ఏం చేసినా సెల్ఫీ.. ఎక్కడికి వెళ్లినా ఫొటో. జ్ఞాపకం ఏదైనా అన్నిటినీ ఫోన్లోనే భద్రం చేస్తున్నాం. ఆండ్రాయిడ్ యూజర్లు వాటిని కచ్చితంగా గూగుల్ ఫొటోస్‌లోకి సింక్ చేసేస్తారు. దీంతో ఫోన్లో బిల్టిన్‌గా ఉన్న ఫొటో గ్యాలరీ ఆప్షన్ కంటే ‘గూగుల్ ఫొటోస్’ ఫీచర్‌కే ఎక్కువ దగ్గరయ్యారు. అందుకే గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ని మరింత కొత్తగా మలిచే పనిలో పడింది సదరు సంస్థ. హాట్ హాట్‌గా ‘కలెక్షన్స్’ ఫీచర్‌ని యూజర్ల ముందుకు తెచ్చింది. ఇప్పుడున్న ‘లైబ్రరీ ట్యాబ్’ స్థానంలో ఇది కనిపిస్తుంది. దీంతో మీ మొత్తం ఆల్బమ్స్‌ని కొత్తగా చూడొచ్చు. దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే… ఇంట్లో మన బీరువాలో దుస్తుల్ని కలెక్షన్స్ వారీగా ఎలా సర్దుకుంటామో అలాగే ఫొటోలను కూడా సర్ది మనకు చూపిస్తుందన్నమాట. అన్నీ ఒకేసారి చూసేందుకు ‘ఆల్ వ్యూ’ ట్యాప్ చేయొచ్చు. మీకు ఎవరైనా షేర్ చేసిన వాటిని ‘ఫేర్డ్ విత్ మి’లో చూడొచ్చు. మొత్తం ఆల్బమ్స్ అన్నీ ‘మై ఆల్బమ్స్’లో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ అప్డేట్ని యాక్సెస్ చేయొచ్చు. ప్రైవసీ నిమిత్తం వాడే ‘లాక్ ఫోల్డర్’ ఫీచర్‌ని కలెక్షన్స్‌లో ప్రత్యేకంగా సెట్ చేసుకునే వీలుంది.
గ్యాడ్జెట్‌పై ఏదైనా టైపింగ్ చేయడం గానీ, స్క్రీన్‌ను తాకడం గానీ ఇప్పుడు తగ్గించేశాం. మనకు ఏం కావాలన్నా వాయిస్ అసిస్టెంట్‌ను అడుగుతున్నాం. అంతలా పిలిస్తే పలికే అసిస్టెంట్లు తాకే తెరపై సిద్ధంగా ఉన్నాయి. అందుకే… ఇకపై గూగుల్ ఫొటోస్‌లో మీ గ్యాలరీలను బ్రౌజ్ చేసేటప్పుడు కూడా ‘ఫొటో అసిస్టెంట్’ని అడగొచ్చు. గూగుల్ ఏఐతో ఈ అసిస్టెంట్ పనిచేస్తుంది. అందుకే దీన్ని ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్‌గా పిలుస్తున్నారు. త్వరలోనే గూగుల్ జెమిని ఈ ఫీచర్‌ని మోసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నది.