చదివే రోజులు పోయి చూసే రోజులొచ్చాయని సోషల్ మీడియాలో అందరూ చెప్పుకొంటున్నారు. ఇదేమి చిత్రమో, అదే సోషల్ మీడియాలో పుస్తక పఠనానికి సంబంధించిన విశేషాలూ వైరల్ అవుతున్నాయ్! ఎప్పుడూ స్థానిక ఉద్యోగులు, విదేశీ పర్యాటకులతో రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్కేర్ ఇప్పుడు పుస్తక ప్రేమికులతో కిటకిటలాడిన ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో న్యూయార్క్ నగరంలోని టైమ్ స్కేర్ మొదటిది. ఇక్కడి దారుల్లో నడుస్తూ క్షణం ఆగిపోతే వెనకున్నవాళ్లు ముందుకుతోసే పరిస్థితి ఉంటుంది. అలాంటి చోట వందలాది మంది కూర్చుని ప్రశాంతంగా పుస్తక పఠనం చేశారు. ఆ ప్రాంతాన్ని చూసినవాళ్లు, దాని గురించి తెలిసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఆకాశహర్మ్యాల మధ్య ఉండే దారుల్లో ఎటు చూసినా కనిపించే జనం, ఆకట్టుకునే హోర్డింగులు, భారీ వీడియో స్క్రీన్లు, నియాన్ లైట్ల వెలుగు జిలుగులతోపాటు జనంతో కళకళలాడే ఈ రద్దీ ప్రదేశం ప్రశాంతంగా మారిపోవడం, పుస్తకపఠనానికి వేదిక కావడం చిత్రమే! ముందే ఇచ్చిన పిలుపు మేరకు వందలమంది పుస్తక ప్రేమికులు మంగళవారం ఉదయాని కల్లా టైమ్స్స్వేర్కి చేరుకున్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లను పక్కనపెట్టారు. వెంట తెచ్చుకున్న పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టారు. కొంతమంది సంగీతం వింటూ పుస్తక పఠనంలో మునిగిపోయారు. ఎన్నడూ లేని ఈ వింతను చూసి ప్రజలు, పర్యాటకులూ ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయి.. చూస్తూ ఉండిపోయారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘టైమ్ స్కేర్‌లో కాలం ఆగిపోయింది’ అని నెటిజన్లు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.