నోటి మాట కన్నా.. ఒక టెక్ట్స్ మెసేజ్‌కే విలువ ఎక్కువ! అనిపిస్తుంది. నేటి డిజిటల్ లైఫ్‌లో కమ్యూనికేషన్ అంతా సందేశాల చుట్టూ తిరుగుతున్నది. ముఖ్యంగా మొబైల్ మాధ్యమంగా సాగే సందేశాల పరంపరలో ఎన్నో కార్యాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి.
అందుకే వాట్సాప్‌లోనే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో బిల్ట్ ఇన్‌గా ఉండే ‘మెసేజెస్’ నుంచి కూడా సందేశాలు పంపుతుంటాం. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడో, వాట్సాప్ చూస్తారో లేదో అన్న సందేహం వచ్చినప్పుడో ‘మెసేజెస్’ ఎంచుకుంటాం. ఈ నేపథ్యంలోనే గూగుల్ ‘మెసేజెస్’లో కొత్త అప్డేట్ని తీసుకొచ్చింది. అదే ‘సెర్చ్ ఫర్ గ్రూప్ చాట్స్’.
అంటే.. ఒకే మెసేజ్‌ను ఎక్కువమందికి పంపేందుకు ‘స్టార్ట్ చాట్’లోని ‘క్రియేట్ గ్రూప్’ని వాడుతున్నాం. అంటే.. ఫ్యామిలీ ఒక గ్రూప్, ఫ్రెండ్స్ ఇంకొకటి.. ఇలా పలురకాల గ్రూపులు ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు టైప్ చేసిన మెసేజ్ ఏ గ్రూపులో పంపాలో సులభంగా తెలుసుకునేందుకు ఓ అప్డేట్ వచ్చింది. దీంతో గతంలో మీరు పంపిన ‘గ్రూప్ చాట్స్’ అన్నీ లిస్ట్‌లో కనిపిస్తాయి.
అలా మీ మెసేజ్ ఏ గ్రూపులో పంపాలనేది ఇట్టే సెలెక్ట్ చేసుకోవచ్చు. పదేపదే కాంటాక్ట్‌లను సెలెక్ట్ చేసుకుని గ్రూప్చాట్లో మెసేజ్‌లు పంపనవసరం లేదన్నమాట. గూగుల్ మెసేజెస్‌లోని ఈ సరికొత్త ఫీచర్లను వాడేందుకు యాప్‌ని ప్లే స్టోర్ నుంచి కొత్త వెర్షన్‌కి అప్డేట్ చేసుకుంటే సరి.