శ్రీరాముడి భక్తులలో హనుమంతుడిని మించినవారు లేరు. ఆంజనేయుడిలా రాముణ్ని కొలిచేవారు కానరారు. కానీ, మనదేశంలోని ఓ గిరిజన తెగవాసులు మాత్రం.. నిత్యం రామనామ స్మరణలోనే మునిగి తేలుతుంటారు. శ్రీరాముడిపై భక్తిని చూపడంలో అభినవ హనుమంతులుగా పేరు తెచ్చుకుంటున్నారు. వారే.. ఛత్తీస్‌గఢ్‌లోని రామ-నామి గిరిజనులు.
మహానది పరివాహక ప్రాంతంలో ఉండే రామ-నామి తెగవాసులు.. శ్రీరాముడి భక్తులు. ఎంతలా అంటే.. వారి శరీరమంతటా ‘రామ’ నామం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. పూర్వకాలంలో ఈ తెగవారిని రాముడి ఆలయంలోకి అనుమతించలేదట. దాంతో ఆ తెగ పెద్ద తన శరీరంపై రాముడి పేరును పచ్చబొట్టుగా వేసుకొని.. తమ నుంచి శ్రీరాముణ్ని వేరు చేయలేరని చెప్పాడట.
అప్పటి నుంచి ఆ తెగవాసులు ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారు. రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడమే కాదు.. నిత్యం రామ నామాన్ని జపిస్తారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటారు. ‘రామ్’ అని ముద్రించిన శాలువాలు, నెమలి ఈకలతో చేసిన తలపాగా ధరిస్తారు. తమ జీవితంలోని ప్రతి పనినీ, ప్రతి శుభకార్యాన్నీ ‘రామ’ నామంతోనే మొదలుపెడతారు.