అమ్మ నాటిన బీరపాదు ఆయన మొక్కవోని దీక్షకు నాంది. మాస్టారి పాఠం ఓ మొక్కను నాటమని ప్రోత్సహిస్తే… ఓ తోటమాలి చెప్పిన మాట మరో మొక్కను పెంచమని ఉత్సాహాన్ని ఇచ్చింది. మునిముత్తాత పెంచిన వేపచెట్లు ఆయన సంకల్పానికి మెట్లయ్యాయి. వెరసి సాదాసీదా రామయ్య.. వనజీవి రామయ్యగా మారాడు. పద్మశ్రీ రామయ్యగా కీర్తి గడించాడు. ముక్కోటికిపైగా మొక్కలు నాటి.. అవనికి వసంతం పంచిన ఘనజీవిగా ఎదిగాడు. పుడమిపై పచ్చని సంతకం చేసిన రామయ్య.. ఇప్పుడు మిన్నులో అడవిని పెంచడానికి వెళ్లిపోయాడు.
రామయ్య మనందరిలాగే ఖాళీ చేతులతోనే పుట్టాడు. కానీ, అందరిలా ఖాళీ చేతులతో వెళ్లిపోలేదు. ఆ చేతులు తరతరాలు నిలబడే ఎన్నో తరులకు జన్మనిచ్చాయి. ఈ హరిత స్వాప్నికుడు ముక్కోటికి పైగా మానులకు జీవం పోసిన మునీశ్వరుడు. ఆయన ధ్యాస మొక్కలు. శ్వాస మొక్కలు. జీవితమంతా వనంతో సావాసమే! ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణం. ‘ఆట’విడుపుగా మొదలైన అలవాటు.. కొనప్రాణం పోయేదాకా కొనసాగింది.
రామయ్య వనరాజు. ఆయన ఓ కిరీటమూ ధరించేవాడు. ముఖానికి గుండ్రంగా పెట్టుకున్న అట్టముక్క కిరీటంపై ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి కనిపిస్తుంది. మెడలో పచ్చని పతకం. దానిపైనా అదే సూక్తి. జోలెలో విత్తనాలు. సంచిలో పది, పదిహేను మొక్కలు. ఎక్కడికి వెళ్లినా ఇలాగే వెళ్లేవాడు. ఊరి శివారుకు వెళ్లినా ఇలాగే ఉండేవాడు. ఏదైనా పెద్దల సభకు వెళ్లినా అలాగే వెళ్లేవాడు. ‘నా తీరు చూసి నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటారు. ఈ సూక్తులు చూసి ఒక్కరైనా ఒక మొక్క నాటకపోతారా అన్న నమ్మకం నాది. అందుకే ఈ ఆహార్యం’ అనేవాడు రామయ్య.
చిన్నప్పుడు రామయ్య, అతని స్నేహితులు అగ్గిపెట్టెలతో రైలు చేసుకొని ఆడుకునేవాళ్లు. అగ్గిపెట్టెలు ఎన్ని ఉంటే అంత పెద్ద రైలు అవుతుంది. అందుకోసం ఇంట్లో ఉండే అగ్గిపెట్టెలు తెలివిగా సేకరించేవాళ్లంతా. చిన్నారి రామయ్య అందులో సిద్ధహస్తుడే! కానీ, ఎన్ని రోజులని తస్కరించగలడు. నేరం బయటపడేది.. వీపు విమానం మోత మోగేది. ఓ రోజు తల్లి పెరట్లో బీర గింజలు చల్లడం చూశాడు రామయ్య. నాలుగు రోజుల్లో బీర తీగ మొలకెత్తింది. పది రోజుల్లో చుట్టంతా పాకింది. మరో నెలకు పూలు పూశాయి. ఆపై కాయలు కాశాయి. అగ్గిపుల్లలు నాటితే… నిప్పుపెట్టెలు కాస్తాయని భ్రమపడ్డాడు రామయ్య. ఇంట్లో ఉన్న నిప్పుపెట్టె ఖాళీ చేసి.. పుల్లలను పెరట్లో నాటాడు. తల్లి చూసి మందలించింది. ‘విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి కానీ, వస్తువులు నాటితే రావు’ అని చెప్పింది. ఓహో అనుకున్నాడు రామయ్య. మర్నాటి నుంచే మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకున్నాడు.
అదే బాల్యంలో తోటలకు వెళ్లి.. చెట్లకున్న పండ్లను రాళ్లతో కొట్టి పడేయడం మరో అలవాటుగా ఉండేది. రాలిన పండ్లు తీసుకోండని తోటమాలి చెప్పాడు. రామయ్య సరేనంటూ తలూపాడు. నాలుగు రోజులు గడిచాయి. స్నేహితులంతా మామిడితోటలో చొరబడ్డారు. రామయ్య సిన్సియర్‌గా కిందపడ్డ పండ్లను వెతికే పనిలో ఉన్నాడు. స్నేహితుల్లో కొందరు రాళ్లతో చెట్లను కొట్టడం మొదలుపెట్టారు. తోటమాలి వచ్చాడు. అందరూ పరార్! రామయ్య మాత్రం అక్కడే ఉన్నాడు. ఈ పిల్లగాడు దొంగతనం చేయలేదు అనిపించింది తోటమాలికి. ఇద్దరికీ నెయ్యం కుదిరింది. సెలవుల్లో ఆ తోటలోనే ఎక్కువ కాలం గడిపేవాడు రామయ్య. చెట్టుపై పండి కింద రాలిన పండ్లను ఏరుకొని వచ్చి.. తోటమాలితో కలిసి తినేవాడు. ఆయన సలహాతో మామిడి టెంకలను చెత్తకుప్పలో పారేయకుండా నాటడం విధిగా అలవాటు చేసుకున్నాడు. అలా రామయ్య మొక్కలు నాటే సంకల్పానికి మరో సంఘటన ఊతమిచ్చింది.
రామయ్య ఐదో తరగతి చదువుతున్న రోజులవి. తమ పిల్లల అల్లరిపై బడిలో మాస్టారు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘ఇదేం పాడు పనిరా! ఇతరుల చెట్ల కాయలు మీరు కోయడం ఏమిటి? చివాట్లు తినడం ఎందుకు? మీరే మొక్కలు నాటి, వాటిని సంరక్షించి, ఆ ఫలాలు మీరే తినొచ్చుగా’ అని హితవు పలికాడు. ఆ మాటలు అక్కడున్నవారంతా ఆ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టారు. కానీ, మాస్టారి మాటలు రామయ్యపై మంత్రదండంలా పనిచేశాయి. మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాడు.
రామయ్య మునిముత్తాత (ఐదు తరాలకు ముందు) ఊరు శివారులో కొన్ని వేప మొక్కలు నాటించాడట. రామయ్య తరం వచ్చేసరికి అవి పెద్ద వృక్షాలయ్యాయి. వయసు మీరి కూలిపోయాయి. ‘తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తులు పంచుకున్నాం కానీ, వారి ఆశయాలు ఎందుకు పంచుకోకూడదు’ ఐదో తరగతితో చదువు ఆపేసిన రామయ్య మదిలో మెదిలిన ప్రశ్న ఇది. వారి వారసుడిగా మొక్కలు నాటడానికే ఈ జన్మ అని బలంగా భావించాడు. తనకు చెట్లు అంటే ఎందుకు అంత ఇష్టం అని ఎవరైనా అడిగితే అందుకు వంద కారణాలు ఉన్నాయంటాడు ఆయన. ఈ నాలుగు సందర్భాలు మాత్రం తరచూ అందరితో పంచుకునేవాడు.
మొక్కలను అల్లుకున్న రామయ్య నేపథ్యం పేదరికమే! రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమే!! భర్త సంకల్పం నెరవేర్చడంలో భార్య జానమ్మ ఇతోధికంగా సాయం చేసింది. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. బతుకు పోరులో కొడుకులు తండ్రి వారసత్వాన్ని అందుకోవడానికి ఆసక్తి చూపలేదు. కూతురు మాత్రం ఒకానొక సమయంలో తండ్రి నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ‘అప్పట్లో నాకో ప్రమాదం జరిగింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమయ్యా. ఇంటి దగ్గర నేను నాటిన మొక్కల ఆలనాపాలనా అంతా నా బిడ్డే చూసుకుంది. తర్వాత నేను నాటిన ఎన్నో మొక్కలు ఆనాడు నా కూతురు కాపాడిన చెట్ల నుంచి వచ్చినవే’ అని మురిసిపోతూ చెబుతుండేవాడు రామయ్య.
మొక్క నాటి ఒక సెల్ఫీ దిగే సెల్ఫిష్ కాదు రామయ్య. మన నాయకులు పొద్దున నాటే మొక్క సాయంత్రానికి మేకకు మేతగా మారిపోయే సందర్భాలు కోకొల్లలు. రామయ్య ఆ బాపతు కాదు. తను విత్తు విత్తాడంటే అది మొక్కయి, మానై, నూరు కొమ్మలతో విస్తరించాల్సిందే! మొక్క నాటగానే.. దాన్ని పశువులు తొక్కకుండా చుట్టూ రాళ్లు పెట్టేవాడు. ముళ్లకంప నాటేవాడు. పశువులు తినని మొక్కలనే రోడ్డుకు ఇరువైపులా పెంచేవాడు. కొండల్లో గుట్టల్లో రకరకాల విత్తనాలు వెదజల్లుతుండేవాడు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ఆలయ ప్రాంగణాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేవాడు. ఖమ్మం నగరం చుట్టూ ఉన్న గుట్టలు, కొండలపై విత్తనాలు చల్లడం రామయ్యకు రివాజుగా ఉండేది. వేసవి వచ్చిందంటే చాలు విత్తనాలు సేకరించడమే ఆయన పని. క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు పోగు చేసేవాడు.
విత్తన బంతులు చేసి.. తొలకరి కోసం వేచి చూసేవాడు. వానలు పడగానే.. పనిగట్టుకొని గుట్టలకు వెళ్లి వాటిని వెదజల్లేవాడు. ముత్తుగూడెం, పల్లెగూడెం సమీపంలో ఉన్న గుట్టల్లో క్వింటాళ్ల కొద్దీ విత్తనాలు చల్లాడు. పాండవుల గుట్టపై 70 ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలు నాటాడు. వందకుపైగా ఎర్రచందనం చెట్లు ఇప్పుడు అక్కడ నిటారుగా నిల్చొని రామయ్యకు సలాం చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. శేషాచలం అడవికే పరిమితమైన ఎర్ర చందనం చెట్లను తెలంగాణకు పరిచయం చేయాలనుకున్నాడు రామయ్య. ఇందుకోసం తిరుపతి వెళ్లి… విత్తనాలు సేకరించాడు. పది ఎర్ర చందనం మొక్కలు నాటితే బతికేది నాలుగే అని అక్కడ అధికారులు చెప్పారట. రామయ్యకు ఆ మాట రుచించలేదు. తను తెచ్చిన ప్రతి విత్తునూ మొలకింపజేసి.. చెట్టుగా ఎదిగేలా తోడ్పాటును అందించి ‘దటీజ్ రామయ్య’ అని నిరూపించుకున్నాడు.
రామయ్య దగ్గరికి వెళ్లి విత్తనాలు, మొక్కలు కావాలని ఎవరైనా అడిగితే.. అడిగిన దానికన్నా ఎక్కువ మొక్కలు, విత్తనాలు ఇచ్చేవాడు. ‘మొక్కలు నాటడం కాదు, వాటిని సంరక్షించాలి’ అంటుండేవాడు. ప్రతి పుట్టిన రోజుకు ఒక మొక్క కాదు… ఎన్నో పుట్టిన రోజు జరుపుకొంటే అన్ని మొక్కలూ నాటాలని విద్యార్థులకు చెబుతుండేవాడు. ఏ శుభకార్యానికి వెళ్లినా మొక్కలు, విత్తనాలు బహుమతిగా ప్రదానం చేసేవాడు.
వనానికి తరలి వచ్చిన వసంతంలా… రామయ్య కృషికి ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. మొక్కలు నాటడంలో ఐదు దశాబ్దాలుగా ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ‘యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రామయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో కేంద్ర మంత్రి సేవా పురస్కారం వరించింది. పలువురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2017లో పద్మశ్రీ పురస్కారం లభించింది. దీనిపై రామయ్య స్పందిస్తూ.. ‘ఈ పురస్కారం వల్ల.. మొక్కలు నాటితే ఇంతటి గుర్తింపు వస్తుందా అని ప్రపంచానికి తెలిసినట్టయింది. నాకు వచ్చిన గుర్తింపు పదిమందిలో మొక్కలు పెంచాలనే ఆసక్తి కలిగిస్తే అంతకన్నా గొప్ప తృప్తి మరొకటి ఉండదు’ అని పేర్కొనడం విశేషం.
ఇప్పుడు రామయ్య లేడు. ఆయన నాటిన మొక్కలు వృక్షాలై మరో రెండు తరాలు నిలిచే ఉంటాయి. అవి నేలకొరిగే లోగా.. సహజ సిద్ధంగా మరో వనాన్ని ఏర్పరుస్తాయి. ఇలా రామయ్య నాటిన వనాలు కలకాలం నిలిచే ఉంటాయి. ‘అశోకుడు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించెను’ అన్నచోట ‘రామయ్య ఘనమైన వనాలను పెంచెను’ అని చదువుకుంటామేమో! ఇప్పటికే పర్యావరణ పరిరక్షణపై అలుపెరుగని పోరాటం చేసిన రామయ్య కథ ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా పొందుపరిచారు. మహారాష్ట్రలోనూ రామయ్య పాఠం చెబుతున్నారు. ఈ వనజీవి పాఠం వినే విద్యార్థుల్లో ఒక్కరు స్ఫూర్తి పొందినా… మన ఘనజీవి లేని లోటు తీరిపోతుంది.
‘నా జేబులో ఇరవై రూపాయలు ఉంటే… రూ.5 భోజనం దొరికే చోట తింటాను. మిగిలిన డబ్బులతో రూ.11 పెట్టి ఓ రంగు డబ్బా కొంటాను. దానితో అట్టముక్కలపై ‘వృక్షో రక్షతి రక్షితః’ అని రాసి ఇతరులకు ఇస్తాను. ‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’, ‘నేటి మొక్కలే రేపటి చెట్లు’ ఇలా నాలుగు మంచి మాటలు పంచుకుంటూ హరిత హారాన్ని పెంపొందించడానికి అహరహం శ్రమిస్తూనే ఉంటాను.’
‘కరెన్సీపై మహాత్మాగాంధీ మొక్క నాటుతున్న ఫొటో ముద్రించాలి. అప్పుడు నోటు చూసిన ప్రతిసారీ ఒక స్ఫూర్తి కలుగుతుంది. మనమూ మొక్కలు నాటాలన్న స్పృహ ఏర్పడుతుంది. అలాగే రైళ్లకు సంజీవని, వనరక్ష, అరణ్య తదితర పర్యావరణహితమైన పేర్లు పెడితే.. పచ్చదనంపై ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది.’