గోరు చుట్టుపై రోకలి పోటు సామెత వినే ఉంటారు. అలాంటిదేనట గోళ్లకు వేసే నెయిల్ పాలిష్. గోళ్లరంగుతో ప్రమాదకరమైన ముప్పును కొని తెచ్చుకోవద్దని ఐరోపా దేశాలు ప్రజలకు సూచిస్తున్నాయి. అంతేకాదు హానికారక నెయిల్ పాలిష్లను నిషేధించాయి కూడా! ఈ నెల నుంచే ఐరోపాలోని అన్ని దేశాల్లో టైఫినైల్ ఫాస్ఫైన్ ఆక్సైడ్ (టీపీవో) ఉపయోగించి తయారు చేసిన నెయిల్ పాలిష్లను వాడొద్దని ప్రజలకు సూచిస్తూ, నిషేధించింది. టీపీవో రసాయనం వల్ల నెయిల్ పాలిష్ మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది వేసుకున్నప్పుడు గోళ్లు మరింత ముచ్చటగా కనిపిస్తాయి. ఈ కెమికల్ ప్రాణాంతకమైందని ఇటీవల గుర్తించడమే ఈ నిషేధానికి కారణం. కణంలోని డీఎన్ఏలో శాశ్వతమైన మార్పులకు కారకంగా (మ్యూటాజెనిక్గా) ఈ టీపీవో పనిచేస్తుందని గుర్తించారట శాస్త్రవేత్తలు.
డీఎన్ఏ, కణం, అవయవాల్లో మార్పులకు కారణమయ్యే టీపీవోను కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారకం)గా నిర్ధారించారు. ఇలాంటి నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ ఒక్కటే కాదు, సంతాన సమస్యలు, చర్మ రోగాలు వస్తాయని గుర్తించారు. టీపీవో ఉన్న ఇతర సౌందర్య సాధనాలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని యురోపియన్ దేశాలు తేల్చాయి. సెలూన్లు, బ్యూటీపార్లర్లు, కాస్మెటిక్ తయారీదారులు అత్యంత ప్రమాదకరమైన టీపీవో రసాయనానికి బదులుగా బెంజోయల్ పెరాక్సైడ్ (బీపీవో) లేదా తక్కువ ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించాలని సూచిస్తున్నాయి. ఇది ఐరోపా ప్రజలకే వర్తించే చట్టమే అయినప్పటికీ ప్రపంచంలోని ప్రజలందరూ గుర్తించాల్సిన హెచ్చరిక, ఆరోగ్య సూచన. అందం కన్నా అందమైన జీవితమే ముఖ్యం అనుకుని జెల్ నెయిల్ పాలిష్ కొనేటప్పుడు అందులోని రసాయనాలను శ్రద్ధగా చదివి కొనాలని నిపుణుల మాట.