగ్, మద్యపానంతో రుగ్మతలు కొని తెచ్చుకుంటున్నారు. నేటి యువత డ్రగ్స్‌కు కూడా అలవాటుపడుతున్నది. ఇవన్నీ కూడా పక్షవాతానికి కారణమయ్యేవే. మరో ముఖ్య కారణం అధిక ఒత్తిడి. కార్పొరేట్ ఉద్యోగాలు పెరిగిన తరువాత చాలామంది చిన్న వయసులోనే అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దాంతో నిండా ముప్పయ్యేళ్లు దాటకుండానే పక్షవాతానికి గురవుతున్నారు.
ఇలాంటి జీవనశైలి సంబంధిత కారణాలతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా పక్షవాతం రావడానికి దోహదపడుతాయి. పక్షవాతానికి మరో కారణం డైసెక్షన్. దీనిలో రక్తనాళంలోని రెండు పొరలు విచ్చుకుంటాయి. సాధారణంగా రక్తనాళంలో 3 పొరలుంటాయి. వీటిలోమొదటి రెండు పొరలు ఓపెన్ అయిపోయి అందులోకి రక్తం వెళ్తుంది. దానివల్ల పక్షవాతం వస్తుంది. ఎక్కువగా మసాజ్ చేయించుకోవడం, లాంగ్ డ్రైవ్ చేయడం, డ్రైవ్ చేస్తూ మెడ వెనక్కి తిప్పడం వల్ల రక్తనాళాలు ట్విస్ట్ అయిపోయి సమస్య రావొచ్చు. చిన్నారుల్లో గుండెజబ్బుల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలెక్కువ. ఆ తర్వాత సికిల్ సెల్ అనీమియా, మోయా-మోయా అనే వ్యాధి (దీనిలో రక్తనాళాలు సన్నగా అవుతాయి) లాంటివి పిల్లల్లో పక్షవాతం రావడానికి కారణమవుతాయి.
మెదడులోని నాడీ కణజాలానికి రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు, పోషకాలు, ఆక్సిజన్ అందక అక్కడి కణాలు నశిస్తాయి. ఇలాంటప్పుడు ఏ నాడీకణజాలం మన శరీరంలోని ఏ పనిని నిర్వర్తిస్తుందో ఆ కణజాలం దెబ్బతినడం వల్ల ఆయా పనులు చేయలేకపోతాం. ఉదాహరణకు కాలు, చెయ్యి కదలికలను నియంత్రించే నాడీ కణజాలానికి రక్తం అందక అది మరణిస్తే ఇక కాలు, చెయ్యి కదిలించలేం. మాటకు సంబంధించి పనిచేసే నాడీ కణజాలం దెబ్బతింటే మాట పడిపోవడమో, సరిగా మాట్లాడలేకపోవడమో లాంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా ఏ అవయవానికి సంబంధించిన నాడీకణజాలం దెబ్బతింటే ఆ అవయవం చచ్చుబడుతుందన్నమాట.
పక్షవాతం వచ్చినా నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. పక్షవాతానికి ఒకప్పుడు ట్రీట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది. పక్షవాత లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెడితే అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రాణాపాయం తప్పుతుంది. హాస్పిటల్‌కి వెళ్లగానే మొదట సీటీ స్కాన్ చేస్తారు. దీనిలో రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేక బ్లాక్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది.
రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్ వల్ల వచ్చిన ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వెంటనే క్లాట్ కరగడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇలా ఇంజెక్షన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. దీనివల్ల అప్పటివరకు చచ్చుబడిన భాగాల్లో మెరుగుదల ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వల్ల రక్తసరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. దాంతో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాడీకణాలకు ఆక్సిజన్ అంది, ఇంప్రూవ్ అవుతాయి. ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ రక్తనాళంలో గడ్డ కరగకుండా రక్తనాళం తెరుచుకోకపోతే, మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే ఎండోవాస్కులర్ థెరపీ ద్వారా కాథెటర్ పంపి, క్లాట్ తీసేస్తారు. ఇది 6 గంటలలోపు చేయాలి.
కొందరిలో 24 గంటలలోపు కూడా చేయవచ్చు. పక్షవాతం నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ అత్యంత ముఖ్యమైన చికిత్స. ఫిజియోథెరపీలో స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు చేయిస్తారు. స్టిఫ్నెస్ పోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు. వాకింగ్ చేయిస్తారు. ఇలాంటి వాటివల్ల పక్షవాతానికి గురైన అవయవాలు శక్తిని పుంజుకుని, వాటి పనితీరు మెరుగుపడుతుంది. థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్లు ప్రతి జిల్లాలోనూ జిల్లాస్థాయిలోనైనా అందుబాటులో ఉంటే అక్కడే వెంటనే చికిత్స ఇవ్వవచ్చు. వాళ్లు ఇక్కడివరకూ వచ్చే టైం మిగులుతుంది.
నాడీకణాలు ఒకసారి చచ్చిపోతే ఇక కొత్తవి ఏర్పడవు. కాబట్టి అవి నశించిపోకుండా చూసుకోవాలి. స్ట్రోక్ వచ్చినప్పుడు రక్తసరఫరా ఆగిపోయిన చోట ఉన్న కొన్ని కణాలు వెంటనే దెబ్బతింటాయి. నిమిష నిమిషానికీ ఇలా దెబ్బతినే కణాల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఒక నిమిషానికి 7 బిలియన్ల న్యూరాన్లు చనిపోతాయి. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ప్రతీ నిమిషం కీలకమైనదే. బ్లాక్ దగ్గర ఉన్న కణాల చుట్టూ కొంతమేర ఉండే కణజాలాన్ని పెనెంబ్రా అంటారు. దీన్ని రిస్క్‌లో ఉన్న కణజాలంగా పరిగణిస్తారు. ఈ కణజాలం ఎంత ఎక్కువ భాగం డ్యామేజి అయితే అంత ఎక్కువ నష్టం ఉంటుంది. టైం దాటిపోతున్న కొద్దీ చికిత్స ఫలితం వేరుగా ఉంటుంది. రిస్క్ కణజాలం మొత్తం డ్యామేజి అయితే ఏ చికిత్సా చేయలేం. అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కి తీసుకొస్తే అంత మంచిది.
-డాక్టర్ ఆర్ అయ్యాదురై సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పటల్స్, సికింద్రాబాద్