తెలంగాణ తల్లి బతుకమ్మ తీరొక్క పూల కొమ్మ. అడవి పూలను అక్కున చేర్చుకున్న బతుకమ్మ ఘనతను నకాశీ చిత్తరువులో అచ్చెరువొందేలా చూపిస్తున్నది చేర్యాల ఆడబిడ్డ. బతుకమ్మ వైభవంతోపాటు నవరాత్రి ఉత్సవాలనూ వర్ణ రంజితంగా ఆవిష్కరిస్తున్నది నకాశీ కళాకారిణి నాగిళ్ల యామిని. తల్లిదండ్రుల
నుంచి వారసత్వంగా ఈ కళను అందిపుచ్చుకున్న ఆమె.. రామాయణ, మహాభారత ఇతిహాసాలకు రంగులద్దింది. ఇప్పుడు బతుకమ్మ ఆటను, దసరా సరదాలను నాలుగు థీమ్‌లుగా ఆవిష్కరిస్తూ తనప్రత్యేకతను చాటుకుంటున్నది. ప్లేట్లు, చీరెలు, చెక్కలపై బతుకమ్మ వైభవాన్ని సిత్రంగా నిలుపుతున్న యామినిని జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
తరాలుగా నకాశీ కళ మీద బతికే కుటుంబం మాది. పెండ్లయి, అత్తగారింటికి పోయినాంక కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న. నేను పుట్టింది, పెరిగింది అంతా చేర్యాలలోనే! అమ్మానాన్న ఇద్దరూ నకాశీ కళాకారులే. ఈ కళకు నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ఈ కళను నమ్ముకొని 500 కుటుంబాలు బతుకుతుండె. రాను రాను ఆదరణ తగ్గిపోయిందనే సాకుతో.. చాలా కుటుంబాలు ఈ కళకు దూరమైనయి. ఓ దశలో ఒక్క కుటుంబానికే పరిమితమైందట. నకాశీ కళను బతికిచ్చే క్రమంలో ఆ కుటుంబం నుంచి ఏడుగురు వారసులు తయారైనరట. మా కుటుంబం వారి వారసత్వంగా వచ్చిందే! మేమంతా ఈ కళనే ఊపిరిగా భావించి బతుకుతున్నం.
మా నాన్న ఏడో తరగతిలో ఉన్నప్పుడు నకాశీ పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నడట. పెండ్లయిన తర్వాత అమ్మకు కూడా నేర్పించిండట. నా చిన్నప్పుడు అమ్మానాన్నలు బొమ్మలు వేస్తున్నపుడు నేను ఆసక్తిగా గమనిస్తుండె. రంగులు అద్దుతుంటే భలేగా అనిపిస్తుండె. అట్లా తెల్వకుండనే నాకు నకాశీ పెయింటింగ్స్ మీద ఇష్టం ఏర్పడ్డది. నాతోపాటు మా చెల్లె కూడా అమ్మానాన్నకు సాయం చేసేది. అలా చిన్నప్పుడే నకాశీ కళను ఒంటబట్టించుకున్నం. నేను ఇంటర్ చేస్తున్నప్పుడు ఒక మహాభారతం పటం కావాలని ఆర్డర్ వచ్చింది. అప్పుడప్పుడే రంగులు వేయడం, మాస్కులు తయారు చేయడం చేస్తున్న నాతో ‘ఆ పటం నువ్వే ఎయ్యాలి’ అన్నడు నాన్న. భయంతో నాతోని కాదన్న. అమ్మానాన్న ధైర్యం చెప్పడంతో ఉత్సాహంగా ఆ పటం వేశాను. అలా తొలి ప్రయత్నమే పెద్ద పటం వేసి.. వాళ్ల మెచ్చుకోలు సంపాదించుకున్న.
అలా పెరుగుతున్న కొద్దీ.. నకాశీ కళపై పట్టు సాధిస్తూ వచ్చిన. అయితే, ఈ కళతో మన సంప్రదాయాలను, గ్రామీణ పండుగలను చాటి చెప్పాలని అనిపించింది. అందులో భాగంగానే ఈ బతుకమ్మ పండుగకు కొత్త థీమ్‌ను పరిచయం చేసినం. బతుకమ్మ పండుగంటేనే పూలను పూజించడం. అందుకే, తంగేడు, గునుగు పూలను కోసుకొచ్చే సందర్భాన్ని ఒక థీమ్‌గా తీసుకున్న, తెచ్చిన పూలను ఆడోళ్లంతా కలిసి బతుకమ్మను పేర్చుతున్నట్టు, బతుకమ్మ ఆడుతున్నట్టు, చివరిగా ‘వెళ్లిరా బతుకమ్మ’ అంటూ పూలదేవతను సాగనంపడం.. ఇలా మరో మూడు థీమ్‌లతో బొమ్మలు వేసిన. వీటిని క్లాత్ కాన్వాస్పైనే కాకుండా.. చీరెలపై, కలప పలకలపై కూడా వేస్తున్నా! బతుకమ్మతోపాటు జరిగే మరో సంబురం దేవీ నవరాత్రులు. ఈ సందర్భంగా అమ్మవారి అవతారాలు ప్రత్యేకంగా బొమ్మలు వేస్తున్నా! మన తెలంగాణలో దసరా అందరి పండుగ. పేదాగొప్ప తేడా లేకుండా అందరూ జమ్మి చెట్టు దగ్గర అలాయ్‌బలాయ్ చేసుకుంటరు. ఆ థీమ్తోని కొన్ని బొమ్మలు గీసిన. రావణ దహనానికి సంబంధించిన పెయింటింగ్స్ కూడా సిద్ధం చేస్తున్న. ఇవన్నీ ప్రత్యేకంగా ఉండాలని చాలా కసరత్తు చేసిన. ప్రతి రోజూ 20 పెయింటింగ్స్ వేస్తున్న! వీటికి మంచి ఆదరణ వస్తున్నది. మా కళతోపాటు మన పండుగలకూ గుర్తింపు వస్తుండటం ఆనందంగా అనిపిస్తున్నది.
ఇప్పటివరకు ఇంట్లో కంటే బయట గోడలపై ఎక్కువ బొమ్మలు వేసిన. బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం, సిద్దిపేట, పెద్దపల్లి, జనగామ కలెక్టర్ కార్యాలయాల్లో కనిపించే పెయింటింగ్స్ అన్నీ నేను వేసినవే. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా పల్లె జీవనాన్ని నా కుంచెతో ప్రతిబింబించిన. వాటితో పాటు చేర్యాలకే పరిమితమైన ఈ నకాశీ కళను దేశవ్యాప్తంగా విస్తరించాలనే కాన్పెప్ట్‌తో ఇప్పటివరకు నాగ్‌పూర్, ఖజురహో, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లి పలువురు క్రాప్ట్ డిజైనింగ్ నేర్చుకునే అభ్యర్థులకు నకాశీ ఆర్ట్‌పై శిక్షణ ఇచ్చిన కూడా! డిగ్రీ పూర్తి చేసిన నేను.. ఏ ఉద్యోగ ప్రయత్నమూ చేయలేదు. నకాశీ మాస్క్‌లు చేయడం, పెయింటింగ్స్ వేయడమే వ్యాపకంగా పెట్టుకున్న. ఇందులో ఆదాయం రాదని, భవిష్యత్ లేదని నా భర్త ఎన్నడూ అనలేదు. అరుదైన కళను భావితరాలకు అందించేలా కృషి చేయమని ఎప్పుడూ చెబుతుంటడు. ఆయన ప్రోత్సాహం నాకు మరింత బలాన్నిచ్చింది. మా చేర్యాల కళను అందరికీ చేరువ చేయాలన్నదే నా కోరిక. అందుకోసం పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా మున్ముందు పనిచేస్తాను!
నకాశీ పెయింటింగ్స్ ప్రధాన జానపద కళల్లో ఒకటి. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టడం దీని ప్రత్యేకత. పొడవాటి వస్త్రంపై ఇతిహాసాలు, పురాణాలు, కుల పురాణాలు బొమ్మలుగా వేస్తూ ఉంటాం. ఇందులోనే మాస్క్‌లు కూడా తయారు చేస్తుంటాం. ఇందుకోసం చింతగింజలు పట్టించి ఉడకబెట్టిన తరువాత దాన్ని చెక్కపొట్టుతో కలిపి చపాతీ పిండిలాగా చేస్తాం. మనకు కావాల్సిన సాంచలు చేసుకొని, చేతితోనే బొమ్మను తీర్చి దిద్దుతాం. దానికి రంగులు వేసి అందమైన రూపమిస్తాం. బయటి పెయింటింగ్స్‌తో పోల్చినప్పుడు మేము వేసిన పెయింటింగ్స్, తయారు చేసిన మాస్కులు వందేండ్ల వరకు పాడుకాకుండా ఉంటాయి. ప్లేట్లపై, గోడలపైన, కర్చీఫ్‌లపై, చేతి గాజులపైన కూడా మా పెయింటింగ్స్ కనిపిస్తాయి.
– రాజు పిల్లనగోయిన
– సి.ఎం. ప్రవీణ్