సంగీతం కాలక్షేపానికి సాధనం కాదు. శ్రావ్యమైన సంగీతం ఓ థెరపీ. మనసును ప్రశాంతంగా ఉంచే సాధనం ఇది. సంగీతానికి రోగాలను నయం చేసే శక్తి ఉందని పలు పరిశోధనల్లో తేలింది. చక్కటి పాటలు, మ్యూజిక్ వినడం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగుతుందనీ, ఊపిరితిత్తులు లయబద్ధంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమృతగానం వింటూ ఆదమరిస్తే.. మానసిక ఆందోళనలు తోకముడుస్తాయని అంటున్నారు.
ఒత్తిడి నుంచి ఉపశమనానికి సంగీతాన్ని మించిన మార్గం లేదు. అయితే, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు పాటలు కాకుండా.. వాద్య సంగీతం వింటే మరింత మేలు కలుగుతుందట. ఉదయం కోడి కూసే వేళకు తోడిరాగం ఆస్వాదించండి.. తక్షణ ఉపశమనం లభించడం ఖాయం.
పాటలు వింటూ వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుంది. బరువు తగ్గాలని భావించేవారు సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఫలితాలు బాగుంటాయట. మనలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉండవచ్చు.
ఒళ్లు నొప్పులు తగ్గించడంలోనూ సంగీతం గుణం చూపిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అందుకే కొందరికి సర్జరీ సమయంలో, ఆ తర్వాత కూడా మంచి సంగీతం వినమని డాక్టర్లు చెబుతారు. గాయాలపాలైనప్పుడు రోజూ సంగీతం వినడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
పిల్లల మెదడు ఎదుగుదలకూ సంగీతం తోడ్పడుతుంది. జోల పాటలు, రైమ్స్ వంటివి పిల్లల్లో ఐక్యూ స్థాయిని పెంచుతాయి. పాటలు వింటూ పెరిగే పిల్లలు, మిగతా వారితో పోల్చితే మరిన్ని తెలివితేటలు కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు మంచి సంగీతం వినడం వల్ల వారి కడుపులోని బిడ్డ కదలికల్లో మార్పు వస్తుందట. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లోనూ ఆరోగ్యం మెరుగయ్యేందుకు సంగీతం సాయపడుతుంది.
ఎన్నో మానసిక వ్యాధుల చికిత్సలో సంగీతం ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ సమస్య ఉన్న వారు సంగీతం వింటే మతి మరుపును అధిగమించవచ్చు. ఆటిజంతో బాధపడుతున్న వారికి మ్యూజిక్ థెరపీ వల్ల వారి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. డిప్రెషన్, ఆత్రుత, కోపం, భయం వంటి వాటిని తగ్గించే శక్తి సంగీతానికి ఉంది.