OTT Platform ‘అమ్మో! రెండున్నర గంటలా!’ సినిమాలపై ఓటీటీ ప్రేక్షకుడి ఆశ్చర్యం. ‘ఎనిమిదేసి ఎపిసోడ్లు ఎవరు చూస్తారు?’ ఈ మధ్యకాలంలో పరిచయమై, అలరించిన వెబ్‌సిరీస్‌లపై అప్పుడే మొహం మొత్తేసింది. కొత్తగా కావాలి, కొంగొత్తగా ఉండాలి.. ఇలా మొదలవ్వాలి, అలా అయిపోవాలి! అలాంటి వాటికే తన ఓటు అంటున్నాడు ఓటీటీ ప్రేక్షకుడు. ఫోర్జీ స్ట్రీమింగ్ కన్నా వేగంగా మారిపోతున్న సగటు సబ్స్ర్కైబర్ను ఒడిసిపట్టుకోవడానికి ఓటీటీ నిర్వాహకులు ఎంచుకున్న మార్గమే యాంథాలజీ సిరీస్‌లు. షార్ట్‌ఫిల్మ్ కు కాస్త ఎక్కువ, ఫీచర్ఫిల్మ్కు చాలా తక్కువ నిడివితో రూపొందుతున్న దృశ్య సంకలనాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.
ఓ కూతురు ఇంట్లోంచి వెళ్లిపోతుంది. కొన్నేండ్లకు తల్లి ఆ కూతురు ఇంటి తలుపు తడుతుంది. ఆ ఇంట్లో ఇద్దరి గదుల మధ్యా కొలిచేంత దూరం ఉంటే.. ఇద్దరి అభిప్రాయాల మధ్య కొలవలేనంత వ్యత్యాసం. ఒకరిది పరామర్శ, మరొకరిది విమర్శ. చివరికి ఈ ఇద్దరి మధ్యా కుదిరిన సయోధ్య. అంతే శుభం కార్డు! ఈ చిట్టికథను గట్టిగుండెను కూడా తట్టి లేపేంత గొప్పగా తీర్చిదిద్దాడు దర్శకుడు నాగేశ్ కుకునూర్. ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ యాంథాలజీ సిరీస్‌లో ‘మై అన్లైక్లీ పాండెమిక్ పార్ట్నర్’ కథ గురించే ఇదంతా! ఇందులోనే మరో ఐదు కథలు కూడా ఉన్నాయి. ప్రతిదీ ఆలోచింపజేసేదే! అలరించేదే! ఆసక్తి కలిగించేదే!!
పుస్తక పఠనంపై అంతంతే ఆసక్తి ఉన్నవారి చేతికి భారీ నవలను ఇస్తే ఏం లాభం? గంటల తరబడి పుస్తకాన్ని చదివే ఓపిక లేక, దానిని అటకెక్కిస్తారు. అదే, ఓ కథల సంకలనాన్ని అందించి చూడండి. ఓ సాయంత్రం ఆ వ్యక్తి కండ్లు పుస్తకంపై పడితే.. ఆ పూటకు ఒక కథైనా చదువుతాడు. ఆసక్తిగా ఉంటే మరో కథ చదువుతాడు. మరింత మజా వస్తే.. మూడో కథా చదివి, మిగిలిన కథలు ఇంకెప్పుడైనా చదవాలని ఫిక్సవుతాడు. అడపాదడపా ఆ సంకలనాన్ని అందుకుని ఒకటీ, అరా చదువుతూ మొత్తానికి పుస్తకం పూర్తయింది అనిపిస్తాడు. ప్రేక్షకులను కట్టిపారేయడానికి, స్ట్రీమింగ్ సమయం పెంచడానికి ఇదే అనువైన సూత్రంగా ఎంచుకుంటున్నాయి ఓటీటీ యాజమాన్యాలు. అందమైన కథలను గుదిగుచ్చి అపురూపమైన సంకలనంగా తీర్చిదిద్ది ఓటీటీ వేదికపై విడుదల చేస్తున్నారు.
వెబ్‌సిరీస్ అని మనం పిలుచుకుంటున్నా.. ఇందులో ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకమైనది. ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండదు. ఏ కథా వస్తువు దానిదే, దేని కథనం దానికే! కానీ, అన్ని కథల్లోనూ అంతర్లీనంగా ఓ అదృశ్య కోణం దాగి ఉంటుంది. అలాంటి కథలతో రూపొందిన యాంథాలజీ సిరీస్ ‘పావ కదైగల్’- చెడ్డ కథలు. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ ప్రియులను కట్టిపడేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్‌లో కొనసాగింది. ఈ సిరీస్‌లోని పరువు హత్య నేపథ్యంలో సాగే ‘ఆ రాత్రి’ విస్మయులను చేసింది. అందులోని మిగతా మూడు కథలూ విభిన్న నేపథ్యం ఉన్నవే!
బహుముఖ ప్రయోజనాలు ఉండటం వల్లే యాంథాలజీ సిరీస్‌లు నిర్మిస్తున్నామని చెబుతున్నారు ఓటీటీ నిర్వాహకులు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లతో వస్తున్న యువ రచయితలు, దర్శకులను ప్రోత్సహిస్తూనే.. ఇలాంటి విభిన్నమైన కంటెంట్‌ను ఓటీటీకి ఎక్కిస్తున్నారు. పాత్రలు తక్కువగా ఉండటంతో పారితోషికాల సమస్య రాదు. నిడివి నలభై నిమిషాల నుంచి గంటలోపే ఉంటుంది. భారీ సెట్టింగులు, వ్యవహారాలూ ఉండవు. ఫలితంగా బడ్జెట్ గాడి తప్పే పరిస్థితీ ఉండదు. వీటన్నిటికీ మించి ఈ తరహా సిరీస్‌లు అన్నీ థీమ్ బేస్డ్‌గానే రూపొందుతున్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘నవరస’ యాంథాలజీ సిరీస్ విడుదలకు ముందు పెద్ద సంచలనమే సృష్టించింది. సూర్య, అరవిందస్వామి, ప్రకాశ్‌రాజ్ వంటి హేమాహేమీలు ఇందులో భాగమయ్యారు. వీక్షకులు నవరస థీమ్‌ను అర్థం చేసుకోలేక పోవడంతో ఈ సిరీస్ అంతగా ఆదరణ పొందలేదు.
ఇలాంటి సంకలన నేపథ్యంలో వచ్చిన పలు సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి ‘పిట్టకథలు’. నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకులు తరుణ్‌భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి రూపొందించిన నాలుగు కథలు హిట్‌టాక్ సొంతం చేసుకున్నాయి. ఆహాలో ‘మెట్రోకథలు’ కూడా ఆహా అనిపించాయి. ఇక హిందీలోకి తొంగిచూస్తే, ‘కాలీ పీలీ టేల్స్’, ‘అజీబ్ దాస్తాన్’, ‘అన్పాస్డ్’, ‘రే’ తదితర సిరీస్‌లన్నీ యాంథాలజీ కేటగిరీలోనే విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. వీటికి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ ఒరవడి మూడు సిరీస్‌లు, ఆరు కథలుగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. సూటిదనం, సున్నితత్వం, కొత్తదైన వ్యక్తీకరణ.. సంకలనాలకు ప్రాణం. నవతరం ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే.
వెండితెర మీదా.. సినిమాల్లోనూ యాంథాలజీ ఫార్ములాను ఎంచుకుంటున్నారు దర్శకులు. సమాంతరంగా మూడు, నాలుగు కథలు నడిపిస్తూ, ఒక దానితో ఒకటి సంబంధం లేనట్టుగానే చూపిస్తూ.. చివరికి ఓ మెలికతో అందమైన మలుపుతిప్పి విజయాలు సాధించారు. అనామక సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఈ కోవకే చెందిన సినిమా. 2010లో క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘వేదం’ కూడా దాదాపుగా యాంథాలజీ పంథాలోనే సాగుతుంది. 2014లో వచ్చిన ‘చందమామ కథలు’, 2016లో విడుదలైన ‘మనమంతా’, 2018లో రిలీజైన ‘ఆ’ చిత్రాలు సంకలన కథలతో రూపొందినవే. 2019లో విడుదలైన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ ఇలాంటి థీమ్‌తో రూపొంది సంచలనం సృష్టించింది.
మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు.. ఆ ఒకే ఒక్క ఛాన్స్ వీళ్లు ఇప్పిస్తారు.. !!”