ముత్తమ్మ.. బెంగళూరులోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పుడే నాన్న మరణించారు. దీంతో కుటుంబ బాధ్యతలు తల్లి స్వీకరించాల్సి వచ్చింది. వితంతువుల మొహం చూడటానికి కూడా జనం ఇష్టపడని రోజుల్లో ఆ తల్లి మగరాయుడిలా కష్టపడింది. కూతుర్ని చదివించింది. సరోజినీ నాయుడు, కమలా నెహ్రూ తదితరుల వీరోచిత పోరాటాన్ని చూస్తూ పెరిగారు ముత్తమ్మ. చదువుల్లోనూ తను చురుకుగా ఉండేవారు.
పట్టా చేతికొచ్చాక, 1949 ప్రాంతంలో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి.. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు
ఎంపికయ్యారు. ఐఎఫ్ఎస్ సాధించిన తొలి మహిళ ఆమే. అప్పటి నిబంధనల ప్రకారం వివాహితలు ఐఎఫ్ఎస్కు అనర్హులు. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహమైనా సర్వీసు వదులుకోవాల్సిందే. విదేశాంగశాఖ రహస్యాలను ఎక్కడ భర్త చెవిన వేస్తారోనని పాలకుల భయం. అధికారస్వామ్యంలోనూ వివక్ష ఉండేది.
పదోన్నతి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ అప్పట్లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు ముత్తమ్మ. న్యాయస్థానం ఆమె వాదనను సమర్థించింది. ముత్తమ్మకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది ముత్తమ్మ శతజయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. కనీసం అప్పటివరకైనా విదేశాంగ శాఖలోని కొన్ని కీలక విభాగాలలో మహిళల ప్రాతినిధ్యం పెంచుతారేమో చూడాలి!