పదిహేనేండ్ల వయసుకు ఎవరైనా ఏం చేస్తారు? బడిలో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మహా అయితే ఆట కోసమో, పాట కోసమో ప్రత్యేక తరగతులకు వెళతారు. కానీ, గుజరాత్ రాష్ట్రం వడోదరకు చెందిన నిశిత రాజ్పుత్ మాత్రం అంతకుమించి ఆలోచించింది. తనలాంటి ఆడపిల్లలకు మంచి చదువును అందించాలనుకుంది. ఆ ఏడాదే తన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తనకు 31 ఏండ్లు వచ్చే సరికి 47,000 మందికి చదువు చెప్పించింది. 5 కోట్ల 34 లక్షల రూపాయలకు పైగా విరాళాలు సేకరించి స్కూలు ఫీజులు చెల్లించింది. చిన్న వయసులో పెద్ద సంకల్పంతో ముందుకు వెళ్తున్న నిశితను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
చుట్టూ ఉండేవాళ్ల కోసం మనవంతు సాయం అందించాలన్న దృక్పథాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి అలవర్చుకున్నాను. ఎందుకంటే మేం పండుగల్ని అనాథ పిల్లలతో కలిపి చేసుకునే వాళ్లం. శరణాలయాల్లో ఉండే పేద పిల్లలను అమ్మానాన్న అప్పుడప్పుడూ మా ఇంటికి తీసుకొస్తుండే వారు. మాతోపాటే భోజనం పెట్టేవాళ్లు. మిఠాయిలు తినిపించే వారు. మా బెడ్రూమ్లోనే వాళ్లూ నిద్రపోయే వాళ్లు. ముఖ్యంగా పండుగలప్పుడు తప్పకుండా అక్కడి పిల్లల్ని తీసుకొచ్చేవారు. వారం పది రోజులు వాళ్లు మాతోనే ఉండేవారు. వేసవి సెలవుల్లోనూ అంతే. ‘మనమంటే చుట్టాలింటికెళతాం. వాళ్లెక్కడికి వెళతారు’ అనేవారు నాన్న. ‘నిజమే కదా…’ అనుకునేదాన్ని. ఆ కారణంగానే నాది అన్న కోణంలో సమాజాన్ని చూడటం అలవాటైంది. ముఖ్యంగా అందులో బలహీనులెవరు, వాళ్లకు మనం ఏం చేయగలం అన్న ఆలోచనలు వస్తుండేవి. అప్పుడే నా దృష్టి ఆడపిల్లల చదువు మీద పడింది.
మేం బడిలో చదివేటప్పుడు ఇండ్లలో పనిచేసే వాళ్లు వెంట పిల్లల్ని తీసుకొచ్చేవారు. అందులో ఎక్కువగా ఆడపిల్లలే ఉండేవాళ్లు. పేదరికంలో ఉన్నప్పుడు అందరు పిల్లల్నీ ప్రైవేటు స్కూలుకు పంపించే స్తోమత వాళ్లకు ఉండదు. అలాంటప్పుడు ఆడపిల్లల చదువునే పక్కన పెడతారు. వాళ్లను చూస్తే నాకు ‘అయ్యో!’ అనిపించేది. నా పదిహేనేండ్ల వయసులో.. ఒకసారి నాన్నతో.. ‘నాన్నా! చదువుకోలేని ఆడపిల్లల్ని మనం చదివిద్దాం. అందరూ స్కూలుకు వెళ్తే బాగుంటుంది కదా!’ అన్నాను. ‘అవునా… సరే. ఏం చేస్తావ్’ అన్నారు నాన్న. ‘నా పాకెట్ మనీ ఉంది. మీరు కొంచెం డబ్బులివ్వండి. ఇంకా మనకు తెలిసిన వాళ్లెవరినైనా అడిగి స్కూలు ఫీజులు కడతాను’ అన్నాను. అలా నిరుపేదలు, ఇండ్లలో పనిచేసుకునే వాళ్లు, రిక్షావాళ్లు… ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు 151 మందిని గుర్తించి తొలి ఏడాది వాళ్లకు ఫీజులు కట్టాను. వాళ్లంతా స్కూల్లో చేరినందుకు ఎంతో సంతోషపడ్డారు. అది మొదలు ఇప్పటిదాకా ఆ పని ఆపలేదు. అలా మొత్తం 47 వేల మందికి చదువు చెప్పించాం. ఈ ఒక్క ఏడాదే నాలుగువేల మంది ఈ విరాళాల ద్వారా చదువుకుంటున్నారు. ఇందుకు రూ.58 లక్షల విరాళాలు సేకరించాను. ఏడాదికి కోటి రూపాయలు చదువు కోసం జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతోపాటు, ఎలాంటి ఆదరువూ లేని 230 మంది వృద్ధులకు రోజూ టిఫిన్ బాక్సులు పంపుతున్నాం. డబ్బు, చూసుకునే వాళ్లు కూడా లేని వృద్ధులను గుర్తించి ఆ చుట్టుపక్కల ఆసక్తి ఉన్న గృహిణితో మాట్లాడి వాళ్లకు వేళకు భోజనం పంపేలా చూస్తున్నాం. అందుకుగాను ఆ గృహిణులకు నెలకు ఇంత మొత్తం అని డబ్బును చెల్లిస్తాం. అలా పెద్దవాళ్లకే కాదు, ఆమెకు కూడా సాయం చేసినట్టు అవుతున్నది.
‘ఎలాంటి ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్నీ ఆశ్రయించకుండా, ఒక్కరే కొన్ని కోట్ల రూపాయల విరాళాలు ఎలా సేకరించారు?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ప్రతి విషయంలోనూ పారదర్శకత… అన్నది నా మీద నమ్మకాన్ని పెంచింది అనుకుంటున్నా. ఎందుకంటే, తొలిరోజుల్లో నేను ఫండ్ రైజింగ్ మొదలుపెట్టినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ వెయ్యి రూపాయలను డబ్బుగా తీసుకునే దాన్ని కాదు. కేవలం చెక్కు రూపంలో, అది కూడా పాఠశాల పేరు మీద తీయించేదాన్ని. దాన్ని పాఠశాల వాళ్లకే ఇచ్చేసేదాన్ని. ఇప్పటికీ అంతే! అలాగే ఎవరైనా పిల్లల్ని చదివించదలుచుకుంటే వాళ్లు ఎవర్ని చదివిస్తున్నారో వాళ్ల ఫొటో, బయోడేటా, ప్రోగ్రెస్ రిపోర్టులు పంపిస్తాం. కాబట్టి తాము ఎవరికి సాయపడుతున్నారో దాతలకు తెలుస్తుంది. అదొక రకమైన సంతృప్తి కదా! మొత్తంగా చెప్పాలంటే, ఇక్కడ నేనొక మధ్యవర్తిని మాత్రమే. అందుకే మొదట్లో మా బంధువులు, నాన్న స్నేహితులు, తెలిసిన వాళ్లే దాతలుగా ఉంటే… ఇప్పుడు పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా మాకు విరాళాలు అందిస్తున్నాయి. వాళ్ల ప్రతి రూపాయినీ కేవలం అమ్మాయిల చదువుకు మాత్రమే వినియోగిస్తున్నామన్న కచ్చితమైన నమ్మకం కలిగించడమే ఇక్కడి విజయ రహస్యం. లేకపోతే పద్నాలుగు, పదిహేనేండ్ల కాలంలో 5 కోట్ల 34 లక్షల రూపాయలను స్కూలు ఫీజుల కోసం తీసుకురాగలిగే దాన్నే కాదు.
పేద, దిగువ మధ్యతరగతి ఆడపిల్లల్ని గుర్తించేందుకు దాని ద్వారా వాళ్ల చదువులకు సాయపడేందుకు మేం వడోదరలోని 200 స్కూళ్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ పద్నాలుగేండ్లలో మా ద్వారా చదువుకున్న పిల్లల్లో కొందరు ఇప్పుడు చార్టెర్డ్ అకౌంటెన్సీ చేస్తున్నారు. ఐటీ రంగంలో స్థిరపడ్డారు. వాళ్లను చూస్తే ఆనందమేస్తుంది. ఈ సేవకుగాను నాకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చినా పాఠశాలలో చేర్పించినప్పుడు పిల్లల ముఖంలో కనిపించే నవ్వే అన్నిటికన్నా గొప్ప ఆనందాన్నిస్తుంది. అందుకే నా పెండ్లి కూడా ఆర్భాటంగా కాకుండా సాదాసీదాగా చేసుకున్నా. దాని ఖర్చు స్థానంలో 21 మంది ఆడపిల్లల పేరిట 5 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 251 మంది పిల్లల స్కూల్ ఫీజ్ చెల్లించాను. విద్య అసలైన నిధి. ఒక పూట అన్నం పెడితే మళ్లీ ఆకలేస్తుంది. డబ్బో, వస్తువులో ఇస్తే ఎవరైనా తీసుకుపోతారు. ఎవ్వరూ మన దగ్గరి నుంచి లాక్కోలేనిది చదువొక్కటే. బలహీన వర్గాలైన ఆడపిల్లలకు చదువు అవసరం చాలా ఉంది. వాళ్లు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడితే గౌరవంగా బతకగలరు. అందుకే ఈ దారిలో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా. నాతోపాటు చాలామంది ఆడపిల్లలు ముందుకు దూసుకువెళ్తారుగా మరి!