తెలుగువాళ్లకు అవార్డ్ సినిమాలు తీయడం రాదని ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భాల్లో ఒక విమర్శ వినిపిస్తుంది. ఆడవాళ్లు సినిమా లాంటి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎదగడం కొంచెం కష్టం అనే మాటా వినిపిస్తుంది. ఇవి రెండూ తప్పుడు మాటలని ఆమె నిరూపించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ‘గాంధీ తాత చెట్టు’కు అవార్డులు పండుతున్నాయ్. ఈ సినిమా కోసం అమ్మాయిలు ఎన్ని చేతులు వేశారో అంతకంటే ఎక్కువే అవార్డులు వచ్చాయంటున్నది సినిమా దర్శకురాలు పద్మావతి మల్లాది. అనూహ్యంగా సినీ రంగంలో అడుగుపెట్టి, ఒక్కోమెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయ వేదికలెక్కిన ఆమె తన ప్రస్థానాన్ని జిందగీతో ఇలా పంచుకున్నారు..
మా అమ్మ అకడమీషియన్. నాకూ టీచర్ కావాలని ఉండేది. ఎంబీయే పూర్తయ్యాక లైఫ్ స్కిల్స్ నేర్పే ఇన్స్టిట్యూట్ పెట్టాను. పాఠశాలలు, కాలేజీల్లో వర్క్‌షాప్స్ నిర్వహించి టైమ్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నేర్పించేదాన్ని. రెండు సంవత్సరాలు అలా గడిచింది. ఓ రోజు నా స్నేహితుడు వంశీ ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడని తెలిసింది. ఆ కథ చదవమని పంపించాడు. అది చదివి కొన్ని మార్పులు చెప్పాను. చాలా బాగా చెప్పావని మెచ్చుకున్నాడు. తను డైరెక్టర్ రాధాకృష్ణ గారికి నన్ను పరిచయం చేశాడు. ఆయన ‘జిల్’ సినిమా స్క్రిప్ట్ ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ పని అప్పగించారు. ‘ఏవైనా కథలు రాశావా?’ అనడిగారు. అరేంజ్డ్ మ్యారేజెస్ గురించి రాసిన ‘సమ్మతం’ ఆయనకు పంపించాను. ఆ కథ చదివి డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గారిని కలవమని పంపించారు. అలాగే కలిశాను. ఆయన నాతో చాలాసేపు మాట్లాడారు. ‘ఏ కథలు ఇష్టం. ఎలాంటి సినిమాలు ఇష్టం. ఎందుకు ఇష్టం. దాంట్లో నచ్చిందేమిటి?’ అని ప్రశ్నలు అడుగుతూపోయారు. చివరికి ‘మనమంతా’ సినిమాకు మాటలు రాయమన్నారు. అదే విషయం ఇంట్లో చెబితే అమ్మ ఆశ్చర్యపోయింది. ‘ఈ ఒక్క సినిమాకి చేయి. పని చేస్తున్నప్పుడు సంతోషం ఉంటే ఇదే నీ ఫ్యూచర్ అనుకో. లేకపోతే వదిలెయ్ ’అని పెద్దనాన్న చెప్పారు.
‘మనమంతా’ అయిపోయాక సినిమాల్లో చేయగలననే నమ్మకం వచ్చింది. అందులో నేను చేసింది పెద్దగా ఏమీలేదు. నేర్చుకున్నదే ఎక్కువ. నాకు చాలా ఐడియాలు వచ్చేవి. వాటిని స్క్రీన్ప్లేలోకి ఎలా తీసుకురావాలో చంద్రశేఖర్ ఏలేటి గారు నేర్పించారు. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ సినిమా కోసం రాధాకృష్ణ గారి దగ్గర చేరాను. ఓ రోజు.. మహానటి సావిత్రి గారి బయోపిక్ తీస్తున్నారనే వార్త చదివాను. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలు ఎన్నో చూశాను. సావిత్రి గారి మీద ఉన్న ఇష్టంతో ‘మహానటి’కి పని చేయాలనిపించింది. వెంటనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని కలిశాను. ఆయన సావిత్రి గారి జీవితంలో మూడు విషయాలు చెప్పారు. స్క్రీన్ కోసం ఆ సీన్స్ రాయమన్నారు. రెండు రోజుల్లో ఇవ్వాలని షరతు పెట్టారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు. నాకు తెలిసింది సినిమాల్లో సావిత్రి గారు మాత్రమే. ఆమె వీడియో ఇంటర్వ్యూలు పెద్దగా అందుబాటులో లేవు. సావిత్రి గారి గురించి పల్లవి అనే రచయిత రాసిన నవల చదివాక కొంత అవగాహన వచ్చింది. బయోపిక్ కోసం పని చేస్తున్నప్పుడు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవడంతోపాటు అది జరిగినప్పుడు వాళ్లు ఎలా ప్రవర్తించారో అర్థం చేసుకోవాలి. రెండు రోజుల్లో పంపిస్తానన్న స్క్రిప్ట్ పది రోజులకు పంపాను. పంపిన రెండు గంటల్లోనే నాగ్ అశ్విన్ కాల్ చేశారు. ‘నేను ఎలా అనుకుంటున్నానో? అలా రాశావు! ఎవరినీ అనుకరించకుండా, కొత్తగా రాస్తున్నావు!’ అన్నారు. అలా మేమిద్దరం సావిత్రి సినిమా స్క్రీన్‌ప్లే రాశాం. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకున్నాను. ‘మహానటి’ సినిమా చాలా అవార్డులు గెలుచుకుంది! నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదే నా ఫ్యూచర్ అనుకున్నాను. ‘మహానటి’ ఎంత హిట్ అయినా అది రెగ్యులర్ మాస్ మూవీ కాదు. మంచి పేరొచ్చింది. కానీ, కమర్షియల్ సినిమాలకు అవకాశాలు రాలేదు.
‘మహానటి’ అనుభవం తర్వాత అంత గొప్ప పని కంటే అలవోకగా అయ్యేవి చేయాలనుకున్నాను. డైరెక్టర్ సింధూ చూసి చూడగానే సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చింది. ఇలా ఓ డజనుకుపైగా రెగ్యులర్, కమర్షియల్ సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వాటిలో కొన్ని విడుదలయ్యాయి. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘అమ్ము’ సినిమా తీయాలనుకున్నారు. దాని కథ చారుకేశ రాశారు. అమెజాన్ ప్రైమ్‌కి ఆ స్టోరీ నచ్చింది. కానీ, తెలుగులో ఈ తరహా సినిమాలు రాలేదు. దీనిని తెలుగులో తీయమని షరతు పెట్టారు. అప్పుడు కార్తీక్ నన్ను సంప్రదించారు. ‘అమ్ము’కు ఒక రచయిత్రితోనే మాటలు రాయించాలని చెప్పారు. సరే అన్నాను. సినిమాల్లో కథ, మాటలు రాయడానికి మహిళల అవసరం ఉంది. ఒక కథలో మహిళ పాత్రను మగవాళ్లు రాసిన దానికంటే మహిళ రాస్తేనే అర్థవంతంగా ఉంటుంది. పాత్రకు ఘటనలే కాదు అనుభవాలూ ముఖ్యం. అందుకే స్త్రీ పాత్రకు స్త్రీలే న్యాయం చేయగలరు. కానీ, మన సినిమాల్లో గుప్పెడు మంది కూడా రచయిత్రులు లేరు. ‘అమ్ము’ సినిమా యూనిట్లో ఎవరికీ తెలుగు రాదు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో స్క్రిప్ట్‌లో ఏదైనా తప్పు ఉంటే డైరెక్టర్ మీదికి తోసేయొచ్చు. కానీ, ఈ సినిమాకు ఏది రాసినా నాదే బాధ్యత. చాలా సినిమాలకు చేశాను. కానీ, ‘అమ్ము’ డైలాగ్స్ నాకు చాలా ఇష్టం.
‘గాంధీ తాత చెట్టు’ కథ ఆలోచన వచ్చినప్పటి నుంచి నేనే డైరెక్ట్ చేయాలనిపించింది. ఎవరికీ ఇవ్వాలనిపించలేదు. పదికిపైగా ప్రొడక్షన్ హౌస్‌లను సంప్రదించాను. కథ బాగుందన్నారు. కానీ, ‘ఈ సినిమా మనం చేయలేమమ్మా’ అన్నారు. కారణం ఇది అమ్మాయి మెయిన్ రోల్, అందునా పదమూడేండ్ల ఆడపిల్ల. అందుకే వద్దనుకున్నారని అనుకుంటా. ఎలాగైనా ఈ సినిమా చేయాలని సింధుతో అంటే తనే ప్రొడ్యూస్ చేస్తానంది. ‘నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా?’ అంటే ‘లేవు. కానీ ఏదో ఒకటి చేద్దాం’ అంది. సినిమాస్ స్టాక్ ఎక్సేంజ్‌లో స్టోరీని లిస్టింగ్ చేశాం. ఆడిషన్స్‌లో ప్రధాన పాత్రకు సరైన అమ్మాయి దొరకట్లేదు. ఒక సినిమా ప్రివ్యూకి వెళ్తే డైరెక్టర్ సుకుమార్ గారు తారసపడ్డారు. ఆయనతోపాటు వాళ్లమ్మాయి సుకృతి కూడా వచ్చింది. సింధూకి తను నచ్చింది. ‘నాకు పాడటం ఇష్టం. నటిని కావాలన్న కోరిక లేనప్పుడు నేనెందుకు నటించాలి?’ అని సుకృతి అన్నది. కానీ, ఆమెను కన్విన్స్ చేసి, రెండు వారాలు వర్క్‌షాప్ పెట్టాం. తాను సరిపోతుందని, చేయగలదని నమ్మకం వచ్చింది. ఈలోగా మాకు వందశాతం ఫండింగ్ వచ్చింది. ‘గాంధీ తాత చెట్టు’ పట్టాలెక్కింది. ఒక అమ్మాయి తాత గాంధేయవాది. గాంధీ చరిత్రను కథలుగా చెప్తుంటాడు. వాళ్ల ఊళ్లో ఒక సమస్య వచ్చింది. తాత దగ్గర నేర్చుకున్న జ్ఞానంతో ఆ అమ్మాయి ఆ సమస్యను ఎలా పరిష్కరించిందన్నదే ఈ సినిమా కథ. ‘మహానటి’తో మంచి పేరు, ‘గాంధీ తాత చెట్టు’తో అవార్డులు సాధించాను. నాకు సింగీతం శ్రీనివాసరావు గారంటే ఎంతో అభిమానం. ఇకముందు ఆయనలా ప్రయోగాత్మక చిత్రాలు తీసి, కమర్షియల్గానూ విజయాలు సాధించాలని అనుకుంటున్నాను.
‘గాంధీ తాత చెట్టు’ సినిమా 20 ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి ఎంపికైంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎనిమిది అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫిల్మ్తోపాటు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుకృతికీ అవార్డు వచ్చింది. మొన్నటి దాకా ఈ సినిమా ఒకటుందని ఎవరికీ తెలియదు. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది. ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్‌కు సినిమా అవార్డు సాధించడం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. నాకూ, సింధూకి ఇది మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా జనాల్లోకి పోతే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి ఉంది.
– నాగవర్ధన్ రాయల
– సీఎం ప్రవీణ్