పసిబిడ్డకు హఠాత్తుగా జ్వరం. ఒమిక్రాన్ కావచ్చన్న అనుమానం. ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికి తీసుకెళ్లాలి? తక్షణం ఏ మందులు వాడాలి? ఇలాంటి సమయాల్లో గ్రూప్‌లోని సభ్యుల అభ్యర్థనలకు స్పందిస్తూ మనసున్న డాక్టరమ్మగా పేరు తెచ్చుకున్నారు పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ మాధవి.
‘ఆమె పేరు విద్య. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన కూతురికి తీవ్ర జ్వరం వచ్చింది. ఆ సమయంలో దవాఖానకు వెళ్లే పరిస్థితి లేదు. దగ్గరలో ఉన్న మెడికల్ హాల్‌కు వెళ్లి లక్షణాలు వివరించి, మందులు ఇవ్వమని అడిగింది. కానీ వాళ్లు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తామని చెప్పారు. పసిబిడ్డ కాబట్టి డాక్టర్ సిఫారసు లేకుండా మందులు వాడటం మంచిది కాదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియలేదు ఆమెకు. స్నేహితురాలికి ఫోన్ చేసింది. అంతే, ఐదంటే ఐదు నిమిషాల్లో సరైన ప్రిస్క్రిప్షన్ వచ్చింది’
“రెండేండ్ల చిన్నారి మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. తెలిసిన మందులు వాడుతూ సొంత వైద్యం చేస్తున్నారు తల్లిదండ్రులు. నాలుగో రోజు జ్వరం 103 దాటింది. దీంతో ఆందోళనకు గురయ్యారు. ఓ గ్రూప్‌లో తమ కూతురి పరిస్థితిని వివరిస్తూ పోస్టు చేశారు. నాలుగు నిమిషాల్లోనే డాక్టరమ్మ అందుబాటులోకి వచ్చింది. వాడాల్సిన మందుల జాబితా ఇచ్చింది. కొవిడ్ పరీక్షను సూచించింది. రెండు గంటలలోపే జ్వరం నెమ్మదించింది. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, మరుసటి రోజు చిన్నారికి కొవిడ్ పరీక్ష చేయించారు. నెగెటివ్ వచ్చింది. డాక్టర్ రాసిన మందులనే వాడటంతో జ్వరం నుంచి పూర్తిగా కోలుకుంది ఆ పాప.”
..ఇలాంటి అనేక కేసులలో తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, ప్రిస్క్రిప్షన్ పంపిన ఆ డాక్టర్ పేరు బి. మాధవి. కరోనా నేపథ్యంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 24 గంటలూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ.. సలహాలు సూచనలు అందిస్తున్నారు. నగరంలోని ఓ హాస్పిటల్లో పిల్లల వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారామె. ఓ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఆన్లైన్లో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వచ్చే ప్రతి సమస్యకూ స్పందిస్తున్నారు. తల్లిదండ్రులకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎలాంటి ఫీజూ ఆశించకుండా తన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో ‘హెల్త్ అడ్వైసెస్ ఫర్ కిడ్స్’ పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు మాధవి. సుమారు 400 మంది వరకు సభ్యులు ఉన్నారు. తమ పిల్లలు, స్నేహితుల పిల్లలు.. ఇలా ఏ సమస్యనైనా అందులో పోస్ట్ చేస్తూ ఉంటారంతా.
కన్నవారికి భరోసా..
ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్‌లతో చాలా మంది భయానికి గురవుతున్నారు. ముఖ్యంగా, ఇంట్లో చిన్నారులు ఉన్నవారు మరింత కంగారుపడుతున్నారు. అలాంటివారికి డాక్టర్ మాధవి అండగా నిలుస్తున్నారు. రోగ లక్షణాలు చెబితే, వాటి ఆధారంగా పరిష్కారం చెబుతున్నారు. క్లినిక్ బాధ్యతలు ముగించుకుని ఇంటికి వచ్చాక కూడా తన సేవలను ఆన్లైన్లో అందిస్తున్నారు. ‘ప్రతి మెసేజ్నాకు విలువైనదే’ అంటారు డాక్టర్ మాధవి. సామాజిక మాధ్యమం టెలిగ్రామ్‌లో healthadvices4kids ద్వారా తనను సంప్రదించవచ్చని చెబుతారీ ఆన్లైన్ డాక్టరమ్మ.