OpenAI | ఇప్పుడన్నీ ఏఐ ముచ్చట్లే. ఏం కావాలన్నా.. ఓ కమాండ్ ఇస్తే చాలు. ఏఐ కావాల్సిన కంటెంట్ ఇచ్చేస్తుంది. తాజాగా ఈ OpenAI సరికొత్త ప్లాట్ ఫామ్‌ని తీసుకొచ్చింది. అదే Sora Turbo అనే కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో జనరేటర్. ఇప్పుడిది టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నది. ఈ అధునాతన టూల్‌కి కొన్ని పదాల్ని ఇన్పుట్ ఇస్తే చాలు. అద్భుతమైన వీడియోలను సృష్టిస్తుంది. మీరు ఊహించే దేన్నయినా మోషన్ పిక్చర్ రూపంలో పొందొచ్చు.
ఏదైనా కథలోని వాక్యాల్ని కమాండ్స్‌గా ఇచ్చినా.. దానికి తగ్గ విజువల్స్ క్షణాల్లో మన కండ్ల ముందు ఉంచుతుంది. ఇది కేవలం కమాండ్స్‌ను వీడియోగా మార్చడమే కాదు.. ఇన్‌పుట్స్‌గా ఫొటోలు, వీడియో క్లిప్స్ పంపినా, కొత్త వీడియోలు పుట్టించగలదు. ఈ టూల్‌ను ఉపయోగించడం చాలా సులభం. ప్రస్తుతం, ChatGPT Plus, Pro వినియోగదారులు sora.com వెబ్సైట్ ద్వారా ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఉపయోగించి కార్టూన్లు, యానిమేషన్లు, షార్ట్‌ఫిల్మ్స్ కూడా సృష్టించొచ్చు.