ఒకప్పుడు హనీమూన్ అంటే.. ఊటీ, కొడైకెనాల్ వైపు చూసేవారు. లేకుంటే.. షిమ్లా, కులూ-మనాలి దాకా వెళ్లొచ్చేవారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు.. యూరప్, స్విస్‌కు ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకునేవారు. కానీ, నవతరం జెన్-జెడ్ దంపతులు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తున్నారు. పాతకాలం వారిలా కాకుండా.. హనీమూన్ విషయంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. హనీమూన్ అంటే.. సరదాగా గడపడానికి కాదనీ, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికేనని చెబుతున్నారు. ఇందుకోసం యూరప్, అమెరికాలను కాదని.. దుబాయ్, వియత్నాం, బాలి లాంటి దేశాలకు ప్రయాణాలు కడుతున్నారు. అదే సమయంలో.. బడ్జెట్లోనే హనీమూన్‌కు వెళ్లొస్తున్నారు.
పిక్యువర్ ట్రెయిల్ సంస్థ.. తాజాగా, జెన్-జెడ్ దంపతుల హనీమూన్ ప్రయాణాలపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. తాము విలాసాల కోసం హనీమూన్‌కు వెళ్లడంలేదని నవతరం దంపతుల్లోని 62 శాతం మంది చెప్పుకొచ్చారు. వీరంతా వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి విహార యాత్రలను ఎంచుకుంటున్నారు. విలాసవంతమైన ప్రయాణాలకు దూరంగా సంస్కృతులు, బంధాలకు పెద్దపీట వేస్తున్నారు. గమ్యస్థానాలను ఎంచుకోవడం గురించి కాకుండా.. హనీమూన్‌ను చిరస్మరణీయ యాత్రగా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరో 38 శాతం మిలీనియల్స్.. సౌకర్యాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఖరీదైన హాట్స్పాట్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. విలువలు నేర్పించే గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దగ్గరగా అనిపించే చిన్నచిన్న విహారయాత్రలను ప్లాన్ చేస్తున్నారు.
2025 నుంచి భారత్‌నుంచి హనీమూన్‌కు వెళ్లిన వారిలో ఎక్కువగా వియత్నాం, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్లినట్లు సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో మాల్దీవులు, బాలి, థాయిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ లిస్ట్‌లో యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉండేవి. కానీ, ఇప్పుడు ఆసియా దేశాల వైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్నిటికీ మించి విభిన్న సంస్కృతులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వాగతం పలుకుతున్న వియత్నాంకు మొదటి ఓటు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక దుబాయ్‌లో రూఫ్‌టాప్ డిన్నర్లు, ఎడారి సఫారీలు హనీమూన్ జంటలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ఇక హనీమూన్ అనగానే.. అదేదో ధనవంతులకే సొంతమనే అపోహను చెరిపేస్తున్నారు. మధ్యతరగతి జంటలు కూడా హనీమూన్ బాట పడుతున్నారు. అదే సమయంలో బడ్జెట్‌కూ పెద్దపీట వేస్తున్నారు. కేవలం 1-2 లక్షల్లోనే హనీమూన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. ఇందుకోసం దుబారా ఖర్చులను తగ్గిస్తున్నారు. ‘హనీమూన్’ అంటే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం కాదనీ, విలాసవంతమైన రిసార్ట్స్‌లో బస చేయడం కూడా కాదనీ చెబుతున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవుతూ.. విహార యాత్రలను చిరస్మరణీయంగా మలుచుకుంటున్నారు. ఒకరితో మరొకరు మరింత లోతుగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.