e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ అనాథగా పెరిగిన చోటే.. ఆఫీసరమ్మ!

అనాథగా పెరిగిన చోటే.. ఆఫీసరమ్మ!

అనాథగా పెరిగిన చోటే.. ఆఫీసరమ్మ!

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగింది. ఆ నీడలోనే చదువుకొన్నది. పట్టాలు సాధించింది. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసింది. తొలిరోజున బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టిన ఆశ్రమంలో ఇప్పుడామె బాధ్యతాయుత అధికారి. రెండొందల మందికి అమ్మ.. ఆఫీసరమ్మ. గొల్లపల్లి కిషన్‌ సంతోషిబాయి (జీకే సంతోషి) జీవితం నిండా కష్టాలే. అయినా, ఆమె కుమిలిపోలేదు. ఓటమిని అంగీకరించలేదు. అక్షరాలే ఆసరాగా జీవితాన్ని నిర్మించుకున్నది. పరీక్షలో ఫెయిల్‌ అయ్యామనో, ఉద్యోగం రాలేదనో, ప్రేమ విఫలమైందనో జీవితాల్ని చాలించాలని అనుకునే వారంతా ఒక్కసారి సంతోషి కథ చదవాలి. దుఃఖం నుంచి సంతోషం వైపుగా సాగిన ఆమె ప్రయాణాన్ని తెలుసుకోవాలి. ఓడిన వాళ్లకు ఇదో గెలుపు పాఠం.గెలిచిన వాళ్లకు ఇదో పునశ్చరణ.

మేం పుట్టకముందే అమ్మానాన్న చెన్నైనుంచి బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. నాన్న కిషన్‌. అమ్మ లలిత. మేం పదకొండు మందిమి సంతానం. నేను ఎనిమిదోదాన్ని. ఏడుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెండ్లం. నాన్న హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో చెప్పులు కుట్టేవారు. కొంతకాలానికి రెక్కల కష్టంతో బేగంబజార్‌లో దుకాణం పెట్టుకున్నారు. కార్మికుడి నుంచి యజమానిగా ఎదిగారు. ఆయన దగ్గర నలుగురు ఉద్యోగులు ఉండేవారు. కొంతకాలం అంతా సాఫీగా సాగింది. అనుకోకుండా ఇంట్లో పంపింగ్‌ స్టౌ పేలి అమ్మ చనిపోయింది. అప్పటికే ముగ్గురన్నలు, అక్కలకు పెండ్లిళ్లు అయ్యాయి. ఈ సంఘటన తర్వాత, ఇక్కడ ఉండలేక వాళ్లు చెన్నై వెళ్లిపోయారు. అప్పుడే మార్కెట్‌ పడిపోయింది. ప్రపంచీకరణ ప్రభావమో, మరో ఉత్పాతమో కూడా తెలియనంత చిన్నతనం నాది. మొత్తానికి, నాన్న అప్పుల పాలయ్యాడు. అన్నిటికీ మించి అమ్మ చనిపోవటం ఆయనను కుంగదీసింది. రెండేండ్లలోపే నాన్నకు గుండెపోటు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు నిలబడలేదు. వలస కుటుంబం కావడంతో మాకు బంధువులెవరూ లేరిక్కడ. దూరపు చుట్టాలున్నా చేయూత ఇవ్వలేదు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. చెన్నైనుంచి అన్నలొచ్చి మా చిన్న తమ్ముడిని తీసుకెళ్లారు, వాళ్లింట్లో పనికోసం. ఇక మిగిలింది చెల్లె, పెద్ద తమ్ముడు, నేను. మా ముగ్గురినీ ఇరుగు పొరుగువారు హాస్టల్‌లో వేశారు.

అప్పుడు నాకు 12 ఏండ్లు. మహేంద్రాహిల్స్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో నా కొత్త జీవితం ప్రారంభమైంది. కొన్ని రోజులకు తమ్ముడు హాస్టల్‌నుంచి పారిపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. ఎలా ఉన్నాడో తెలియదు. అసలున్నాడో లేదోకూడా తెలియదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఒంటరిగా ఓ మూలన కూర్చుని ఏడ్చేదాన్ని. మూడేండ్ల తర్వాత ఒక సోషల్‌ వర్కర్‌ మా తమ్ముడిని పట్టుకొచ్చింది. వాడిని చూడగానే పట్టరాని సంతోషం. తమ్ముడు కొద్దిరోజులు చైల్డ్‌లైన్‌లో వర్క్‌ చేసిండు. మళ్లీ సమాచారం లేదు. ఇంకోసారి వెతుకులాట. అయినా, ఆచూకీ దొరకలేదు. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఎవరో ‘మీ తమ్ముడు విశాఖపట్నంలో ఉన్నాడు’ అని చెప్పారు. వెతుక్కుంటూ వెళ్లాను. మా చెల్లె బావుంటుంది. ‘నేను సినిమా యాక్టర్‌ అవుతా’ అనేది. చదువు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది. తరువాత పెండ్లి చేసుకున్నది. మా అన్నలు తీసుకెళ్లిన తమ్ముడు కూడా అక్కడి నుంచి వచ్చేశాడు. విశాఖపట్నం, చెన్నైలనుంచి వచ్చిన తమ్ముళ్లు గుంటూరులో అంబులెన్స్‌ డ్రైవర్లుగా చేస్తున్నారు. అక్కడే మా చెల్లె ఉన్నది. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? వాళ్లంతా ఏం చేస్తున్నారు? అనేది నేను డిగ్రీ పూర్తి చేశాక కానీ తెలియలేదు.

ఏడో తరగతినుంచి ఇంటర్‌వరకూ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టలే నా అమ్మ, నాన్న, బంధువులు. నన్ను టీచర్లు, వార్డెన్స్‌ బాగా ప్రోత్సహించారు. ‘ఎవరూ లేరని దిగులు వద్దు. బాగా చదువుకోవాలి. సమాజంలో మనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలి’ అని చెప్పేవారు. ఆ మాటలు బాగా ప్రభావితం చేశాయి. ఇంటర్‌ కాగానే సికింద్రాబాద్‌లోని ఎస్వీ కాలేజీలో డిగ్రీ చేశాను. అక్కడా హాస్టలే. ముషీరాబాద్‌ ఎస్సీ హాస్టల్‌లో ఉండేదాన్ని. డిగ్రీ అయ్యాక, రెయిన్‌బో హోమ్‌లో ఉద్యోగంలో చేరాను. గవర్నమెంట్‌ హాస్టల్‌లో ఉంటూనే జాబ్‌ చేసేదాన్ని. తరువాత ‘అమన్‌ వేదిక’ అనే ఎన్జీవోలో చేరాను. సోషల్‌ వర్క్‌ అంటే నాకు గౌరవం. ఆ ఇష్టంతో పదేండ్లు అక్కడే టీచర్‌గా, అకౌంటెంట్‌గా, మేనేజర్‌గా చేశాను. ఎలాగూ ఎన్జీవోలో చేస్తున్నా కదా, పీజీ ఎందుకు చేయకూడదని అనుకున్నా. సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌) చేశాను. అప్పుడే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. గ్రూప్స్‌ రాశాను. 2013లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎంపికయ్యాను. మొదటి పోస్టింగ్‌ నల్గొండలో. తరువాత సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక ప్రాంతాల్లో పనిచేశాను. ప్రస్తుతం సీడీపీవో హోదాలో ఉన్నాను. డిపార్ట్‌మెంట్‌లో నా గురించి తెలిసిన కొద్దిమంది మా కమిషనర్‌ (దివ్యా దేవరాజన్‌) గారికి చెప్పారు. మేడమ్‌ నన్ను పిలిచి ‘నీ గురించి తెలిసింది. నువ్వు ఇక్కడే (శిశువిహార్‌లో) పనిచేయాలి. ఇక్కడ పనిచేయాలంటే మనసుతో చేయాలి. మిగతా వాళ్లకన్నా ఇక్కడుండే పిల్లలకు నువ్వే కరెక్ట్‌’ అంటూ నాకిక్కడ పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక్కడ రెండొందలమంది పిల్లలున్నారు. ఇద్దరం ఇన్‌చార్జ్‌లం. నేనూ, ఇంకో మేడమ్‌. నాతో పీజీ చేసిన ప్రమోద్‌తో త్వరలో పెండ్లి జరుగనున్నది. వాళ్లది దేశాయిపేట (వరంగల్‌). తనిప్పుడు లెక్చరర్‌. ఇంట్లోవాళ్లకు నా జీవితం గురించి మొత్తం చెప్పాడు. వాళ్లూ ఒప్పుకొన్నారు. ఇకనుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఓ కుటుంబం అంటూ ఏర్పడుతుంది. అయినా సరే, నన్ను పెంచి పెద్దచేసిన జగమంత కుటుంబాన్ని మరచిపోను.

కన్నబిడ్డల్లా చూసుకొనే ప్రభుత్వం!

విధిరాతవల్ల వీధిన పడిన ఎంతో మందిని ప్రభుత్వం అక్కున చేర్చుకుంటున్నది. విద్యాబుద్ధులు చెప్పిస్తున్నది. సమాజం కూడా ఆదరిస్తున్నది. అటువంటప్పుడు మేము అనాథలం ఎట్లా అవుతాం? నా చిన్నతనంలో పన్నెండేళ్లు మినహాయిస్తే మొత్తం హాస్టల్స్‌లోనే సాగింది. అప్పట్లో హాస్టల్స్‌ పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఉద్యోగిగా చెప్పటం లేదు. ఒక ఆశ్రమ జీవిగా చెబుతున్నా. తెలంగాణ వచ్చాక అసాధారణమైన మార్పులు చోటుచేసుకొన్నాయి. కన్నబిడ్డల్లా చూసుకునే ప్రభుత్వం వచ్చింది. సౌకర్యాలు మెరుగయ్యాయి. నాణ్యమైన వస్తువులు, రుచికరమైన భోజనం, మెరుగైన వైద్యం అందుతున్నాయి. మా పిల్లలకోసం సొంత అంబులెన్స్‌ (శిశువిహార్‌ ముందే ఉన్న అంబులెన్స్‌ను చూపిస్తూ) ఉంది. కేసీఆర్‌ సర్కారు ఇటీవలే అనాథలకు, నిరాశ్రయులకు మూడు శాతం రిజర్వేషన్‌ కల్పించింది. శిశువిహార్‌లో ప్రతి బిడ్డా ఏ లోటూ లేకుండా ఆత్మవిశ్వాసంతో పెరుగుతున్నది.

… నూర శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనాథగా పెరిగిన చోటే.. ఆఫీసరమ్మ!

ట్రెండింగ్‌

Advertisement