ఒవేరియన్ (అండాశయ) క్యాన్సర్… స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో మూడో స్థానంలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ది మొదటి స్థానం కాగా రెండో స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఆక్రమించాయి. ఇక అండాశయ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. పైగా ఇది చాపకింద నీరులా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కాబట్టి, దీన్ని నిశ్శబ్ద హంతకిగా పేర్కొంటారు. ఈ క్యాన్సర్ మొదటి, రెండో దశల్లో స్వల్ప లక్షణాలు ఉండటంతో రోగులు వాటిని పెద్దగా పట్టించుకోరు. 60 నుంచి 70 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతనే వైద్యులను ఆశ్రయిస్తుంటారు. దీంతో చాలామంది ఈ వ్యాధికి గురై తమ ఆరోగ్యాన్ని మరణం అంచులకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
అండాశయాల్లో క్యాన్సర్ కణాలు అపరిమితంగా పెరిగిపోయి పక్కన ఉన్న కణజాలానికి, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని అండాశయ క్యాన్సర్ అంటారు. అండాశయాలు స్త్రీలలో గర్భాశయానికి రెండు వైపులా బాదం పప్పు పరిమాణంలో ఉంటాయి. ఇవి అండాల ఉత్పత్తితోపాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లే స్త్రీలలో నెలసరికి దోహదపడతాయి. ఇవి సక్రమంగా విడుదలైనంత కాలం సంతాన లేమి, ఇతర గైనిక్ సమస్యలు దరిచేరవు. ఇక స్త్రీలకు ప్రమాదకరంగా పరిణమించే అండాశయ క్యాన్సర్ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, ఇలా జరగడానికి కేవలం 5 నుంచి 10 శాతం అవకాశం మాత్రమే ఉంటుంది. మిగిలిన 90 శాతానికి కచ్చితమైన కారణాలను వివరించలేం.
రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లకు ఒకే జన్యువు కారణమవుతుంది. దాన్ని బ్రాకా జన్యువుగా పిలుస్తారు. ఈ జన్యువు ఉన్నవారిలో రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకని వంశంలో లేదా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ గానీ, అండాశయ క్యాన్సర్ గానీ ఉంటే ఆ కుటుంబసభ్యులకు ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం 5 నుంచి 10శాతం వరకు ఉండొచ్చు. బ్రాకా జన్యువులో బ్రాకా-1, బ్రాకా-2 అని రెండు రకాలు ఉంటాయి. బ్రాకా-1: ఇది రొమ్ము, అండాశయానికి సంబంధించింది. ఇది ఉన్నవారిలో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు అధికం. బ్రాకా-2: ఇది రొమ్ము, అండాశయంతోపాటు స్త్రీ, పురుషుల్లో పాంక్రియాటిక్ క్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్లకు కారణం అవుతుంది. కాబట్టి, కుటుంబ నేపథ్యం ఉన్నవారికి బ్రాకా పరీక్ష చేయించడం ఉత్తమం. ఈ పరీక్షలో బ్రాకా పాజిటివ్ వస్తే క్యాన్సర్ ముప్పు తగ్గించే సర్జరీలను ముందస్తుగా చేసి, రెండు అండాశయాలను తొలగించడం జరుగుతుంది.
అండాలు, స్త్రీ హార్మోన్లయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లను ఉత్పత్తి చేసే అండాశయాలలో అపరిమితంగా పెరిగే కణాల ఆధారంగా అండాశయ క్యాన్సర్ మూడు రకాలు. అవి:
1. ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్: 90శాతం వరకు వయసు పైబడిన స్త్రీలలో వస్తుంది.
2. జెర్మ్ సెల్ ఒవేరియన్ క్యాన్సర్: ఈ కణాలు అండాల నుంచి పుడతాయి. యుక్త వయసు అమ్మాయిలలో ఈ క్యాన్సర్ తలెత్తుతుంది.
3. స్ట్రోమల్ ఒవేరియన్ క్యాన్సర్: ఈ కణాలు అండాలలో హార్మోన్లు ఉత్పత్తి అయ్యే చోట తయారవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు చాలా ఎక్కువగా, దీర్ఘకాలికంగా విడుదలవుతూ ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ 3వ స్థానంలో ఉంది. పైన పేర్కొన్న 3 రకాలే కాకుండా ఇంకా ఉప రకాలు ఉంటాయి. స్త్రీలలో 50ఏళ్లు పైబడిన తర్వాత ఎక్కువగా కనిపించే అండాశయ క్యాన్సర్‌ను నిశ్శబ్ద హంతకిగా పేర్కొనవచ్చు. లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి కాబట్టి వ్యాధి ముదిరిన తర్వాతే రోగులు డాక్టర్లను సంప్రదిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే… అండాశయాలు పొత్తికడుపులో చాలా లోపలికి ఉంటాయి. కాబట్టి లక్షణాలు చాలా ఆలస్యంగా వెలుగుచూస్తాయి. అంతేకాకుండా అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించే అవకాశం ఉంటుంది. తొలిదశలో ఈ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సులువు కాదు. అండాశయ క్యాన్సర్‌గా అనుమానించడానికి కొన్ని లక్షణాలు బయటపడవచ్చు.
ముందస్తు పరీక్షల్లో బ్రాకా పాజిటివ్ రావడంతో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి ముందుజాగ్రత్తగా తన రెండు రొమ్ములు తొలగించుకుని రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
అనుమానిత లక్షణాలు ఉంటే అల్ట్రా సౌండ్‌లో సీఏ-125 మార్కర్ పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు రక్త పరీక్షలు, పాప్ టెస్ట్ తదితర పరీక్షలతోపాటు సీటీ-స్కాన్, ఎంఆర్ఐ వంటివి కూడా అవసరమవుతాయి. రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే బ్రాకా జీన్ మ్యుటేషన్లో తేడాలు ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ పరీక్షలు 25 ఏళ్ల వయసు నుంచి చేయించుకోవడం ఉత్తమం. మెనోపాజ్ దశకు ముందు నుంచే ఈస్ట్రోజన్ హార్మోన్‌ను మాత్రమే 5 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరగవచ్చు. ప్రొజెస్టిరాన్ హార్మోన్ కాంబినేషన్లో ఈస్ట్రోజన్ తీసుకుంటే ఆ ముప్పు కొంతవరకు తగ్గేందుకు ఆస్కారం ఉంది. అన్ని క్యాన్సర్లలో లాగే అండాశయ క్యాన్సర్‌లోనూ 4 దశలు ఉంటాయి.
1వ దశ: వ్యాధి ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితమవుతుంది
2వ దశ: గర్భాశయానికి వ్యాప్తి చెందుతుంది.
3వ దశ: అండాశయాలు, గర్భాశయంతోపాటు లింఫ్ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాపిస్తుంది.
4వ దశ: పైవాటితోపాటు శరీరంలో ఇతర అవయవాలకు సోకుతుంది.
వ్యాధి దశల ఆధారంగా సర్జరీ చేయడం, థెరపీలు వంటి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. థెరపీలు ఎంతకాలం ఇవ్వాలో కూడా వ్యాధి ఉన్న దశపైనే ఆధారపడి ఉంటుంది. కుటుంబ నేపథ్యం ఉండి, బ్రాకా పాజిటివ్ వచ్చిన వారు పిల్లలు పుట్టిన తర్వాత ముందుజాగ్రత్తగా అండాశయాలను తొలగించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ జరిగితే సర్జరీ, హైపెక్ కీమో థెరపీ చేస్తారు. హైపెక్ అనేది అత్యాధునిక చికిత్సా విధానం. ఇందులో సర్జరీ పూర్తయిన వెంటనే 41- 43 డిగ్రీల ఉష్ణోగ్రతతో కీమో ఇస్తారు. ఈ అండాశయ క్యాన్సర్ చికిత్స తర్వాత మళ్లీ 40 శాతం మందిలో తిరగబెట్టేందుకు ఆస్కారం ఉంది. అప్పుడు కూడా కీమో థెరపీతోనే చికిత్స అందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రదేశంలోనే ఆలస్యంగా వస్తే రెండోసారి కూడా సర్జరీ చేయవచ్చు. మనోబలంతో ఉంటే మంచి ఫలితాలు, మెరుగైన జీవితాన్ని పొందడం సాధ్యమే.